‘చి.ల.సౌ’ సినిమా హిట్ తర్వాత ‘అలా వైకుంఠపురంలో’ సినిమాతో ప్రేక్షకులను అలరించి సుశాంత్‌ ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఏ విధంగా కష్టాల్లో చిక్కుకుంటాడనేది ఈ చిత్రం కథాంశం. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎస్.దర్శన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సుశాంత్‏కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ప్రముఖ నటి భానుమతి మనవడు రవిశంకర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - హరీష్ కొయ్యల గుండ్ల ఈ చిత్రాన్ని AI స్టూడియోస్ అండ్ శాస్త్రీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాలి. కానీ, కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో థియేటర్స్ అందుబాటులో లేక విడుదలను వాయిదా వేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? 


కథ: నరసింహ యాదవ్ (వెంకట్) ఓ ఏరియాకు కార్పొరేట్. అక్కడ అతడి మాటకు తిరుగు ఉండదు. అయితే, ఆ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయనే కారణంతో యాదవ్ స్వయంగా తన మనుషులతో కాపాలా ఏర్పాటు చేస్తాడు. యాదవ్ చెల్లి మీనాక్షి (మీనాక్షి చౌదరి) ఓ ఆర్కిటెక్ట్ సంస్థలో ఇంటర్న్ కోసం జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు అరుణ్ (సుశాంత్)తో పరిచయం ఏర్పడుతుంది. ఎంతో జాలీగా ఉండే అరుణ్‌తో ప్రేమలో పడుతుంది. అరుణ్ కూడా ఆమెను ఇష్టపడతాడు. అరుణ్‌కు బైక్ నడపడం రాదు. దీంతో మీనాక్షి అతడికి బైక్ నడపడం నేర్పిస్తుంది. అయితే వారు తమ మనసులో మాటను ఒకరికి ఒకరు చెప్పుకోరు. మీనాక్షి తన మనసులో మాట చెప్పేందుకు లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాలని అరుణ్‌ను కోరుతుంది. దీంతో అరుణ్ కొత్త బైక్ కొని మీనాక్షి ఇంటికి వెళ్తాడు. అరుణ్ యాదవ్ ఏరియాలోకి వచ్చినప్పుడు అంతా అతడిని కొత్తగా చూస్తారు. దొంగతనాలు జరుగుతున్నందు వల్ల యాదవ్ మనుషులు అతడిని అడ్డుకుంటారు. మీనాక్షిని కలిసే కంగారులో నోపార్కింగ్ వద్ద తన కొత్త బైక్ పార్క్ చేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అరుణ్ ఆ ఏరియాలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఓ హత్య జరుగుతుంది. దీంతో ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన అరుణే ఆ హత్య చేసి ఉంటాడని స్థానికులు భావిస్తారు. ఆగ్రహంతో అతడి కొత్త బైకును నాశనం చేస్తారు. అప్పటికి అరుణ్.. మీనాక్షి ఇంట్లో ఉంటాడు. అయితే, ఆ హత్యలు ఎవరు చేస్తారు? యాదవ్‌కు అరుణ్ దొరికిపోతాడా? లేదా.. అనేది తెరపైనే చూడాలి. 


విశ్లేషణ: ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు కలిగిన థ్రిల్.. సినిమాను చూస్తున్నప్పుడు కలగకపోవచ్చు. కథలో కొత్తదనం ఉంది. కానీ, తగిన విధంగా నరేట్ చేయడంలో దర్శకుడు దర్శన్ తడబడ్డాడేమో అనిపిస్తుంది. కొన్ని సీన్లు సాగతీతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ను సో.. సో..గా నడిపేశాడు. పోనీ సెకండాఫ్‌లోనైనా థ్రిల్ చేస్తాడని భావించిన ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. సీరియస్ కథకు కామెడీ మేళవించడం వల్ల కథనం పట్టుతప్పిందేమో అనిపిస్తుంది. ఇక పాత్రల విషయానికి వస్తే.. సుశాంత్‌కు మంచి మార్కులే పడతాయి. గత సినిమాలతో పోల్చితే నటనలో కాస్త మెరుగైనట్లే కనిపిస్తుంది. మీనాక్షి తన పాత్రకు న్యాయం చేసింది. అయితే, సినిమా అంతా సుశాంత్ భుజాలపైనే నడుస్తుంది. ప్రతి నాయకుడు పాత్రకు వెంకట్ సెట్ కాలేదేమో అనిపిస్తోంది. అతడి క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాలేదు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, రవివర్మ, వెన్నెల కిషోర్ తమ పరిధి మేరకు నటించారు. సునీల్ పాత్ర ఎందుకు ఉందో కూడా అర్థం కాదు. అక్కడక్కడ కొన్ని సీన్లు కొత్తగా అనిపిస్తాయి. కానీ, ఓవరాల్‌గా చూస్తే రొటీన్‌గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. గ్యారీ బీహెచ్ అందించిన సంగీతం పర్వాలేదు. చివరిగా.. ‘చి.ల.సౌ’, ‘అలావైకుంఠపురంలో’ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న సుశాంత్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొడదామని అనుకున్నాడు. మరి అది సాధ్యమా కాదా అనేది ప్రేక్షకుడే చెప్పాలి. 


నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్,  వెన్నెల కిషోర్ , ప్రియదర్శి, అభనవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
దర్శకత్వం: ఎస్.దర్శన్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా వాస్త్రీ అండ్ హరీష్ గోయలగుంట్ల 
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటర్: గ్యారీ బీహెచ్


గమనిక : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Also Read: ‘వివాహ భోజనంబు’ రివ్యూ.. కరోనాకు కామెడీ ట్రీట్మెంట్
Also Read: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ: సీసా పాతదే.. సరుకే కొత్తది!