సినిమా రివ్యూ : హంట్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్, చిత్రా శుక్లా, 'మైమ్' గోపి, కబీర్ దుహాన్ సింగ్, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ తదితరులు
కథ, కథనం : బాబీ - సంజయ్
ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్
సంగీతం : జిబ్రాన్  
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్
రచన, దర్శకత్వం : మహేష్ 
విడుదల తేదీ: జనవరి 26, 2023


'హంట్' సినిమాతో సుధీర్ బాబు (Sudheer Babu) థియేటర్లలోకి వచ్చారు. ప్రచార చిత్రాల్లో యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డూప్, రోప్ లేకుండా యాక్షన్ చేయడం రిస్క్ అని తాను భావించడం లేదన్నారు సుధీర్ బాబు. క్యారెక్టర్ పరంగా కొత్త అటెంప్ట్ చేశానని, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందన్నారు. మరి, సినిమా ఎలా ఉంది? కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే భవ్య క్రియేషన్స్ సంస్థ ఈసారి ఎటువంటి సినిమా అందించింది? (Hunt Review)


కథ (Hunt Movie Story) : అర్జున్ (సుధీర్ బాబు) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. రోడ్డు యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోతాడు. ప్రమాదం జరగడానికి ముందు తన స్నేహితుడు, తోటి ఐపీఎస్ ఆఫీసర్ ఆర్యన్ దేవ్ ('ప్రేమిస్తే' ఫేమ్ .భరత్) మర్డర్ కేసులో దోషిని కనిపెట్టానని కమిషనర్ మోహన్ భార్గవ్ (శ్రీకాంత్)కి ఫోన్ చేస్తాడు. పేరు చెప్పే లోపు యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ కేసును అర్జున్ చేతుల్లో పెడతాడు మోహన్ భార్గవ్. గతం గుర్తు లేకపోవడంతో కేసును మళ్ళీ కొత్తగా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతడి ఇన్వెస్టిగేషన్ తీరు మీద టీమ్ నమ్మకం కోల్పోతుంది. క్రిమినల్ రాయ్ (మైమ్ గోపీ), కల్నల్ విక్రమ్ (కబీర్ సింగ్), టెర్రరిస్ట్ గ్రూప్ హర్కతుల్ మీద అర్జున్ అనుమానాలు వ్యక్తం చేస్తాడు. చివరకు, హంతకుడు ఎవరో ఎలా కనిపెట్టాడు? పతాక సన్నివేశాల్లో సుధీర్ బాబు ఇచ్చిన షాక్ ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ : 'హంట్' సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే... యాక్షన్ ప్యాక్డ్ సినిమా అన్నట్టు ఉంటుంది. అయితే... థియేటర్‌లోకి వెళ్లిన కాసేపటికి ఇది యాక్షన్ ఫిల్మ్ కాదని, థ్రిల్లర్ అని అర్థమవుతూ ఉంటుంది. గతం మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్, తన గతం ఎలా తెలుసుకున్నాడనేది క్లుప్తంగా 'హంట్' కథ.


సినిమా మొదలైన కొన్ని క్షణాల్లోనే కథలోకి తీసుకు వెళ్ళాడు దర్శకుడు మహేష్. అసలు టైమ్ వేస్ట్ చేయలేదు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడుగా ఉంటే బావుండేది. క్లైమాక్స్ ట్విస్ట్ మీద నమ్మకం పెట్టుకున్న దర్శకుడు... అక్కడి వరకు కొంత నిదానంగా తీసుకు వెళ్ళాడు. అది మైనస్ అయ్యింది. దానికి తోడు నేపథ్య సంగీతం కూడా ఆసక్తికరంగా లేదు. దర్శకత్వంలో లోపం వల్ల కొన్ని థ్రిల్స్ మిస్ అయ్యాయి. ఫస్టాఫ్ సాదాసీదాగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టులు రివీల్ అవుతాయి.
 
సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాత పెట్టిన ఖర్చును అరుల్ విన్సెంట్ స్క్రీన్ మీద చూపించారు. ప్రతి రూపాయి ఫ్రేములో కనబడుతుంది. యాక్షన్ బ్లాక్స్ నిడివి ఎక్కువ లేవు. ఉన్నంతలో ప్రతి యాక్షన్ సీక్వెన్సును సజహంగా తెరకెక్కించారు. ఒక్కటే పాట ఉండటం ప్లస్ పాయింట్. 


నటీనటులు ఎలా చేశారంటే? : సుధీర్ బాబు ఇంతకు ముందు 'వి'లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఖాకీ పాత్రకు కావలసిన పర్ఫెక్ట్ ఫిజిక్ ఆయనది. ఇప్పుడీ 'హంట్'లోనూ ఫిట్ & ఫ్యాబులస్ గా కనిపించారు. గతం మర్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో క్లూలెస్ ఎక్స్‌ప్రెషన్స్, ఆ యాక్టింగ్ బావుంది. క్లైమాక్స్ వచ్చేసరికి క్యారెక్టర్ పరంగా షాక్ ఇస్తారు. స్పాయిలర్స్ ఇవ్వడం కంటే ఆ షాక్ సినిమాలో చూడటం బావుంది. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, చిత్రా శుక్లా, కబీర్ సింగ్, మంజుల ఘట్టమనేని, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ తదితరులు నటించారు.


Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?


చివరగా చెప్పేది ఏంటంటే? : క్లైమాక్స్ ట్విస్ట్ నిజంగా షాక్ ఇస్తుంది. అయితే, అది ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేసేలా ఉండదు. మరీ డిఫరెంట్, సర్‌ప్రైజింగ్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు మాత్రమే నచ్చే అవకాశాలు ఉన్నాయి. 


Also Read : 'మిషన్ మజ్ను' రివ్యూ : రష్మిక 'మజ్ను' గురి తప్పిందా? బావుందా?