సినిమా రివ్యూ : పఠాన్
రేటింగ్ : 3/5
నటీనటులు : షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులతో పాటు అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవన్
ఛాయాగ్రహణం : సంచిత్ పౌలోస్
స్వరాలు : విశాల్ - చంద్రశేఖర్
నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా
నిర్మాత : ఆదిత్య చోప్రా
కథ, దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
విడుదల తేదీ: జనవరి 25, 2023
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన సినిమా 'పఠాన్' (Pathaan Movie). నాలుగేళ్ళ విరామం తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. 'జీరో' తర్వాత అతిథి పాత్రలు లేదంటే ప్రత్యేక పాత్రల్లో తెరపై కనిపించారు. ఈ సినిమాలో 'బేషరమ్ రంగ్...' పాటలో హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone) ధరించిన బికినీ రంగు వివాదాస్పదమైంది. మరి, సినిమా ఎలా ఉంది? 'పఠాన్'తో హీరోగా షారుఖ్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారా? (Pathaan Review)
కథ (Pathaan Story): భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాకిస్తాన్ కల్నల్ ఒకరు ఆగ్రహంతో రగిలిపోతాడు. దుష్మన్‌తో దోస్తీ చేసే సమయం వచ్చిందని ప్రయివేట్ ఏజెన్సీ అవుట్‌ఫిట్ ఎక్స్ లీడర్ జిమ్ (జాన్ అబ్రహం)కు ఫోన్ చేస్తాడు. కశ్మీర్ కావాలని లేదంటే ఇండియాపై ఎటాక్ చేయాలని కోరతాడు. మన దేశంపై బయో వార్ ప్లాన్ చేస్తాడు జిమ్. అతడిని ఇండియన్ ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్) ఎలా అడ్డుకున్నాడు? అనేది అసలు కథ. ఇండియన్ ఏజెంట్లకు దూరంగా కొన్నాళ్ళు అజ్ఞాతవాసంలో పఠాన్ ఎందుకు ఉన్నాడు? పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకోన్), పఠాన్ మధ్య ఏం జరిగింది? 'పఠాన్'కు ఆమె సాయం చేసిందా? మోసం చేసిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ : 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్'... యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి స్పై థ్రిల్లర్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్టుగా 'పఠాన్' వచ్చింది. ఈ సినిమా కూడా స్పై థ్రిల్లర్ అని, 'స్పై యూనివర్స్'లో సినిమా అని ముందే అనౌన్స్ చేశారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన స్పై థ్రిల్లర్స్ గురించి ప్రేక్షకులకు ఐడియా ఉండటంతో 'పఠాన్' మీద అంచనాలు పెట్టుకున్నారు. మరి, సినిమా ఎలా ఉంది? అనే విషయంలోకి వెళితే...
'పఠాన్'లో స్టార్ పవర్ ఉంది. గ్లామర్ ఉంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. మరి, ఏంటి? థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదైనా వెలితి ఉంటుందా? అంటే... కథ గుర్తుకు వస్తుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్స్ సినిమాల్లో పేలవమైన కథతో రూపొందిన సినిమా అంటే... 'పఠాన్' అని చెప్పాలి.
'పఠాన్' కథ మరీ రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే దర్శక ద్వయం అబ్బాస్ మస్తాన్ సినిమాల్లో (రేస్ ఫ్రాంచైజీ) ట్విస్టులను గుర్తు చేసింది. మిగతా ట్విస్టులు కూడా ఏమంత గొప్పగా లేవు. స్టార్టింగ్ టు ఎండింగ్... యాక్షన్ ఎపిసోడ్స్, షారుఖ్ స్టార్ పవర్ & మాస్ మీద మ్మకం పెట్టుకుని సినిమా తీసినట్టు ఉంది.
'వార్'తో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ విజయం అందుకున్నారు. అయితే, 'పఠాన్' విషయంలోనూ తన హిట్ ఫార్ములాను ఫాలో అయ్యారు. కొన్ని విజువల్స్ & బ్లాక్స్ 'వార్'ను గుర్తుకు తెస్తాయి. అయితే... ఆ సినిమాలో ఉన్నంత ఎమోషన్ 'పఠాన్'లో లేదు. హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ఆఫ్ఘానిస్తాన్ విలేజ్ డ్రామా ఆశించిన రీతిలో పండలేదు. ఇంటర్వెల్ ముందు వరకు సాధారణంగా ఉంటుంది. ఆ తర్వాతే సినిమాలో వేగం పెరిగింది. అంతకు ముందు హీరో ఇంట్రడక్షన్ గానీ, రెండు హెలికాఫ్టర్స్‌తో జాన్ అబ్రహం, షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్ గానీ కాస్త ఓవర్ ది బోర్డు అనిపిస్తాయి. విజువల్స్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల సరిగా లేవు.
సినిమాలో ఒక్కటే పాట ఉంది. అదీ 'బేషరమ్ రంగ్'. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ ఓకే. రెండోది సినిమా ఎండ్‌లో వస్తుంది. నేపథ్య సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ కూడా!
నటీనటులు ఎలా చేశారంటే? : స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్, యాక్టింగ్... పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ ఫుల్ పవర్ చూపించారు. 'డాన్' రిలీజ్ డేస్ గుర్తు చేసేలా నటించారు. ప్యాక్డ్ బాడీతో కనిపించారు. మధ్యలో నవ్వులు కూడా పూయించారు. దీపికా పదుకోన్ గ్లామర్ & యాక్షన్ హైలైట్ అవుతాయి. రూబై పాత్రకు ఆమె న్యాయం చేశారు. విలన్ క్యారెక్టర్‌లో జాన్ అబ్రహం ఓకే. మిగతా పాత్రల్లో అశుతోష్ రాణా, డింపుల్ కపాడియా ఆకట్టుకుంటారు.
హీరో హీరోయిన్లు, సినిమాలో ఆర్టిస్టులు అందరి కంటే ఎక్కువ ఎంటర్‌టైన్ చేసేది మాత్రం... ఇంటర్వెల్ తర్వాత ట్రైన్ ఫైట్ సీక్వెన్సులో వచ్చే సల్మాన్ ఖాన్. 'టైగర్' మళ్ళీ కనిపిస్తాడు. ఫైట్ కుమ్మేశాడు. కామెడీ టైమింగ్ కూడా!
Also Read : 'మిషన్ మజ్ను' రివ్యూ : రష్మిక 'మజ్ను' గురి తప్పిందా? బావుందా?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'పఠాన్' చూశాక... కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ధైర్యంగా చెప్పవచ్చు. షారుఖ్ ఖాన్ ఈ రేంజ్ మాస్ మూవీ చేసి చాలా కాలమైంది. ఫైట్స్‌లో ఫైర్ చూపించారు. దీపికా పదుకోన్ ఇటు గ్లామర్, అటు యాక్షన్... రెండూ చేశారు. వాళ్ళిద్దరి కోసం థియేటర్లకు వెళ్ళవచ్చు. ఫ్యాన్స్‌కు సినిమా నచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సమ్‌థింగ్ స్పెషల్ కంటెంట్ కోరుకునే వాళ్ళకు, సాధారణ ప్రేక్షకులకు రెగ్యులర్ స్పై థ్రిల్లర్స్‌లా ఉంటుంది. నథింగ్ మోర్! షారుఖ్, సల్మాన్... ఇద్దరినీ ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. షారుఖ్, సల్మాన్ మధ్య చివరలో వచ్చే సంభాషణ హైలైట్.
Also Read : 'ఏటీఎం' వెబ్ సిరీస్ రివ్యూ : వీజే సన్నీ దొంగతనం సక్సెసా? ఫెయిలా?