మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు.. ‘శ్రీదేవీ సోడా సెంటర్’ అనే వెరైటీ టైటిల్‌తో వచ్చేశాడు. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేసింది. తమిళంలో ఇప్పటికే తన సత్తా చాటిన మన తెలుగుమ్మాయి ఆనందికి కూడా ఈ సినిమా హిట్ కావడం చాలా ముఖ్యం. సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం.. పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, ఆనంది నటించిన ‘జాంబీ రెడ్డి’ మాత్రం మంచి విజయమే సాధించింది. ఈ రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల కావడం విశేషం. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు, ఆనందిలో థియేటర్‌లో తమ బొమ్మకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలనే ఆతృతతో ఉన్నారు. మరి, శ్రీదేవిగా ఆనంది.. సూరిబాబుగా సుధీర్ బాబు ప్రేక్షకులను మెప్పించారా? సుధీర్ బాబు కష్టం ఫలించిందా? ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందా? 


కథ: సంజీవరావు (నరేష్) తన కూతురు శ్రీదేవి(ఆనంది) పేరు మీద ‘శ్రీదేవి సోడా సెంటర్’ నడుపుతుంటాడు. తండ్రి లేనప్పుడు శ్రీదేవి ఆ షాపు బాధ్యతలు చూసుకుంటుంది. ఆ ఊరిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే సూరిబాబు (సుధీర్ బాబు) ఓ గుడికి లైటింగ్ పెట్టే సమయంలో సోడాల షాపులో ఉన్న శ్రీదేవిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె వెంటపడతాడు. అలా ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే, వారి ప్రేమ సంజీవరావుకు ఇష్టం ఉండదు. అదే సమయంలో ఆ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ(పావెల్ నవగీతన్) శ్రీదేవిపై మనసు పడతాడు. సూరిబాబుది తక్కువ కులమని సంజీవరావుకు చెబుతాడు. సూరిబాబుతో పెళ్లికి నిరాకరిస్తాడు. కథ ఇలా సాగుతుండగా.. ఆ ఊర్లో కాశీ అనుచరుడి హత్య జరుగుతుంది. ఆ నేరం సూరిబాబుపై పడుతుంది. దీంతో సూరిబాబును జైల్లో పెడతారు. అయితే, సూరిబాబు నిజంగానే ఆ హత్య చేశాడా? కాశీ, సంజీవరావులు ఎలా చనిపోతారు? జైలు నుంచి వచ్చిన తర్వాత సూరిబాబు.. శ్రీదేవిని కలుస్తాడా? ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆ తర్వాత సూరిబాబు పరిస్థితి ఏమిటనేది వెండి తెర మీదే చూడాలి. 


విశ్లేషణ: ఈ కథ అంతా అమలాపురం బ్యాక్‌ డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమాకు ‘పలాస 1978’ డైరెక్టర్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించాడు. చెప్పాలంటే.. రొటీన్ ప్రేమ కథనే కొత్తగా చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. కొన్ని సీన్లను మనం ముందుగానే ఊహించుకోవచ్చు. అయితే, సినిమా టేకింగ్‌ను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఇక హీరో సుధీర్ బాబు విషయానికి వస్తే.. అమలాపురం యాసలో చాలా సహజంగా నటించాడు. సూరిబాబు పాత్రలో ఒదిగిపోయాడు. ఫైటింగ్, బోట్ సీన్లలో సిక్స్ ప్యాక్ బాడీని బాగానే ప్రదర్శించాడు. సుధీర్ బాబు ఈ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడనేది అర్థమవుతుంది. అలాగే, శ్రీదేవి పాత్రలో ఆనంది జీవించింది. లవ్ సీన్స్‌లో మెస్మరైజ్ చేసింది. తొలి భాగంలో హూషారైన పల్లెటూరి పిల్లలా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా నటించింది. 


ఈ సినిమాలో పల్లెటూరి అందాలను చాలా బాగా చూపించారు. చాలా రోజుల తర్వాత థియేటర్‌కు వెళ్తున్న ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. టేకింగ్ చాలా రిచ్‌గా ఉండటం వల్ల ప్రేక్షకుడు కుర్చీలకు అతుక్కుపోతారు. జైలు నుంచి వచ్చేసరికి పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. సూరిబాబుతో వెళ్లిపోడానికి సిద్ధంగానే ఉంటుంది. అక్కడే దర్శకుడు తన ప్రతిభ చూపించాడు. ఊహించని ట్విస్టుతో కథను కాస్త ఆసక్తికరంగా మార్చాడు. ఫలితంగా క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి కలుగుతుంది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్. ముఖ్యంగా ‘చుక్కల మేలం’ పాట వినసొంపుగా ఉంది. మొత్తానికి ఈ సినిమాను టైంపాస్ కోసం చూడవచ్చు. ప్రేమ కథలను ఇష్టపడేవారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. మొత్తానికి శ్రీదేవి సోడా సెంటర్‌.. పాత సీసాలోనే కొత్త సోడా నింపినట్లు ఉంది. 


విడుదల తేదీ: 27, ఆగస్టు, 2021
నటీనటులు: సుధీర్‌ బాబు, ఆనంది, నరేశ్‌, పావెల్‌ నవగీతన్, తదితరులు
దర్శకత్వం: కరుణ కుమార్‌
నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌ 



గమనిక : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.