టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకే కాదు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటి నటుల్లో సీనియర్ యాక్టర్ సుబ్బరాజు ఒకరు. చేసేది ఏ క్యారెక్టర్ అయినా తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ పాత్ర అయినా, సపోర్టింగ్ రోల్ అయినా, ఫన్నీ క్యారెక్టర్ అయినా తన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ఆకట్టుకుంటారు. సుబ్బరాజు ఎక్కువగా సినిమాల్లో తప్ప బయట ప్రోగ్రాం లు, ఇంటర్వ్యూలలో పెద్దగా కనిపించరు. అయితే తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానల్ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.  


ఈ ఇంటర్వ్యూలో సుబ్బరాజు తన జీవిత విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన జర్నీ ఎలా ఉంది అని యాంకర్ సుబ్బరాజును అడగ్గా.. ప్రస్తుతం తాను చేస్తున్న పని తనకు సంతృప్తిగానే ఉందని అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫిట్ గా ఉంటే ఇలా నడుస్తుందని, లేదంటే ఏ తండ్రి పాత్రలో చేయాల్సి వస్తుందని చమత్కరించారు. ఎవరినైనా ప్రేమించారా.. అని అడిగితే మాములుగా తన తండ్రి టీచర్ అవ్వడం వలన చిన్నప్పటి నుంచీ ఆ భయం ఉండేదని, తాను ఏ చిన్న తప్పు చేసినా ఇంటికి వచ్చి మరీ చెప్పేసేవారని, దాంతో తాను చాలా బుద్దిగానే ఉండాల్సొచ్చిందని అన్నారు. అయితే తర్వాత ఒక వయసు వచ్చాక కూడా ఏదో చూసి ఆరాధించడం తప్ప డీప్ లవ్ లు ఏమీ లేవని చెప్పుకొచ్చారు. 


పెళ్లనేది కావాలని కాదు, చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకోవాలి..


ఇక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో దానికి కూడా తనదైన స్టైల్ లో సమాధానిమిచ్చారు సుబ్బరాజు. పెళ్లి ఎప్పుడూ కావాలని చేసుకోకూడదని, ఆ అవసరం వచ్చినపుడు చేసుకోవాలి అని అన్నారు. ఇప్పటిదాక పెళ్లితో తనకు అవసరం రాలేదని వచ్చినపుడు కచ్చితంగా చేసుకుంటానని బదులిచ్చారు. 


ఆ బాధ్యత తీసుకోవడం కొంచె భయమే..


హీరోగా ఎందుకు ట్రై చేయలేదు అని యాంకర్ అడిగితే.. చాలా మంది తన వద్దకు వచ్చి కథ చెప్పేవారని, అయితే తానెప్పుడూ ఆ రిస్క్ చేయలేదని అన్నారు. ఎవరూ డబ్బు ఊరికే పెట్టరు కదా.. అయినా ఇంకొకరి డబ్బుతో ఆ బాధ్యత తీసుకోవడం కొంచెం భయమే అని అన్నారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్లు పరిచయం ఉన్నా ఫలానా క్యారెక్టర్ కావాలని తానెప్పుడూ అడగలేదని, కాకపోతే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. ఏదేమైనా తనకు కాస్త మొహమాటమేనన్నారు.


డ్రగ్స్ కేసులో ఆ భయమే ఉండేది


డ్రగ్స్ కేసులో తాను చాలా డిస్ట్రబ్ అయ్యానని అన్నారు సుబ్బరాజు. ఆ సమయంలో తన తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందానని చెప్పారు. తాను తప్పు చేయకపోయినా తన గురించి అడిగి వారిని ఇబ్బంది పెడతారనే భయం ఉండేదని, అప్పుడు వాళ్లకి ఎలా ధైర్యం చెప్పాలో తెలియక తనలో తానే మధనపడేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే జైలులో పెట్టినా పర్లేదని అన్నారు. మొత్తంగా ఈ ఇంటర్య్వూలో నటుడు సుబ్బరాజు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలపై మాట్లాడినట్టే తెలుస్తోంది. ఇక ఈ  పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే ప్రసారం కానుంది. 


Also Read 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?