Hyderabad police continue search for Manish gang | హైదరాబాద్: నగరంలోని అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి కనిపించింది. కాల్పుల జరిపిన నిందితుల్లో ఒకడిని మనీశ్‌గా గుర్తించారు. బిహార్‌కు చెందిన నిందితుడు మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనీశ్ మీద గతంలోనూ చోరీ, దోపిడీ చేసిన కేసులున్నాయని.. ఓ కేసు నుంచి తప్పించుకునేందుకు నేపాల్ వెళ్లి తిరిగొచ్చాడని పోలీసులు గుర్తించారు.
నిందితుడిపై బిహార్ ప్రభుత్వం రివార్డునిందితుడు మనీశ్‌పై బిహార్ లో ఇదివరకే రివార్డ్ ప్రకటించారు. పలు చోరీ కేసులలో కీలక నిందితుడిగా ఉన్న మనీశ్ ఆచూకీ సమాచారం అందిచాలని బిహార్ ప్రభుత్వం రివార్డ్ ప్రకటించింది. మనీశ్ తో పాటు ఉన్న దొంగలు ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70 లక్షలను చోరీ చేశారు. కర్ణాటకలో చోరీ చేసి తెలంగాణకు వచ్చి తలదాచుకున్నారు. ఇక్కడి నుంచి పారిపోయే క్రమంలో నిందితులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అఫ్జల గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితులు కాల్పులు జరిపిన అనంతరం ఆటోలో సికింద్రాబాద్ కు వెళ్లి అటు నుంచి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
అసలేం జరిగింది..మనీశ్ గ్యాంగ్ బీదర్‌లో ఏటీఎం వాహనంలో 93 లక్షలు చోరీ చేసింది. ఏటీఎం డబ్బులు తీసుకెళ్లే వాహనంపై కాల్పులు జరిపి ఇద్దరు సిబ్బందిని హత్య చేసి నిందితులు పరారయ్యారు. అటు నుంచి మెల్లగా హైదరాబాద్ కు వచ్చారు నిందితులు. అఫ్జల్ గంజ్ వచ్చి రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న నిందితులను చూసి ట్రావెల్స్ సిబ్బందికి డౌటొచ్చింది. వెంటనే ట్రావెల్స్ వర్కర్ కు నోట్ల కట్టలు ఇచ్చేందుకు చూడగా.. వద్దని వారించి బస్సు దిగాలని సూచించాడు. అదే సమయంలో బస్సులో బీదర్ పోలీసులు ఉన్నారని తెలియడం, ఆ సమయానికి ట్రావెల్స్ మేనేజర్ అక్కడికి రావడంతో ఆయనపై కాల్పులు జరిపి నిందితులు పరారయ్యారు. వీరి కోసం పది టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.