వెబ్ సిరీస్ రివ్యూ : ఝాన్సీ సీజన్ 2
రేటింగ్ : 2.25/5
నటీనటులు : అంజలి, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్తా హొర్నాడ్, చాందిని చౌదరి, రాజ్ అర్జున్, రామేశ్వరి తాళ్లూరి, రుద్ర ప్రతాప్, దేవి ప్రసాద్ తదితరులు
రచన : గణేష్ కార్తీక్
మాటలు : రామ్ వంశీకృష్ణ
ఛాయాగ్రహణం : ఆర్వీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు : కృష్ణ కులశేఖరన్, కె.ఎస్.మధుబాల
దర్శకత్వం : తిరు
విడుదల తేదీ: జనవరి 19, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఎన్ని ఎపిసోడ్స్ : నాలుగు
ప్రముఖ హీరోయిన్ అంజలి (Anjali), చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఝాన్సీ'. దీని మొదటి సీజన్ అక్టోబర్ 27వ తేదీన విడుదల కాగా, రెండో సీజన్ స్ట్రీమింగ్ జనవరి 19వ తేదీన ప్రారంభం అయింది. రెండో సీజన్‌పై ఆసక్తి పెంచే విధంగా మొదటి భాగం ముగింపు ఉండటంతో ఈ సీజన్‌పై ఆసక్తి నెలకొంది. మరి రెండో సీజన్ ఎలా ఉంది? ఝాన్సీ నేపథ్యం ఆకట్టుకుందా?
కథ: ఝాన్సీని (అంజలి), బార్బీలను (చాందిని చౌదరి) గోవాలో ఉన్న బిల్లూ క్లబ్ అనే వేశ్యా గృహానికి అమ్మేయడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ వేశ్యా గృహ నిర్వాహకురాలు చెప్తూ ఉండటంతో ఈ సీజన్ ప్రారంభం అవుతుంది. అక్కడ తనను క్లబ్ ఓనర్ కొడుకు ఈథన్ (ఆదిత్య శివ్‌పింక్) ఇష్టపడతాడు. ఝాన్సీ కూడా ఈథన్‌ను ఇష్టపడుతుంది. ఈథన్ కారణంగా ఝాన్సీ గర్భవతి అవుతుంది. కానీ ఈథన్ తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ఝాన్సీ తనను చంపేస్తుంది. దీంతో ఈథన్ తండ్రి కాలేబ్ (రాజ్ విజయ్) ఎలాగైనా ఝాన్సీని చంపాలని ఫిక్స్ అవుతాడు. తర్వాత ఏం జరిగింది? ఝాన్సీ గతం ఎలా మర్చిపోయింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఝాన్సీ సీజన్ 2 చూడాల్సిందే.
విశ్లేషణ: ‘అసలు కన్నా కొసరు ఎక్కువ’ అనే సామెత మనం గతంలో చాలా సార్లు విని ఉంటాం. ఈ సిరీస్ నడిచే విధానం కూడా అదే. ప్రధాన కథ కంటే ఫ్లాష్ బ్యాక్‌లే ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో ప్రతి పాత్రకూ ఒక కథ ఉంటుంది. ఆ కథ ఝాన్సీ/మహిత కథకి ముడి పడి ఉంటుంది. కాబట్టి సదరు పాత్ర చెప్పే ఫ్లాష్‌బ్యాక్ మనం విని తీరాల్సిందే. చివరి ఎపిసోడ్ ముందు వరకు ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక ఫ్లాష్‌బ్యాక్ తగులుతూనే ఉంటుంది. ఒక పాత్ర గతం కథకు అవసరమైనది అయినా సరే, రొటీన్‌గా ఉందని అనిపించినప్పుడు దాన్ని వీలైనంత త్వరగా ముగించాలి. ఎపిసోడ్ లెంత్ కోసం సాగదీస్తే ఆడియన్స్‌కు విసుగురావడం ఖాయం.
నిజానికి రెండో సీజన్‌తో కూడా కథను పూర్తిగా ముగించలేదు. ‘This is Just The Beginning’ అనే డైలాగ్‌తో ఎండ్ చేసి ఈ సిరీస్‌కు అనుకున్నంత రెస్పాన్స్ వస్తే(?) మరో సీజన్ తీద్దామనే ఉద్దేశంతో అలా వదిలేసి ఉండవచ్చు. లీడ్ రోల్‌ను మానసికంగా, శారీరకంగా బలమైన వ్యక్తి అని చెప్పి తన గతాన్ని దాచేసినప్పుడు వాటిపై ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకుంటేనే సక్సెస్ లభిస్తుంది. ఝాన్సీ ఫెయిల్ అయింది అక్కడే. 12 సంవత్సరాల వయసులోనే కిడ్నాప్‌కు గురై, వేశ్యాగృహానికి అమ్ముడుపోయి, అక్కడ కూడా మోసపోయి పగ తీర్చుకోవాలనుకునే అమ్మాయి గతాన్ని మరింత బలంగా రాసి ఉండవచ్చు. కానీ సరిగ్గా రాసుకోలేదో, లేకపోతే రాసుకున్నది తెర మీదకు అనుకున్న విధంగా ట్రాన్స్‌లేట్ కాలేదో కానీ ఆ సన్నివేశాలు ఏమాత్రం బలంగా కనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ కూడా తక్కువగానే ఉంటుంది. విలన్ పాత్ర కూడా మొదట చూపించినంత బలంగా ఉండదు.
అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. చివర్లో అంజలి, చాందిని చౌదరిల మధ్య జరిగే సంభాషణ మూడో సీజన్‌కు పర్ఫెక్ట్ లీడ్. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలకు బాగా సూట్ అయింది. ఆర్వీ ఛాయాగ్రహణం ప్లస్ పాయింట్. పెట్టిన బడ్జెట్ తెరపై కనిపిస్తుంది.
ఇక నటీనటులు ఎలా చేశారంటే... మతిమరుపు పాత్రలు చేయడం అంజలికి చాలా మామూలు విషయం అయింది. ఈ సిరీస్‌లో మాత్రమే కాకుండా, డిసెంబర్‌లో హాట్‌స్టార్‌లోనే వచ్చిన ‘ఫాల్’ సిరీస్‌లో కూడా అంజలి మతిమరుపు యువతి పాత్రనే పోషించింది. అయితే ఇందులో తనకి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటిలో బాగా పెర్ఫార్మ్ చేసింది. అంజలి తర్వాత కీలక పాత్ర చాందిని చౌదరిదే. కానీ ఫ్లాష్‌బ్యాక్‌లో మినహా ప్రెజెంట్ స్టోరీలో తన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అంజలి, చాందిని చౌదరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్ ఒక్కటి కూడా (ప్రెజెంట్ స్టోరీలో) లేదు. మిగతా పాత్ర ధారులందరూ రెమ్యునరేషన్‌కు న్యాయం చేశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... మీరు ఝాన్సీ మొదటి సీజన్ చూసి, రెండో సీజన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉంటే ఈ సిరీస్‌పై ఓ లుక్కేయచ్చు. హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా లవర్స్ కూడా ఒకసారి చూడవచ్చు. గ్రిప్పింగ్ కథ, స్క్రీన్‌ప్లేలను ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం నిరాశ పడే అవకాశం ఉంది.
Also Read : వారసుడు రివ్యూ: దిల్ రాజు ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్‌కి హిట్టు లభించిందా?
Also Read : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ : మెగాభిమానులకు పూనకాలు గ్యారెంటీనా? మెగాస్టార్ మాస్ మూవీ ఎలా ఉందంటే?