భానుడి భ‌గభ‌గ‌లు చికెన్ రేటుతో సామాన్యుడికి చుక్కలు క‌నిపిస్తున్నాయి. ఆల్‌టైమ్ రికార్డ్‌గా కేజీ చికెన్ ధర 300దాటింది. కేవ‌లం ప‌ది రోజుల్లో 120రూపాయ‌ల‌కుపైగా పెరిగిన చికెన్ ధర పెర‌గటం ఆశ్చర్యంగా ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి.


ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, వంట నూనెల ధరలు పెరిగి సామాన్యులను అష్టకష్టాలు పెడుతున్నాయి. అయితే తామేం తక్కువ అన్నట్లు చికెన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. 


కిలో చికెన్ ధర రూ. 320కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. మార్కెట్లో కిలో చికెన్ ధర రికార్డులు తిరగరాస్తోంది. నగరంలో  కిలో చికెన్ ధర రూ. 320కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. మే 1న 220 రూపాయ‌లుగా ఉన్న ధర గత 15 రోజుల్లో రూ. 120 మేర పెరిగింది. 


కొనసాగుతున్న ఎండల తీవ్రత, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా చికెన్ లభ్యం కాక ధరలు భారీగా పెరిగినట్లు చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ఈ మ‌ధ్యనే రంజాన్ ప‌ర్వదినం సంద‌ర్భంగా భారీగా చికెన్ వినియోగం జ‌రిగింది. వర్షాలు లేక కూరగాయల దిగుబడులు తగ్గడం, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వ్యాపారాలు జోరందుకోవడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. 


నాన్ వెజ్ ప్రియులు మాత్రం వారానికి ఒకసారి తినే చికెన్ ఇలా ఆకాశాన్ని తాకే విధంగా ధరలు  పెరగడం పట్ల అవేదన వ్యక్తం చేస్తున్నారు. సండే స్పెష‌ల్‌గా భావించి చికెన్ ధర కూడ అమాంతంగా పెరిగిపోవ‌టంతో కేజీ చికెన్‌ కొనే సామాన్యుడు పావు, అర‌కిలో కూర‌తో స‌ర్దుకునే ప‌రిస్థితి ఏర్పడింది.