వెబ్ సిరీస్ రివ్యూ : ఏటీఎం
రేటింగ్ : 2.5/5
నటీనటులు : వీజే స‌న్ని, సుబ్బ‌రాజు, '30 ఇయర్స్' పృథ్వీ, కృష్ణ బూరుగుల‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ, 'బిగ్ బాస్' దివి, దివ్యవాణి, ష‌ఫీ, హ‌ర్షిణి తదితరులు    
ఛాయాగ్రహణం : మౌనిక్ కుమార్‌ .జి
సంగీతం : ప్ర‌శాంత్ ఆర్‌.విహారి
కథ, రచన : హరీష్ శంకర్ .ఎస్
నిర్మాతలు : హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సి.చంద్ర‌మోహ‌న్‌
సమర్పణ : శిరీష్, హరీష్ శంకర్
విడుదల తేదీ: జనవరి 20, 2023
ఓటీటీ వేదిక : జీ5
ఎన్ని ఎపిసోడ్స్ : 8


ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందించిన వెబ్ సిరీస్ 'ఏటీఎం' (ATM Web Series Review). ఆయన కథకు తోడు 'దిల్' రాజు ప్రొడక్షన్స్ నిర్మించడంతో సిరీస్ మీద ప్రేక్షకుల చూపు పడింది. 'జీ5' ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉంది? వీజే సన్నీ (VJ Sunny), సుబ్బరాజ్, పృథ్వీ ఎలా నటించారు? 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'దువ్వాడ జగన్నాథమ్ - డీజే' సినిమాలతో 'దిల్' రాజు, హరీష్ శంకర్ వెండితెర విజయాలు అందుకున్నారు. వాళ్ళిద్దరికీ ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్టు. డిజిటల్ స్క్రీన్ మీద కూడా విజయం అందుకున్నారా? లేదా?  


కథ (ATM Web Series Story) : జగన్ (వీజే సన్నీ) హైదరాబాద్‌లోని ఓ బస్తీలో యువకుడు. అదే బస్తీలోని మరో ముగ్గురు యువకులు, అతడు కలిసి చిన్న దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారు. ఓ రోజు పాత కారు కొట్టేసి అమ్మేస్తారు. అందులో పది కోట్లు విలువైన డైమండ్స్ ఉన్నాయని తర్వాత తెలుస్తుంది. ఆ డైమండ్స్ ఓనర్ వీళ్ళను పట్టుకుంటాడు. తన డైమండ్స్, లేదా పది కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. పది రోజులు టైమ్ అడిగిన జగన్ & కో... ఏటీఎంలకు డబ్బు తీసుకువెళ్ళే వ్యానును కొట్టేస్తారు. అందులో రూ. 25 కోట్లు ఉంటాయి. ఆ కేసును ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ హెగ్డే (సుబ్బరాజు)కు పోలీస్ శాఖ అప్పగిస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్న బస్తీ కార్పొరేటర్ గజేంద్ర (పృథ్వీ)ని ఎందుకు అరెస్ట్ చేశాడు? ఎమ్మెల్యే టికెట్ కోసం 25 కోట్లను కొట్టేసే స్కెచ్ గజేంద్ర వేశాడా? లేదంటే డైమండ్స్ ఓనర్ సేఠ్‌కు డబ్బు ఇవ్వడం కోసం జగన్ వేశాడా? మధ్యలో డైమండ్స్ ఓనర్ సేఠ్ ఏం చేశాడు? జగన్ & కోను పట్టుకుని ఆ 25 కోట్లను హెగ్డే రికవరీ చేశాడా? లేదా? అనేది డిజిటల్ స్క్రీన్ మీద చూడాలి.  


విశ్లేషణ : కథ చదివితే కామన్‌గా వార్తల్లో చూసే తంతే అనిపించవచ్చు. కానీ, దీనికి హరీష్ శంకర్ హ్యూమర్, సస్పెన్స్ యాడ్ చేశారు. అక్కడక్కడా ఫిలాసఫీ చెప్పారు. ఏటీఎం దొంగతనాలు, కోట్లకు కోట్లు పోసి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోవడం, బస్తీలో యువకుల జీవితాలు... కొత్త ఏమీ కాదు. నిత్యం వార్తల్లో చూసేవే. స్క్రీన్ మీదకు వచ్చినవే. వీటన్నిటినీ ఓ ప్యాకేజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు హరీష్ శంకర్.


హరీష్ శంకర్ 'ఏటీఎం' వెబ్ సిరీస్ ఐడియా బావుంది. పైన రాసిన కథలో చెప్పని ఓ పాయింట్ ఉంది. లాజికల్ స్క్రీన్ ప్లే ఉంది. అయితే... క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో దర్శక రచయితలు కొంత టైమ్ తీసుకున్నారు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ చాలా నిదానంగా సాగుతాయి. దానికి తోడు సీఐ ఉమాదేవిగా దివ్యవాణి క్యారెక్టర్, ఆ సీన్స్ చికాకు తెప్పిస్తాయి. అసలు ఆమె సీన్స్ డిలీట్ చేసినా కథకు వచ్చే నష్టం ఏమీ ఉండదేమో!?


సుబ్బరాజు ఎంట్రీ తర్వాత కథలో క్యూరియాసిటీ మొదలైంది. ఏటీఎం దొంగలను పట్టుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ 'నెక్స్ట్ ఏం జరుగుతుంది?' అని చూసేలా చేసింది. అప్పట్నుంచి కామెడీ గానీ, సస్పెన్స్ గానీ ఆకట్టుకుంటాయి. అందుకు కారణం మొదటి నాలుగు ఎపిసోడ్స్‌లో ఇచ్చిన లీడ్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్!  ఓ మైసూర్ బోండా దొంగలను పట్టించడం వంటివి నవ్విస్తాయి. పృథ్వీ రోల్ కూడా! అయితే... కథను క్లుప్తంగా చెబితే బావుండేది.


ఫస్ట్ ఎపిసోడ్‌లో హీరో చేతి మీద గద్ద వాలుతుంది. లారీ డ్రైవర్ చేతి మీద గద్ద వాలడం ఏమిటి? అని కొందరికి డౌట్ రావచ్చు. ఇన్వెస్టిగేషన్ చేసే తీరు మీద కొందరికి డౌట్ రావచ్చు... నోట్స్ మీద నంబర్స్ చూసి దొంగలను, డబ్బును పట్టుకోవచ్చని! ఆ లాజిక్స్ విషయంలోనూ రచయితగా హరీష్ శంకర్ సమాధానాలు ఇచ్చారు. సిరీస్ మొత్తం పూర్తి అయ్యాక ఏదో వెలితి ఉంటుంది. అందుకు కారణం బస్తీ యువకుల జీవితాలను కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో, ఆ సన్నివేశాల్లో ఇంటెన్సిటీని క్యాచ్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. 


హీరోతో పాటు అతడి స్నేహితులు ముగ్గురి జీవితాలను చూపిస్తుంటే ఏదో కథ ముందుకు సాగుతున్న ఫీలింగ్ ఉంటుంది తప్ప ఎటువంటి ప్రభావం చూపించలేదు. వెబ్ సిరీస్ కాబట్టి పరిమిత వ్యయంలో తీసినట్టు అర్థమవుతుంది. స్మోక్ ఎఫెక్ట్ నేపథ్యంలో తీసిన సన్నివేశాల్లో ఛాయాగ్రహణం బావుంది. ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతం ఓకే. 


నటీనటులు ఎలా చేశారంటే? : జగన్ పాత్రలో వీజే సన్నీ ఒదిగిపోయాడు. బస్తీ యువకుడిగా బాగా చేశాడు. పోలీస్ ఆఫీసర్ హెగ్డేగా తన నటనలో సుబ్బరాజు ఇంటెన్సిటీ చూపించారు. ఇన్సోమ్నియాక్ (నిద్రలేని వ్యక్తి)గా ఆయన చేసినట్టు చేయడం అంత సులభం ఏమీ కాదు. ఇటువంటి క్యారెక్టర్ పృథ్వీ గతంలో చేసి ఉండొచ్చు. కానీ, ఆయన టైమింగ్ నవ్విస్తుంది. స్టార్టింగులో సీరియస్‌నెస్‌ కూడా క్రియేట్ చేసింది. గజేంద్రగా పృథ్వీ పర్ఫెక్ట్ ఛాయస్. హీరో స్నేహితులుగా కృష్ణ బూరుగుల, రాయల్ శ్రీ, రవిరాజ్ ఓకే. దివి, హర్షిణి పాత్రల నిడివి తక్కువే. ఇద్దరూ లిప్ లాక్స్ చేశారు. లిమిటెడ్ స్క్రీన్ స్పేస్‌లో వాళ్ళకు నటించే స్కోప్ కూడా దక్కలేదు. దివ్య వాణి క్యారెక్టర్, అందులో ఆమె నటన ఆకట్టుకోవడం కష్టం. అలాగే, 'ఏటీఎం'లో షఫీని గుర్తు పట్టడం కూడా! 'ఈ రోజుల్లో' శ్రీ, అప్పాజీ అంబరీష తదితరులు మధ్య మధ్యలో కనిపించారు.   
 
Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఏటీఎం' వెబ్ సిరీస్ కథ కొత్తగా ఏమీ ఉండదు. కానీ, కామన్ దొంగ - పోలీస్ ఆటకు హరీష్ శంకర్ కొత్త పాయింట్స్ యాడ్ చేశారు. జీపీఎస్ ట్రాకర్, గద్ద (రాయల్ ఈగల్) సహాయంతో పోలీసుల దృష్టి మళ్ళించడానికి దొంగ చేసే ప్రయత్నం వంటివి ఆసక్తికరంగా సాగాయి. అయితే, ఫస్ట్ నాలుగు ఎపిసోడ్స్ & నిడివి ప్రేక్షకుల పాలిట మెయిన్ విలన్‌గా మారాయి. ఆ నాలుగు భరిస్తే... తర్వాత సుబ్బరాజ్, పృథ్వీ నటనతో పాటు హరీష్ శంకర్ స్టోరీ, చంద్రమోహన్ స్క్రీన్ ప్లే 'ఏటీఎం'ను నిలబెట్టాయి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా స్టార్ట్ చేస్తే... ఈ  'ఏటీఎం' డీసెంట్ టైమ్ పాస్ సిరీసే.


PS : సిరీస్ సీక్వెల్ ఉంటుందని చివర్లో చెప్పారు. రెండు విషయాలు వెల్లడించారు. ఆ పాయింట్స్ సెకండ్ సీజన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. 


Also Read : మతిమరుపు అంజలి కథ ఆకట్టుకుంటుందా? - ఝాన్సీ రెండో సీజన్ ఎలా ఉంది?