Kantamneni Uma Maheshwari: మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీఆర్ నాలుగో కుమార్తె అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం (ఆగస్టు 3) ఉదయం ఆమె చివరి క్రతువు జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 9లో ఉన్న ఆమె ఇంటి నుంచి మొదలైన ఉమామహేశ్వరి అంతిమ యాత్ర ఫిల్మ్ నగర్ సమీపంలోని మహా ప్రస్థానం శ్మశాన వాటిక వరకూ కొనసాగింది. ఉమా మహేశ్వరికి ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. అంతిమ సంస్కారాలకు టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలక్రిష్ణ సహా కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.


ఎన్టీఆర్ కుమార్తె కంఠ‌మనేని ఉమామహేశ్వరి ఈనెల 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమామహేశ్వరి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్ నాల్గో కుమార్తె. ఇటీవలే కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తె వివాహం జరిగింది. విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  


ఆరోగ్య సమస్యలే కారణమా? 


దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె సోమవారం సూసైడ్ చేసుకున్నారు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉమామహేశ్వరి ఇంటికి ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. 


ఎన్టీఆర్ చిన్న కూతురు 


మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 12 మంది సంతానం ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఎన్టీఆర్ కు  జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి నలుగురు కుమార్తెలు ఉన్నారు.  ఉమామహేశ్వరి గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం అయింది.