సాండ్ విచ్ రూపంలో తరచూ పిల్లలకు పెట్టే బ్రేక్ ఫాస్ట్ బ్రెడ్. అయితే ఏ బ్రెడ్ ను వాడుతున్నారో, ఏ బ్రెడ్ ను వాడితే మంచిదో ఓసారి ఆలోచించి, వివరాలు తెలుసుకున్నాక పిల్లలకు తినిపిస్తే మంచిది. ఎందుకంటే బ్రెడ్ వాడకం చాలా అధికమైపోయింది. అలాంటప్పుడు దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 


మనం ఎక్కువ వాడే బ్రెడ్ లు రెండు రకాలు ఒకటి వైట్ బ్రెడ్, రెండోది బ్రౌన్ బ్రెడ్. రెండింటిలో వైట్ బ్రెడ్ ని మాత్రమే అధికంగా వాడుతుంటారు. కానీ దాని వాడకం అంత మంచిది కాదు. ఎందుకంటే దాన్ని మైదాతో తయారు చేస్తారు. మైదా తినడం శరీరానికి హానే కానీ, జరిగే మంచి సున్నా. కాబట్టి బ్రౌన్ బ్రెడ్ నే ఎంచుకోవాలి. 


బ్రౌన్ బ్రెడ్‌తో లాభాలు
దీన్ని గోధుమలతో చేస్తారు. అలాగే కొన్ని బ్రౌన్ బ్రెడ్ల తయారీలో చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు కూడా ఉపయోగిస్తారు. కాబట్టి తిన్నా పిల్లలతో పాటూ పెద్దలకూ మంచిదే.  శరీరానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ముఖ్యంగా ఫైబర్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి బ్రౌన్ బ్రెడ్ లో. అలాగే మిల్లెట్స్ తో చేసిన బ్రెడ్ లు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లు కూడా  అందుబాటులో ఉంటున్నాయి. వైట్ బ్రెడ్ కు బదులు వీటిల్లో వేటిని ఎంచుకున్నా మంచిదే. పోషకాలతో సహా, శక్తి కూడా అందుతుంది. వైట్ బ్రెడ్ తినడం వల్ల భవిష్యత్తులో మధుమేహం వంటి భయంకర రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి వైట్ బ్రెడ్‌ వాడకాన్ని పూర్తిగా మానేయడం ఉత్తమం. చాలా మంది బ్రౌన్ బ్రెడ్ చూడడానికి ముతకగా, మాడిపోయిన రంగులో కనిపిస్తుంది. అందుకే తినడానికి ఇష్టపడరు కానీ, అదే రంగులో ఉన్న బర్గర్లను బాగానే తింటున్నారుగా. అలాగే బ్రౌన్ బ్రెడ్ ను తినడం కూడా అలవాటు చేసుకోండి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...



Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి