Casino Issue:  చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. చికోటి ప్రవీణ్ బృందాన్ని అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు ప్రవీణ్, మాధవ రెడ్డి, సంపత్.. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. 11 గంటల నుండి వీరిని అధికారులు ప్రశ్నించారు. మొదట ప్రవీణ్, మాధవ రెడ్డి, సంపత్ లను కలిపి అధికారులు విచారించారు. తర్వాత వారిని ఒక్కొక్కరిగా విచారించారు. క్యాసినో, హవాలా, ప్రముఖులతో కనెక్షన్లు లాంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా క్యాసినో దందాలో విదేశీ లావాదేవీలు, హవాలాకు సంబంధించి తమ దర్యాప్తులో బయట పడ్డ అంశాలను బట్టి ప్రవీణ్ బృందాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నలు అడిగారు. 


దాదాపు 12 గంటలపాటు ప్రశ్నల వర్షం..


దాదాపు 12 గంటల పాటు ప్రవీణ్, మాధవ రెడ్డి, సంపత్ లను అధికారులు విచారించారు. బ్యాంకు లావాదేవీలు, విదేశాల్లో జరిగిన క్యాసినో వ్యవహారంపై కూపీ లాగారు. చికోటి ప్రవీణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను నమోదు చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖ లతో ఉన్న లింకులపై ఈడీ ఆరా తీశారు. క్యాసినోలు నిర్వహిస్తూ... ప్రముఖులను చార్టర్ విమానాల్లో నేపాల్, బ్యాంకాక్ తరలించడం, పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం దారి మళ్లింపు, బంగారం అక్రమంగా దేశంలోకి తీసుకు రావడం, హవాలా కార్యలాపాలు తదితర అంశాలపై ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. 


ఈడీ దేని గురించి విచారిస్తోంది..?


తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారాలు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్ బృందాన్ని లోతుగా ప్రశ్నించింది. హవాలా ద్వారా నగదు బదిలీ వ్యవహారంలో ఈడీ అధికారుల ప్రశ్నలకు ప్రవీణ్, మాధవ రెడ్డి తడబడినట్లు తెలుస్తోంది. క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకు వెళ్లడం సాధ్య పడదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చే వారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. 


ప్రవీణ్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు..?


ప్రవీణ్ బృందం గత కొన్ని సంవత్సరాలుగా విదేశాల్లో క్యాసినోలకు వెళ్లిన ప్రముఖుల సమాచారం విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో ద్రవ్య మారకం జరిగనట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దాని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీల్లోని ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్లు బయట పడితే... రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మరికొంత మందికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.