కరోనా తర్వాత జిల్లా పర్యటనలు స్పీడ్ పెంచారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 


సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17న  కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి జరాక గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. 


సుమారు 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 


సీఎం పర్యటనకు కర్నూలు జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరుతారు. అక్కడ పది గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. అక్కడి నుంచి 10.50 నిమిషాలకు ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15 గంటలకు ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా చేరుకుంటారు. 


అక్కడ 11.15 నుంచి 11.30 గంటల మధ్య స్థానికులతో మాట్లాడతారు. 11. 35 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదన ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. 12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 12.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.