Telugu breaking News: కాంగ్రెస్ 'చలో సెక్రటేరియట్' ఉద్రిక్తత - ఏపీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 22 Feb 2024 02:38 PM
కాంగ్రెస్ 'చలో సెక్రటేరియట్' ఉద్రిక్తత - ఏపీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్

మెగాడీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన 'చలో సెక్రటేరియట్' కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వైఎస్ షర్మిల సచివాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. ఆమెను ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారనే దానిపై స్పష్టత లేదు.

'ఛలో సెక్రటేరియట్'కు కాంగ్రెస్ పిలుపు - హస్తం నేతల గృహ నిర్బంధం, ట్విట్టర్ వేదికగా షర్మిల ఆగ్రహం

నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా.? అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 'ఛలో సెక్రటేరియట్'కు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం పోలీసులు అక్కడికి భారీగా చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు.

Background

Latest Telugu breaking News:  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి జోష్ తీసుకొచ్చిన షర్మిల ఇవాళ మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు పరిమితమైన ఆమె... తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్న డిమాండ్‌తో రోడ్లపైకి వస్తున్నారు. చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. 


చలో సెక్రటేరియట్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు రాకుండా కట్టడి చర్యలు తీసుకున్నారు. ముఖ్య నాయకులను హౌస్‌ అరెస్టు చేశారు. మరికొందర్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. 


పోలీసుల చేపట్టి చర్యలను ముందుగానే గ్రహించిన షర్మిల... ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. సీనియర్ నేత కేవీపీ నివాసంలో రాత్రి బస చేయాల్సిన ఆమె పోలీసులు హౌస్‌ అరెస్టు చేస్తారని తెలుసుకొని ఆంధ్రరత్న భవన్‌లోనే నిద్రించారు. ఈ ఉదయం 10 గంటలకు చలో సెక్రటేరియట్‌కి కదలి రావాలని పార్టీ శ్రేణులతో ఆమె పిలుపునిచ్చారు. 


నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే అరెస్ట్‌లు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? తాను ఒక మహిళనై ఉండి హౌస్‌ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ? అని నిలదీశారు. . మేము తీవ్రవాదులమా.. లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని  ఆపాలని చూస్తున్నారు అంటే... మాకు భయపడుతున్నట్లే కదా అర్థం అన్నారు. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం.. మమ్మల్ని ఆపాలని చూసినా, ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికేడ్లతో బందించాలని చూసినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదంటూ ట్వీట్ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.