Team India Squad For ICC Champions Trophy: వచ్చేనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. అయితే ఈ టోర్నీకి కెప్టెన్ గా రోహిత్ శర్మే ఉండనున్నాడు. ముంబైలో రోహిత్ తో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించాడు. వచ్చేనెల 6 నుంచి ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు కూడా టీమ్ ను ప్రకటించింది. మెగాటోర్నీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగ పడనుంది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో రోహిత్ తనంతట తాను తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ కెప్టెన్సీకి ముప్పు వచ్చినట్లేనని ప్రచారం జరిగింది. అయితే వచ్చే చాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ కే సారథ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించింది. పేసర్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయపడిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరును లిస్టులో ప్రకటించింది.
కరుణ్ నాయర్ కు నో చాన్స్..భారత క్రికెటర్ కరుణ్ నాయర్ కు మెగాటోర్నీలో అవకాశం దక్కలేదు. తను ఈ మధ్య అద్భుతమైన ఆటతీరుతో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు. ఇంతకాలం అతని పేరు ఎక్కడ వినపడకపోయినా, చాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటనకు ముందు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. దేశవాళీ ప్రముఖ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ వన్డే ఫార్మాట్లోకి తనను ఎంపిక చేయాలని డిమాండ్ ను బలంగా కలిగించాడు. ఈ ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతున్న కరుణ్.. 752 సగటుతో 752 పరుగులు చేశాడు. అంటే తాను బరిలోకి దిగిన ఇన్నింగ్స్ ల్లో ఒకే ఒక్కసారి ఔటయ్యాడు. ఐదు సెంచరీలు చేసి సత్తా చాటాడు. అయితే అతడిని జట్టులోకి ఎంపిక చేస్తారని పలువురు భావించారు. అయితే 33 ఏళ్ల కరుణ్ కంటే కూడా యువకులపైనే టీమ్ మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టింది.
శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ..చాలాకాలం తర్వాత శ్రేయస్ అయ్యర్ భారత జెర్సీని ధరించనున్నాడు. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ లో ఆడిన తర్వాత అడప దడపా మాత్రమే తను టీమిండియాలోకి వచ్చాడు. అటు టెస్టు జట్టులో స్థానం లేకపోవడంతోపాటు ఇటు టీ20 జట్టులోనూ విపరీతమైన పోటీ వల్ల తనకు ఇటీవల స్థానం దక్కలేదు. 2023లో తను చివరి టీ20 ఆడాడు. వన్డేల విషయానికొస్తే గత ఆగస్టులో చివరిసారి శ్రీలంకపై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక టెస్టుల్లోనూ తను రెగ్యులర్ ప్లేయర్ కాదు. గతేడాది ఫిబ్రవరిలో చివరిసారిగా ఇంగ్లాండ్ పై చివరి టెస్టు ఆడాడు. మరోవైపు ఇటీవల టీ20లు, టెస్టుల్లో ఇరగదీస్తున్న తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా లక్కు కలిసి రాలేదు. ఈ ఫార్మాట్ కు తనను పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు వన్డే జట్టుకు శుభమాన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. కెప్టెన్సీపై ముందుచూపుతోనే ఈ నిర్ణయంతీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మెగాటోర్నీలో రోహిత్ తో కలిసి గిల్ ఓపెనింగ్ చేసే అవకాశముండటంతో యశస్వి జైస్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.
ఛాంపియన్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ , యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్)