సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినిమాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన హీరో. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే కృష్ణ ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. ఒకప్పుడు హాలీవుడ్ మాత్రమే పరిమితమైన ‘జేమ్స్ బాండ్’ చిత్రాలను తెలుగుతెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం ‘గూఢచారి 116’, తొలి ఫుల్‌స్కోప్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎంఎం చిత్రం ‘సింహాసనం’. ఇవన్నీ కృష్ణ నటించిన సినిమాలే. అంతేకాదు.. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం ‘భలే దొంగలు’ చిత్రాన్ని కూడా ఆయనే తీశారు. ‘సింహాసనం’ సినిమాను స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికత కలిగిన సౌండ్ టెక్నాలజీని వాడిన ఘనత కూడా కృష్ణకే దక్కుతుంది. ఆయన నటించిన తొలి తెలుగు, భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పటివరకు పౌరాణికాలు, జానపద, కుటుంబ చిత్రాలతో చప్పగా నడుస్తున్న తెలుగు సినీ రంగానికి హాలీవుడ్ రేంజ్ చిత్రాన్ని తీసి.. కృష్ణ పెద్ద సాహసమే చేశారు.
ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు: ఏడారులు, గుర్రపు ఛేజింగ్‌లు, నిధికోసం ఎత్తుకు పై ఎత్తులు, ఎంతో ఉత్కంఠ రేపే కథా కథనాలు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్ సీక్వెన్స్, హాలీవుడ్ చిత్రాలను తలదన్నే పిక్చరైజేషన్. మొత్తంగా తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ఈ సినిమా 50సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆగస్టు 27, 1971 న విడుదలై తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో మోత మోగించింది. అంటే.. ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా సినిమా తీసి చూపించారన్నమాట.
ఆ పాట కోసం డార్జిలింగ్‌కు ప్రయాణం: మోసగాళ్లకు మోసగాడు దేశవిదేశాల్లో ప్రదర్శితమై ప్రకంపనలు సృష్టించింది. తమిళంలో ‘మోసక్కారన్ కు మోసక్కారన్’ ఇంగ్లీష్ లో ట్రెజర్ హంట్ పెరు తో డబ్బింగ్ చేశారు. రిపీట్ రన్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోయిందని కృష్ణ చాలా సందర్భాల్లో చెప్పేవారు. వి ఎస్ ఆర్ స్వామి ఫోటోగ్రఫీ మాధవరావు గారి మేకప్ పనితనం ఆదినారాయణ రావు గారు స్వరాలు కూడా సినిమా ఘన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ మూవీలో కోరినది నెరవేరినది పాట షూటింగ్ కోసం అప్పట్లో చిత్రయూనిట్ ఏకంగా డార్జిలింగ్ వెళ్లడం చెప్పుకోదగిన విషయం.
షూటింగ్ టైమ్ లో అందరూ పెదవి విరిచారు, కానీ..: ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత చక్రపాణి ఒకసారి షూటింగ్‌కి వచ్చారు. సెట్‌లోని కౌబాయ్ వాతావరణం, గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. జనం మెచ్చారని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. అప్పటికే సగానికి పైగా సినిమా అయిపోయింది. దాంతో, కృష్ణ బృందం ముందుకే సాగారు. తొలి కాపీ వచ్చాకా ప్రివ్యూలు చూసినవారెవరూ, సరైన అంచనా చెప్పలేకపోయారు. హీరో ఎన్టీఆర్ సైతం ఈ సినిమా చూసి సూపర్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖానికి బఠాణీలు పెట్టుకుని: ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు ఓ సన్నివేశంలో చూపించాలి. ఇందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్ సి.మాధవరావుకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే బఠాణీలు తెప్పించి.. తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖానికి అంటించారు. ఈ సినిమా తర్వాత కృష్ణకు ఒకేసారి 20 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పట్లో ఈ సినిమాను రూ.6.30 లక్షల బడ్జెట్‌తో నిర్మించడం విశేషం. అప్పట్లో లక్షలు వెచ్చించడమంటే.. కోట్లతో సమానం. 1972లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సైతం ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్, రష్యా, స్పానిష్ భాషల్లో డబ్ చేసి సుమారు 125 దేశాల్లో విడుదల చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఎన్టీఆర్, ఏఎన్నార్ రాసిన లేఖలను ఈ కింది ట్వీట్లో చూడండి: