అసోంలో దుండగులు రెచ్చిపోయారు. డిమా హాసాఓ జిల్లా డియుంగ్ ముఖ్​లో బొగ్గు లోడుతో ఉన్న ఏడు ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదనమయ్యారు. చనిపోయిన ఐదుగురిని ట్రక్కు డ్రైవర్లుగా గుర్తించారు. ట్రక్కుల్లో మొత్తం 10 మంది ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ట్రక్కులన్నీ కాలి బూడిదయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






ఎవరు చేశారు?


డీఎన్​ఎల్​ఏ ఉగ్రసంస్థకు చెందిన సభ్యులే ఈ దుశ్యర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం వాటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. అసోంలో డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్​ఎల్​ఏ) ఉగ్ర సంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారినట్లు తెలుస్తోంది.


ఆగస్టు 14, 15 తేదీల్లో డిమా హాసాఓ సహా మరో 5 జిల్లాల్లో 36 గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చింది డీఎన్ఎల్ఏ. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజున డిమా హాసాఓ జిల్లాలోని మైబాంగ్​లో కాల్పులకు తెగబడింది. 


Also Read: Covid 19 India Cases: దేశంలో కొత్తగా 44,658 కేసులు.. కేరళలో తగ్గని వైరస్ ఉద్ధృతి


డిమా హలీమ్ దాఓబాగ్ (డీహెచ్ డీ) అనే అసోంలోని ఉగ్రవాద సంస్థ యాక్టివ్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దాల్మియా సిమెంట్ కు చెందిన 6 ట్రక్కులను అప్పుడు వీరు కాల్చి బూడిద చేశారు. 8 మందిని చంపేశారు. ఇప్పుడు డీఎన్ఎల్ఏ కూడా అదే దారిలో నడవడం ఆందోళన కలిగిస్తోంది.


ప్రస్తుతం ఈ డీఎన్ఎల్ఏ యాక్టివ్ అవడం వల్ల అసోంలో మళ్లీ కలకలం రేగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.


Also Read: Sonu Sood Brand Ambassador: కేజ్రీవాల్- సోనూసూద్ భేటీ.. కారణం ఇదేనా?