సినిమా రివ్యూ : అమిగోస్
రేటింగ్ : 2.25/5
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్
సంగీతం : జిబ్రాన్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి 
రచన, దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2023


నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). 'బింబిసార' విజయం తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. బాక్సాఫీస్ బరిలో సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో విజయాలు నమోదు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రమిది. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ ఎలా చేశారు? సినిమా ఎలా ఉంది (Amigos Review )?


కథ (Amigos Movie Story) : సిద్ధార్థ్ (నందమూరి కళ్యాణ్ రామ్) హైదరాబాద్ యువకుడు. తమ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాడు. ఇషిక (ఆషికా రంగనాథ్) మీద మనసు పారేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడాలని ప్రయత్నాలు చేస్తాడు. ఓ వెబ్సైట్ ద్వారా తనలాంటి మరో ఇద్దరు వ్యక్తులు... బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్, మంజునాథ్ హెగ్డేలను సిద్ధార్థ్ కలుస్తాడు. ముగ్గురూ క్లోజ్ అవుతారు. బెంగళూరు వెళ్లాలని మంజునాథ్, కలకత్తా వెళ్లాలని మైఖేల్... ఎవరి ఊరికి వారు బయలు దేరతారు. అంతకు ముందు హైదరాబాదులో ఎన్ఐఏ అధికారిని బిపిన్ అలియాస్ మైఖేల్ చంపేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తాను తప్పించుకుని సిద్ధార్థ్ అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. బిపిన్ అనుకుని ఎన్ఐఏ ఎవరిని అరెస్ట్ చేసింది? ఆ తర్వాత ఏమైంది? నరరూప రాక్షసుడు లాంటి బిపిన్ వేసిన అసలు ప్లాన్ ఏంటి? అతడి నుంచి సిద్ధార్థ్, మంజునాథ్ తప్పించుకున్నారా? లేదా? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ : 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో 'అమిగోస్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. అందులో నెగిటివ్ షేడ్ రోల్ చేస్తే, ఇందులో ఏకంగా విలన్ రోల్ చేశారు. అది హిస్టారికల్ అయితే... ఇది మోడ్రన్ మాఫియా బ్యాక్‌డ్రాప్. ట్రైలర్‌లో దర్శకుడు రాజేంద్ర రెడ్డి చాలా హింట్స్ ఇచ్చేశారు. సినిమాలో ఆ సస్పెన్స్ ఎలా మైంటైన్ చేశారు? అనేది చూస్తే... 


'అమిగోస్'లో కళ్యాణ్ రామ్ మూడు రోల్స్ చేశారు. అందులో ఒకరు విలన్. ముందు మిగతా ఇద్దరితో స్నేహం చేసి... ఆ తర్వాత వాళ్ళను చంపాలని చూస్తారు. ట్రైలర్ చూస్తే ఈ సంగతి అర్థం అవుతుంది. ట్విస్ట్ ఏంటనేది ముందు చెప్పినప్పుడు... స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసేలా సినిమా ఉండాలి. 'అమిగోస్'లో ఆ విధంగా క్యూరియాసిటీ కలిగించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. ప్రేమ కథ మరీ వీక్. హీరోయిన్ చెప్పే థియరీ రిపీట్ చేసి విసిగించారు. ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ మోడ్ మొదలై, ఆసక్తిగా ఉంటుందని అనుకుంటే... అక్కడ సాగదీత సహనానికి పరీక్ష పెడుతుంది. దర్శకుడు సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. కానీ, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యింది. థియేటర్లలో ప్రేక్షకుడు క్యారెక్టర్లతో కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ సీన్స్ లేవు. ఉన్నవి సోసోగా ఉన్నాయి.  


'ఎన్నో రాత్రులొస్తాయి గానీ...' సాంగ్ రీమిక్స్ వినడానికి, స్క్రీన్ మీద చూడటానికి బావుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఇంటర్వెల్ తర్వాత కొంత ఇంపాక్ట్ చూపించింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఓకే.  


నటీనటులు ఎలా చేశారంటే? : యాక్టింగ్ & యాటిట్యూడ్ పరంగా మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ వేరియేషన్ చూపించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న బిపిన్ రాయ్ / మైఖేల్ పాత్రలో నటన, వాయిస్ మాడ్యులేషన్ ఆకట్టుకుంటాయి. కళ్యాణ్ రామ్ తన వరకు న్యాయం చేశారు. ఆషికా రంగనాథ్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అమ్మాయి ముఖం కళగా ఉంది. కానీ, నటిగా తన ప్రతిభ చూపించే అవకాశం ఆమెకు రాలేదు. జస్ట్ గ్లామర్ డాల్ రోల్ అంతే! బ్రహ్మాజీ, సప్తగిరికి నవ్వించే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. 


Also Read : 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్, కాన్సెప్ట్ క్రియేట్ చేసిన క్యూరియాసిటీ... సినిమాలో కంటిన్యూ కాలేదు. ఓ పాట, కొన్ని సీన్స్ బావున్నాయి. అయితే, స్టార్టింగ్ టు ఎండింగ్ 'నెక్స్ట్ సీన్‌కు త్వరగా రా' అనేలా ఉంది. కళ్యాణ్ రామ్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా... ఆయన నటన బావున్నా... సినిమాను నిలబెట్టడం కష్టమే. 


Also Read : 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?