సినిమా రివ్యూ : పాప్ కార్న్ 
రేటింగ్ : 1.5/5
నటీనటులు : అవికా గోర్, సాయి రోనక్, చారు హాసన్ తదితరులు
ఛాయాగ్రహణం : ఎం.ఎన్‌. బాల్ రెడ్డి
సంగీతం : శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌
సహ నిర్మాతలు : అవికా గోర్‌, ఎం.ఎస్‌. చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి
స‌మ‌ర్ప‌ణ‌ : ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు
నిర్మాణ సంస్థలు : ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్
నిర్మాత‌ : భోగేంద్ర గుప్తా
కథ, మాటలు, కథనం, ద‌ర్శ‌క‌త్వం : ముర‌ళి గంధం
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2023


అవికా గోర్ (Avika Gor) నాయికగా నటించిన తాజా సినిమా 'పాప్ కార్న్' (Popcorn Telugu Movie). దీని ప్రత్యేకత ఏంటంటే... నటించడంతో పాటు నిర్మాణంలోనూ అవికా గోర్ పాలు పంచుకున్నారు. ఇందులో సాయి రోనక్ (Sai Ronak) హీరో. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ (Popcorn Movie Story) : తానొక అతిలోక సుందరి అని సమీరణ (అవికా గోర్) ఫీలింగ్. షాపింగ్ చేసి లిఫ్టు ఎక్కుతుంది. అందులో వచ్చిన పవన్ (సాయి రోనక్) ఆమెకు లాగిపెట్టి ఒక్కటి ఇస్తాడు. ఎందుకు? బాంబ్ బ్లాస్ట్ కావడంతో లిఫ్టులో ఇద్దరూ ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు? ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? ఆస్తమా వల్ల సమీరణ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే పవన్ ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ : తెలుగులో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువ. పైగా, లిఫ్టులో హీరో హీరోయిన్లు చిక్కుకోవడం కాన్సెప్ట్ మీద రాలేదు. 'థాంక్యూ బ్రదర్' సినిమాలో అనసూయ, విరాజ్ అశ్విన్ లిఫ్టులో చిక్కుకున్న అది వేరే కథ. దాంతో 'పాప్ కార్న్' మీద కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందు ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. అవికా గోర్ నిర్మాత కావడంతో కొందరు ఆసక్తి చూపించారు. పైగా... పాప్ కార్న్, థియేటర్లను వేరు చేసి చూడలేం. ఇలా బోలెడు కారణాలు ఉన్నాయి ఈ చిన్న సినిమా మీద దృష్టి పడటానికి! మరి, సినిమా ఎలా ఉంది? అంటే... 


'పాప్ కార్న్' థియేటర్లలోకి వెళ్ళిన ప్రేక్షకుల పరిస్థితి రాబోయే రెండు గంటలు ఏ విధంగా ఉంటుందనేది చెప్పడానికి... హీరోయిన్ ఇంట్లో అక్వేరియంలో చేప కింద పడిన సన్నివేశాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. చేప పిల్ల కింద పడితే గ్లాసు నీళ్లు, ఓ పేపర్ తీసుకు రావడానికి తల్లీకూతుళ్లు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ ఓవర్ యాక్షన్ వర్ణించడానికి మాటలు రావడం లేదు. లిఫ్టులో ఎంటరైన తర్వాత డోర్ మీద సన్నీ లియోన్ కండోమ్ యాడ్ పోస్టర్ ఉంటుంది. దర్శకుడి అభిరుచి ఏంటనేది అక్కడ అయినా సరే అర్థం చేసుకుని... థియేటర్ డోర్ వైపు నడిస్తే బయట పడతాం. లేదంటే హీరో హీరోయిన్లు లిఫ్టులో ఇరుక్కున్నట్లు మనం థియేటర్లలో ఇరుక్కుపోతాం.


హీరో హీరోయిన్లు లిఫ్టులో ఇరుక్కుపోవడమనే కాన్సెప్ట్ బావుంది. కానీ, సరైన సీన్లు ఎక్కడా లేవు. ఇద్దరి మధ్య పరిచయానికి, ప్రేమ కథకు మరొక అంశమే లేనట్టు అడల్ట్ డైపర్ వేశారు డైరెక్టర్. ఆయన క్రియేటివిటీలో అదొక పరాకాష్ట. మాటల్లో చెప్పడం వల్ల కావడం లేదు. మెయిన్ ట్విస్ట్ తీసుకెళ్ళి ఎలుక చేతిలో పెట్టారు. బీసీ కాలం నాటి డైలాగులతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులపై దాడి చేశారు. షార్ట్ ఫిల్ముకు ఎక్కువ, ఫీచర్ ఫిల్ముకు తక్కువ అన్నట్టు సాగిన ఈ సినిమాలో కాస్తలో కాస్త రిలీఫ్ ఏదైనా ఉందంటే సాంగ్స్. శ్రవణ్ భరద్వాజ్ పాటలు పర్వాలేదు. మెజారిటీ సినిమా లిఫ్టులో సాగడంతో నిర్మాతలు ఉన్నంతలో బాగా తీశారు.  


నటీనటులు ఎలా చేశారంటే? : సన్నివేశాల్లో కంటెంట్ లేకపోవడం వల్లనో... లేదా క్యారెక్టర్‌తో కనెక్ట్ కాకపోవడం వల్లనో... అవికా గోర్ ఓవర్ యాక్షన్ చేశారు. కొన్ని సీన్లలో ఏం చేయాలో తెలియనట్టు ముఖం పెట్టారు. పతాక సన్నివేశాల్లో తనలో నటిని బయటకు తీసుకొచ్చారు. భావోద్వేగభరిత సన్నివేశంలో చక్కటి నటన కనబరిచారు. సాయి రోనక్ ఓకే. సినిమాలో మ్యాగ్జిమమ్ సీన్లలో వీళ్ళిద్దరూ మాత్రమే కనిపిస్తారు. మిగతా వాళ్ళ పాత్రల నిడివి పరిమితమే. 


Also Read : 'ఫర్జీ' రివ్యూ : 'ఫ్యామిలీ మ్యాన్' రేంజ్ లో ఉందా? విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్‌ల వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : ఈ 'పాప్ కార్న్'లో ఉప్పు, కారం, తీపి వంటివి ఏవీ లేవు. పతాక సన్నివేశాల ముందు వరకు ఉన్నది అంతా చేదుగా తగిలే పాత మొక్కజొన్న పలుకులే. ఇది షార్ట్ ఫిల్మ్ కంటే ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్ కంటే చాలా చాలా తక్కువ. సినిమా ఎలా ఉన్నా పాప్ కార్న్ డబ్బా కొనుక్కుని థియేటర్లలో కూర్చునే ఓపిక, టైమ్, డబ్బులు ఉన్నవాళ్ళకు మాత్రమే ఈ సినిమా. లేదంటే మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. 


Also Read : 'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?