Polavaram : ఆంధ్ర ప్రదేశ్ జీవ నాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్(new diaphragm wall) నిర్మాణం పనులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ - CWC) అనుమతి మంజూరు చేసింది. ఇటీవలే ప్రాజెక్ట్ పునఃనిర్మాణానికి నడుంబిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుమారు రూ.1000కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఆ తర్వాత వెంటనే దీనిపైనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(Earth Come Rock Fill Dam) పనులు కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రంగం సిద్ధం
ఈ రోజు ప్రారంభించనున్న పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను అధికారులు ఈ రోజు ఆరంభించనున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన పాత డయాఫ్రం వాల్ కు 6 మీటర్ల ఎగువన 1.396 కిలోమీటర్ల పొడవు, 1.5మీటర్ల మందంతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ కాంక్రీట్ - టీ 5 మిశ్రమాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్ మీటర్లకుపైగా ప్లాస్టిక్ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించనున్నారు. ఈ పనులను విదేశీ కంపెనీ అయిన బావర్ చేపడుతుండగా.. దీని కోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్లు వంటి భారీ యంత్రాలను వినియోగించనున్నారు. వీటన్నింటినీ జర్మనీ నుంచి తెప్పించినట్టు సమాచారం. డయాఫ్రం వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలుపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వంలో దెబ్బతిన్న డయాఫ్రం
గతంలో తెలుగుదేశం(TDP) హయాంలోనే డయాఫ్రం వాల్ ను నిర్మించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2020లో వచ్చిన గోదావరి వరదలకు డయాఫ్రం వాల్ మూడు చోట్ల దెబ్బతింది. చాలా చోట్ల ఇసుక కోతతో అగాధాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం వాటన్నింటినీ పూడ్చేసి, ఇసుకను వైబ్రో కాంపక్షన్ విధానం లో గట్టిపరిచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంను డయాఫ్రం వాల్‌పైనే నిర్మించనున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తయితే గోదావరి నీటిని రిజర్వాయర్‌లో ఒడిసిపట్టేందుకు వీలవుతుంది. అనుకున్నట్టుగా ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే దాదాపు 194 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Chandrababu on Population: ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !