2022లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ ఎవరు గెలుస్తారనేదానిపైనే 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా ఏబీపీ న్యూస్ -సీఓటర్-ఐఏఎస్ఎన్ ఈ ఐదు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పంజాబ్ మినహా మిగతా అన్ని చోట్ల భాజపా విజయం సాధించనున్నట్లు వెల్లడైంది. అయితే భాజపాకు గతంలో వచ్చిన మెజారిటీ ఈ ఎన్నికల్లో రాదని సర్వేలో తేలింది. ఇంకా సర్వే పూర్తి వివరాలు చూడండి.
యూపీలో భాజపా..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ భాజపాదే హవా నడుస్తుందని సర్వేలో తేలింది. ప్రస్తుతం ఇక్కడ భాజపానే అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని సర్వేలో వెల్లడైంది. అయితే గతంలో వచ్చిన స్థానాలకంటే 108 సీట్లు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2017 ఎన్నికల్లో భాజపా 325 చోట్ల విజయం సాధించింది. అయితే ఈ సారి ఆ మార్క్ అందుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
2022 జరగబోయే ఎన్నికల్లో భాజపా 217 స్థానాల్లో విజయం సాధించి అధికారం నిలుపుకుంటుందని వెల్లడైంది. ఇక్కడ భాజపాకు సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన పోటీ అని పేర్కొంది. ఎస్పీ 150 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపారు.
పంజాబ్‌లో తికమక..
పంజాబ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ లో ఆమ్‌ఆద్మీ అతిపెద్ద పార్టీగా నిలవనున్నట్లు వెల్లడైంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 51 స్థానాల్లో విజయం సాదిస్తుందని సర్వేలో తేలింది.. కాంగ్రెస్ 31, అకాలీదళ్ 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే భాజపాకు ఒక్క స్థానం రావడం కూడా కష్టమేనని సర్వే వెల్లడించింది. ఎందుకంటే ఏడాది కాలంగా కొత్త సాగు చట్టాలపై రైతులు పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్యమం పంజాబ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
గోవాలో కమలమే..
గోవాలో మళ్ళీ అధికారం భాజపానే వరించనున్నట్లు తెలుస్తోంది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో భాజపా 21 చోట్ల విజయం సాదిస్తుందని సర్వేలో వెల్లడైంది.
ఉత్తరాఖండ్‌లో కమల వికాసం..
ఇక 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో భాజపా అధికారం నల్లేరుపై నడకేనని తేలింది. కానీ గతంలో వచ్చినంత మెజారిటీ రాదని వెల్లడైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. భాజపా 38 చోట్ల విజయం సాదిస్తుందని పేర్కొన్నారు.
మణిపుర్‌లోనూ భాజపా..
మణిపూర్‌లో మరోసారి భాజపా పాగా వేయనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ లో భాజపా 27 చోట్ల విజయం సాదిస్తుందని, కాంగ్రెస్ 22 చోట్ల గెలుస్తుందని సర్వేలో తేలింది.
మొత్తానికి ఈ సర్వే ప్రకారం రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తేలింది. పంజాబ్‌లో మాత్రం భాజపాకు ఎదురుగాలి వీస్తోంది.
Also read: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
Also read: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి