Sri Veera Venkata Satyanarayana Swamy Temple: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారముగా విరాజిల్లుతున్న అన్నవరం సత్యదేవుని వార్షికకల్యాణ మహోత్సవాల్లో అపచారం జరిగింది. మే నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కళ్యాణోత్సవాల్లో భాగంగా కొండ దిగువన జరిగే వేడుకల్లో భక్తి పాటలకు బదులుగా హాట్ హాట్ మూవీ సాంగ్స్ పెట్టి రికార్డింగ్ డ్యాన్సులకు తీసిపోనట్లుగా చేయడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు అధికారులు, సిబ్బంది మద్యం మత్తులో తూగుతూ మసాలా సాంగ్స్‌కు స్టెప్పులేయడం వివాదాస్పదంగా మారింది.
మే 11 నుంచి వారం రోజుల ఉత్సవాలు..
ఆలయ నిర్వాహకులు మే 11 నుంచి 11 వరకు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల వేడుకలలో భాగంగా తొలిరోజు స్వామి, అమ్మవార్లను వధూవరులుగా ముస్తాబు చేశారు. 12వ తేదీన కళ్యాణ మహోత్సవం నిర్వహించి, స్వామి, అమ్మవార్లను పలు వాహనాలపై ఘనంగా ఉరేగించారు. కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు కొండ దిగువన గ్రామోత్సవం జరుపుతారు. ఇందులో భాగంగా భక్తి పాటలకు బదులుగా సినిమాల్లోని హాట్ సాంగ్స్ ప్లే చేశారు. అంతటితో ఆగకుండా అశ్లీలంగా స్టెప్పులేశారని భక్తులు ముక్కున వేలేసుకున్నారు. సత్యదేవుని కళ్యాణోత్సవాలు రికార్డింగ్ డాన్సులను సైతం మరిపించేలా చేశారని, అధికారులు మందు తాగి, మత్తులో తూలుతూ చిందులు వేయడంతో భక్తులు కంగుతిన్నారు. భక్తి పాటలకు బదులు సినిమా పాటలతో జరిగే కార్యక్రమాలు, అందులోనూ కొంతమంది దేవస్థానం సిబ్బంది సైతం మత్తులో ఊగుతూ సినిమా పాటలకు డాన్సులు వేయడం వివాదాస్పదంగా మారింది.
ముందు మందుబాబులు చిందులు వేస్తుంటే వెనుక స్వామివారి రథం ఊరేగింపు రావడం ఇంతకు భక్తి కార్యమా.. లేక రక్తి కార్యమా.. సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు ఇలాగేనా నిర్వహించేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వేడుకలకు దాదాపు రూ.70 లక్షల వరకు బడ్జెట్ కేటాయించింది ఇలాంటి అశ్లీల డ్యాన్సులు, మద్యం మత్తులో తూలుతూ రికార్డింగ్ డ్యాన్సులను గుర్తుకు తెచ్చేందుకా అని స్థానికులతో పాటు భక్తులు ఆలయ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.
సత్యదేవుని కళ్యాణోత్సవాలలో భక్తిపాటలకు బదులుగా మందు తాగి చిందులు వేయడంపై ఏపీ దేవాదాయ మంత్రి స్పందిచి బాధ్యతులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అన్నవరం స్వామివారి ఉత్సవాలలో ఆలయ ఈవోతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఇది జరిగిందని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తితో చేయాల్సిన పనులను మద్యం మత్తులో చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Also Read: CM Jagan Tour: 17న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన- విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన