రివ్యూ : మిషన్ మజ్ను (హిందీ సినిమా)
రేటింగ్ : 2/5
నటీనటులు : సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మికా మందన్నా, పర్మీత్ సేథీ, షరీబ్ హష్మీ, మీర్ సర్వార్, కుముద్ మిశ్రా, జాకీర్ హుస్సేన్, రజత్ కపూర్ తదితరులు    
కథ : పర్వీజ్ షైక్, అసీమ్ అరోరా 
స్క్రీన్ ప్లే : సుమిత్ భతేజా, పర్వీజ్ షైక్, అసీమ్ అరోరా
మాటలు : సుమిత్ భతేజా 
ఛాయాగ్రహణం : బిజితేష్ దే నిర్మాతలు : రోనీ స్క్రూవాలా, అమర్, గరిమా మెహతా 
దర్శకత్వం : శాంతను బగ్చి 
విడుదల తేదీ: జనవరి 20, 2023
ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్‌


రష్మిక (Rashmika Mandanna) సంతకం చేసిన, నటించిన తొలి హిందీ సినిమా 'మిషన్ మజ్ను' (Mission Majnu). అయితే, దీని కంటే ముందు 'గుడ్ బై' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా థియేటర్లలో విడుదల కాగా... ఇప్పుడు 'మిషన్ మజ్ను' నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికలో విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? గూఢచారిగా అతడు ఎలా చేశాడు? 


కథ (Mission Majnu Story) : అమన్ దీప్ అజిత్ పాల్ సింగ్ (సిద్ధార్థ్ మల్హోత్రా) రా ఏజెంట్. తారిఖ్ పేరుతో దాయాది దేశమైన పాకిస్తాన్‌లో ఉంటాడు. భారత దేశం న్యూక్లియర్ బాంబును పరీక్షించడంతో... ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా అణుబాంబు పరీక్షలు చేయాలని పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. వేగుల ద్వారా ఆ విషయం 'రా'కు తెలుస్తుంది. వాళ్ళ న్యూక్లియర్ బాంబు స్థావరాన్ని కనిపెట్టే బాధ్యత అమన్ దీప్ చేతుల్లో పెడుతుంది. అయితే, 'రా'లో ఓ అధికారి దేశద్రోహి కొడుకు అంటూ అమన్ దీప్ ని అవమానిస్తుంటాడు. మరి, అమన్ దీప్ తన మిషన్ విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా? ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్ళు ఏమిటి? మధ్యలో అంధురాలు నస్రీన్ (రష్మిక) ఎవరు? ఆమెతో అమన్ దీప్ ప్రేమ, పెళ్లి ఏమిటి? అతడి ప్రయాణంలో నస్రీన్ ఏ విధంగా సహాయ పడింది? అనేది డిజిటల్ స్క్రీన్ మీద సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ : గూఢచారి అంటే ప్రపంచ ప్రేక్షకులకు ముందుగా గుర్తు వచ్చేది జేమ్స్ బాండ్ క్యారెక్టర్. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా సరే... చివరకు హీరో సక్సెస్ అవుతాడనేది ప్రేక్షకులు అందరికీ తెలిసిన విషయమే. అయితే... హీరో జర్నీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ ఇస్తాయి. ఆ థ్రిల్ కోసమే స్పై థ్రిల్లర్స్ చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. 


స్పై ఇండియన్ అయితే? అతను పాకిస్తాన్ గడ్డ మీద ఉంటూ మన దేశం కోసం పని చేసే ఏజెంట్ అయితే? చెప్పనవసరం లేదు. సూపర్ డూపర్ సక్సెస్ ఫార్ములా. ఆ సినిమాల్లో థ్రిల్ మాత్రమే కాదు... దేశభక్తి కూడా ఉంటుంది కాబట్టి. అక్షయ్ కుమార్ 'బేబీ', ఆలియా భట్ 'రాజీ' ఈ జానర్ సినిమాలే. అందువల్ల, 'మిషన్ మజ్ను' మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళితే... 


రెగ్యులర్ స్పై థ్రిల్లర్ సినిమాలకు కాస్త భిన్నంగా 'మిషన్ మజ్ను' రూపొందించాలని దర్శక, రచయితలు ప్రయత్నించారు. దేశభక్తితో పాటు కథలోకి వ్యక్తిగత అజెండాను మిక్స్ చేశారు. ఓ సన్నివేశంలో 'దేశద్రోహి కొడుకును నమ్మడం ఎలా? అతడి చేతిలో మిషన్ పెట్టడం తప్పు' అని ఒకరు సందేహం వ్యక్తం చేస్తే... 'తండ్రి చేసిన తప్పుకు కొడుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాడు. అతడిని ఎంపిక చేయడానికి అంత కంటే మంచి కారణం ఏం ఉంటుంది?' అని 'రా' హెడ్ చెబుతాడు.
 
హీరో దేశం కోసం కాకుండా సొంత అజెండాతో, తాను దేశద్రోహి కొడుకు కాదని, తనలో దేశభక్తి ఉందని చెప్పడం కోసం పని చేస్తున్నాడనేది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే టాపిక్ కాదు. దానికి తోడు థ్రిల్ కలిగించే అంశాలు సినిమాలో తక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ నుంచి హీరో సమాచారం తెలుసుకునే సన్నివేశాలు ఏవీ ఆసక్తికరంగా ఉండవు. ఉదాహరణకు... 'రాజీ' చూస్తే ఆలియా భట్ ఎప్పుడు పాకిస్తాన్ అధికారులకు దొరికిపోతుందా? అనే టెన్షన్ కలుగుతుంది. అటువంటి సన్నివేశాలు 'మిషన్ మజ్ను'లో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. పోనీ, 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాల్లో ఉన్నట్టు యాక్షన్ ఉందా? అంటే అదీ లేదు. మజ్ను టైటిల్ పెట్టినందుకు అటు ప్రేమను కూడా పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేదు.
 
సినిమాలో అడుగడుగునా దర్శకుడి వైఫల్యం కనపడింది. సినిమాటోగ్రఫీ, సాంగ్స్ ఓకే. కానీ, నేపథ్య సంగీతం బాలేదు. ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, జుల్ఫీకర్ భుట్టో వంటి నిజ జీవిత పాత్రల మధ్య సన్నివేశాలు జరిగినట్లు చూపించారు. అయితే, ఫిక్షనల్ స్టోరీతో సినిమా తీయడంతో అవి అంత నమ్మేలా లేవు. 


నటీనటులు ఎలా చేశారంటే? : గూఢచారిగా కంటే మజ్నుగా సిద్ధార్థ్ మల్హోత్రా మెప్పించారు. తండ్రి గురించి ప్రస్తావన వచ్చే సన్నివేశాల్లో నటుడిగా ఆయనలో పరిణితి కనపడుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ ఉండటంతో ఆయన హీరోయిజం పెద్దగా ఎలివేట్ కాలేదు. రష్మికది అంధురాలి పాత్ర కావడంతో పెద్దగా ప్రతిభ చూపించే అవకాశం లభించలేదు. అంధురాలిగా ఆమె హావభావాలు ఓకే. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా ఆకట్టుకుంటారు.


Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : దేశభక్తి, వ్యక్తిగత అజెండా, ప్రేమ మధ్య 'మిషన్ మజ్ను' బాగా నలిగింది. దేనికీ న్యాయం చేయలేదు. ఇదొక సగటు, సాధారణ సినిమా. ఇందులో థ్రిల్లూ తక్కువే, ప్రేమ కూడా తక్కువే. చక్కటి స్పై థ్రిల్లర్ చూడాలని అనుకుంటే మళ్ళీ 'రాజీ' చూడటం మంచిది. స్పై థ్రిల్లర్ కథకు కమర్షియల్ లవ్ స్టోరీ యాడ్ చేస్తే చూడాలని కోరుకునే వాళ్ళు, సినిమా ఎలా ఉన్నా పర్వాలేదనుకునే వాళ్ళు ఓసారి 'మిషన్ మజ్ను' ట్రై చేయండి. మజ్ను గురి అయితే తప్పింది.   


Also Read : 'ఏటీఎం' వెబ్ సిరీస్ రివ్యూ : వీజే సన్నీ దొంగతనం సక్సెసా? ఫెయిలా? 'దిల్' రాజు డెబ్యూ హిట్టా? ఫట్టా?