తెలుగు రాష్ట్రాల మధ్య నిన్నటిదాకా జల వివాదం నడిచింది. అది ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా విద్యుత్ బకాయిల వివాదం ప్రారంభమయింది. తమకు తెలంగాణ బాకీ పడిందని ఇవ్వడంలేదని.. ఇప్పించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాదు ఏపీ ప్రభుత్వం నుంచే తమకు రావాలని తెలంగాణ సర్కార్ వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బాకీల వివాదం ఎందుకొచ్చింది. వేల కోట్లు మీరంటే..మీరివ్వాలని ఎందుకు వాదించుకుంటున్నారు..?
తెలంగాణ బకాయిలు ఇప్పించాలని హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్ !
తెలంగాణకు తాము విద్యుత్ సరఫరా చేశామని దానికి గానూ రూ. 6,283.68 కోట్ల బకాయిలను చెల్లించడంలేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు ఈ కరెంట్‌ను ప్రభుత్వం సరఫరా చేసిందని పిటిషన్‌లో తెలిపింది. ఇందుకు గాను తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచి రావలసిన రూ. 3,441.78 కోట్ల అసలు, దానిపై ఈ ఏడాది ఆగస్టు వరకు వడ్డీ రూ. 2,841.90 కోట్లు రావాల్సి ఉందని ఏపీ జెన్‌కో ఎండీ పేరుతో పిటిషన్ దాఖలయింది. జెన్‌కో తరపున అప్పులు.. ఖర్చులన్నీ ఏకరువు పెట్టిన ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి కోరారు. పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రతివాదాలకు నోటీసులు జారీ చేసి అక్టోబరు 28కి విచారణ వాయిదా వేసింది.
చంద్రబాబు హయాంలో కరెంట్ సరఫరా .. బాకాయిలూ అప్పటివే !
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంటున్న కారణంగా.. విభజన చట్టంలో తెలంగాణకు ఎక్కువగా పంపిణీ కేటాయించారు. ఉమ్మడి జెన్‌కో విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం వాటాలున్నాయి. అదనంగా ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ డబ్బులు చెల్లించాలి. గతంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. విభజన అనంతరం తొలి ఏడాది 2014 నుంచి 2015 దాకా రూ. 1,033 కోట్లు రావలసి ఉంది. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య సమావేశం జరిగింది. నెలకు రూ. 150 కోట్ల చొప్పున డిస్కంలు చెల్లించడానికి అంగీకారం కుదిరింది. కానీ చెల్లించలేదు. మూడున్నరేళ్ల పాటు కరెంటు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అడిగి.. అడిగి చివరికి ఏపీ ప్రభుత్వం కరెంట్ సరఫరాను తెలంగాణ ప్రభుత్వానికి నిలిపి వేసింది. 2017 జూన్ నుంచి ఏపీ కరెంట్ తెలంగాణకు సరఫరా చేయడం లేదు. అలాగే అప్పటి వరకూ తీసుకున్న కరెంట్‌కు తెలంగాణ బిల్లులు చెల్లించలేదు. Also Read : ఏపీ జీవోల్లో అంత రహస్యం ఎందుకు ?
ఎన్సీఎల్టీలో కేసు వేసిన చంద్రబాబు ప్రభుత్వం - చర్చలతో పరిష్కరించుకుంటామని ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం !
అయినప్పటికీ కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే ఏం జరిగిందో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ ఉపసంహరించుకుంది. కీలకమైన వాదనలు వినిపించి.. విద్యుత్ సంస్థల నుంచి బకాయిలు రాబట్టుకోవాల్సిన సమయంలో ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం తీసుకోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. అందుకే చర్చించుకుని పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఎన్సీఎల్టీలో కేసును జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ సంస్థలా ప్రక్రియ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఎన్సీఎల్టీలో కేసు ఉపసంహరించుకుని హైకోర్టును ఆశ్రయించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఏపీ ప్రభుత్వమే తమకు బాకీ ఉందని తెలంగాణ సర్కార్ ఎదురుదాడి !
అయితే ఏపీ ప్రభుత్వమే తమకు బాకీ ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాలు సీపీడీసీఎల్ కింద ఉండేవి. ఆ రెండు జిల్లాల్లో విద్యుత్తు వ్యవస్థల అభివృద్ధికి సీపీడీసీఎల్ తీసుకొన్న రుణాలను రూ.1,932 కోట్లు చెల్లించామని తెలంగాణ వాదిస్తోంది. దీనికి వడ్డీ కలుపుకొంటే రూ.2,725 కోట్లు అవుతుందని చెబుతోంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసిందని దాని వల్ల తెలంగాణపై భారం పడిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వదిస్తోంది. అన్ని లెక్కలు తీస్తే తెలంగాణకే ఏపీ రూ.4,457 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ సీఎండీ ప్రభాకర్ రావు పేరుతో మీడియాకు సమాచారం ఇచ్చారు. చర్చలు జరిపితే ఏపీ బకాయిల వ్యవహారం బయట పడుతుందనే చర్చలకు రావడం లేదని దేవులపల్లి ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ వాదనను ఇప్పటి నుంచి కాదు... గత ప్రభుత్వం ఉన్నప్పటి నుండీ చేస్తోంది. Also Read : అదానీ - జగన్ సీక్రెట్ మీటింగ్ వెనుక నిజాలేంటి ?
నీటి వివాదం లాగే విద్యుత్ బకాయిల వివాదం కూడా వివాదాస్పదం అవబోతోందా..?
అయితే జెన్‌కోలకు.. డిస్కంలకు సంబంధం ఏమిటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. డిస్కంల తాలూకు బకాయిలను ప్రభుత్వం నుంచి రాబట్టుకోవచ్చు. వాటిని జెన్‌కోకు ముడిపెట్టడం సరికాదని అంటోంది. అంటే ఆ బకాయిల గురించి విడిగా ప్రభుత్వంతో ససంప్రదించాలి కానీ జెన్‌కో కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని కోరుతోంది. రెండు ప్రభుత్వాలు ఈ అంశంపై పట్టు వీడటం లేదు. ఈ కారణంగా విద్యుత్ బకాయిల వివాదం మరో జల వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.