సినిమా రివ్యూ : మైఖేల్ 
రేటింగ్ : 2.25/5
నటీనటులు : సందీప్ కిషన్, గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనీష్ కురువిల్లా తదితరులు
మాటలు : త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి
ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్ 
సంగీతం : సామ్ సిఎస్
నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
కథ, కథనం, దర్శకత్వం : రంజిత్ జయకొడి
విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023


సందీప్ కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా నటించిన తొలి పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael Review). ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకున్నాయి. హీరోకి తోడు ప్రత్యేక పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఇతర పాత్రల్లో గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్ లాంటి తారాగణం ఉండటంతో సినిమాపై అంచనాలు పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది?


కథ (Michael Movie Story) : ముంబై మాఫియా సామ్రాజ్యానికి గురునాథ్ (గౌతమ్ మీనన్) తిరుగులేని రాజు. అతడిని భారీ ఎటాక్ నుంచి మైఖేల్ (సందీప్ కిషన్) కాపాడతాడు. ఆ తర్వాత గురునాథ్ నమ్మదగిన వ్యక్తుల్లో మైఖేల్ ఒకడవుతాడు. తనపై ఎటాక్ ప్లాన్ చేసిన వ్యక్తుల్లో రతన్ (అనీష్ కురువిల్లా) ను తప్ప మిగతా అందరినీ చంపేసిన గురునాథ్, అతడిని చంపే బాధ్యత మైఖేల్ చేతిలో పెడతారు. రతన్‌ను పట్టుకోవడం కోసం ఆమె కుమార్తె తీర (దివ్యాంశ కౌశిక్)ను ఫాలో అవుతాడు మైఖేల్. ఆ క్రమంలో ఒక్కటవుతారు. రతన్ చేతికి దొరికినా మైఖేల్ చంపకుండా వదిలేస్తాడు. ఎందుకు? ఆ విషయం తెలిసిన గురునాథ్ ఏం చేశాడు? మైఖేల్ చావాలని గురునాథ్ కుమారుడు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్), భార్య (అనసూయ) పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? మధ్యలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలు ఏమిటి? చివరకు, మైఖేల్ ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ : 'మైఖేల్'లో సందీప్ కిషన్ నోటి వెంట వచ్చిన డైలాగులు చాలా అంటే చాలా తక్కువ. అందులోనూ ముందు ముందుగా 'ఒక ఆడపిల్ల ముందు చేయి వేసే ముందు గుర్తు రావాలి... అమ్మ' అని ఓ డైలాగ్ ఉంటుంది. ఇదేమీ కొత్తది కాదు. ఈ సినిమాకూ, ఆ మాటకూ పెద్దగా కనెక్షన్ కూడా లేదు. అటువంటి మాటను చాలా సార్లు సినిమాల్లో విని ఉంటాం కదా! అదే విధంగా ఈ సినిమాలో కథనూ ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్టు ఫీలవుతాం. మరి, కొత్తగా ఏముంది? అంటే... 
'మైఖేల్' కథ, కథనాలు కొత్త కాకపోవచ్చు. కథను చెప్పిన తీరు 'కెజిఎఫ్'ను గుర్తు చేయవచ్చు. అయితే... కథ ముందుకు వెళుతున్న కొలదీ కథకు కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆ మేకింగ్ & ట్రీట్మెంట్, నేపథ్య సంగీతం మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది. రెట్రో స్టైల్‌లో బాగా తీశారు. యాక్షన్ సినిమా ప్రేమికులకు ఆ స్టైల్ బాగా నచ్చుతుంది.


కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బావుంది. కథా నేపథ్యానికి తగ్గట్టు లైటింగ్ థీమ్, కలర్ గ్రేడింగ్ చక్కగా చేశారు. సామ్ సిఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం బావుంది. కానీ, కథ డిజప్పాయింట్ చేస్తుంది. కథనం కూడా! దర్శకుడు రంజిత్ జయకొడి టేకింగ్ ఓకే. సినిమా చివరలో తనకు స్ఫూర్తి ఇచ్చిన సినిమాల పేర్లు కూడా వేశారు. అయితే...  ఆ కథ, అందులో ట్విస్టులు మాత్రం పవన్ కళ్యాణ్, ప్రభాస్ చేసిన తెలుగు సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమా నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. నెమ్మదిగా ముందుకు కదులుతుంది. డైలాగులు, హీరోకి ఇచ్చే ఎలివేషన్లు, సీన్లు... ప్రతి దాంట్లో 'కెజిఎఫ్'ప్రభావం కనపడుతుంది.  


నటీనటులు ఎలా చేశారంటే? : 'ప్రస్థానం' నుంచి ఇప్పటి వరకు సందీప్ కిషన్ చేసిన సినిమాలు చూస్తే... కోపం ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. అందులో ఓ రకమైన మాస్ ఉంటుంది. 'మైఖేల్' మాఫియా బ్యాక్‌డ్రాప్ కావడంతో మాసీగా చేసుకుంటూ వెళ్ళారు. గుండెల్లో అంతులేని బాధను బయటపెట్టలేని యువకుడిగా బాగా నటించారు. నటుడిగా సందీప్ కిషన్ మాస్ 'పంజా' ఇది. దివ్యాంశ కౌశిక్ ఓకే. మాఫియా డాన్ పాత్రలో గౌతమ్ మీనన్ నటన కంటే వాయిస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. 'మైఖేల్'తో వరుణ్ సందేశ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోవచ్చు. అనసూయ క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుంది. వరుణ్ సందేశ్ తల్లిగా, గౌతమ్ మీనన్ భార్యగా ఆవిడ కనిపించారు. 


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కనిపించేది కాసేపే! ఉన్నంత సేపూ ఆయనకు ఇచ్చిన ఎలివేషన్ బావుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ రోల్ కూడా కొత్తగా ఉండదు. కానీ, విజయ్ సేతుపతితో ఆమె సీన్స్ బావుంటాయి. 


Also Read : 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'మైఖేల్' - అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. కథ, కథనంలో కొత్తదనం ఉండదు. ఆల్రెడీ చూసేసిన సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే... మేకింగ్ స్టైల్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, సామ్ సిఎస్ సంగీతం కొంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'కెజిఎఫ్' తరహా సినిమాలు నచ్చే యాక్షన్ ప్రేమికుల కోసం మాత్రమే 'మైఖేల్'. నథింగ్ న్యూ! కొత్త కథతో ఈ తరహా సినిమా తీస్తే రిజల్ట్ వేరే రేంజ్‌లో ఉండేది.  


Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?