ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త తరహా రాజకీయం కనిపిస్తోంది. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. వరుసగా పార్టీలో విభేదాలు బహిర్గతం కావటం, నెల్లూరు వంటి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో సైతం అసంతృప్తు స్వరాలు పెరగడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యిందని చెబుతున్నారు. దీంట్లో భాగంగా శాసన సభ్యులు అసంతృప్తులుగా ప్రచారం జరుగుతున్న చోట్ల పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. అలాంటి శాసన సభ్యులు ఇప్పటికే పలుమార్లు పార్టీ అగ్రనేతలను కలసి పూర్తి తమ వివరణ ఇచ్చారు. అంతే కాదు తమ ఇబ్బందులను కూడా నాయకత్వానికి వివరించారు. 


అధికార పార్టీ శాసన సభ్యులు అసంతృప్తి పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని క్యాడర్‌కు కూడా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది అధిష్ఠానం. ప్రతిపక్షానికి కూడా అవకాశాలు చేతిలో పెట్టినట్లు అవుతుందని అంచనా వేస్తోంది. అలాంటి నేతలందరికీ విషయంలో ఓ కీలకమయిన ఆదేశం జారీ చేసిందట అధినాయకత్వం. 


ఫలాన శాసన సభ్యుడు అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుందని పార్టీ అగ్రనాయకత్వానికి తెలిసిందంటే చాలు ఆయా ఎమ్మెల్యేలంతా నెలకు ఒకసారి అయినా ప్రెస్‌మీట్ పెట్టి, వాస్తవాలను గురించి వివరించాలని ఆదేశాలు ఇచ్చిందట. సో ఆయా శాసన సభ్యులు అంతా ఇప్పుడు వరుసగా ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ పార్టీ గురించి చెబుతారట. 


కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యుడు కొలుసు పార్థసారధి గతంలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్దీకరణలో పదవి రాకపోవటంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఉంది. పార్టీ నేతలతోపాటుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా అహనంతో పార్టీలో ఉంటున్నారని, కార్యకలాపాలకు కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం ఉంది. ఇటీవల పార్థసారథి తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు కేపీ.రెడ్డయ్య చనిపోయారు. దీంతో సీఎం జగన్ ఆయన ఇంటికి వెళ్లి రెడ్డయ్యకు నివాళర్పించారు. తర్వాత పార్టీ నుంచి వెళ్లి ఆదేశాల మేరకు ఆయన విజయవాడ కేంద్రంగా మీడియా సమావేశం నిర్వహించి మరీ జగన్ గురించి ఠముకేశారు. సామాజిక వర్గాలకు న్యాయం చేసింది జగన్ మాత్రమేనని పదే పదే నొక్కి చెప్పారు. అయితే సందర్బంలో లేకుండా ఉన్నపళంగా మీడియా సమావేశం పెట్టి మరీ ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటని మీడియా అడిగితే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


వసంతది కూడా అదే పరిస్థితి


ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌ది కూడా అదే తీరు. మంత్రి జోగి రమేష్‌తో విభేదాలు కారణంగా దూరంగా ఉంటున్న వసంత కూడా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ బాటలోనే నడుస్తానని ఆయన గతంలో కూడా పదే పదే వివరించారు. అయితే మంత్రి జోగితో మాత్రం విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని తెగేసి చెప్పేశారు.


వెలంపల్లి-సామినేని ఎపిసోడ్ లో 


ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందని శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసన సభ్యుడు సామినేని ఉదయ భాను వ్యవహరంలో కూడా ఇదే జరిగింది. గత జనవరి నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నగర అద్యక్షుడు బొప్పన భువ కుమార్ జన్మదిన వేడుకల్లో వెలంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయ భాను ఘర్షణ పడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తుండగానే ఇద్దరు శాసన సభ్యులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లారు. చివరకు మరో ఇద్దరు శాసన సభ్యులు కలసి వారిని పక్కకు తీసుకువెళ్ళారు. ఈ వ్యవహరం పార్టీలో తీవ్ర దుమారాన్ని రాజేసింది. పార్టీకి జిల్లా అద్యక్షుడిగా కొనసాగుతున్న వెలంపల్లి, మరో సీనియర్ శాసన సభ్యుడిని దూషించటం, రాజకీయంగా చర్చనీయాశంకావటం, అందులో కూడా కులాల ప్రస్తావన రావటంతో, పార్టీ నాయకులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దుర్గ గుడి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయ భాను పక్క పక్కనే కుర్చొబెట్టి విభేదాలు లేవనే సందేశాన్ని పంపించారు. 


ఇలా వరుసగా వివాదాలు ఉన్న శాసన సభ్యులతో మీడియా సమావేశాలు పెట్టించటంతోపాటుగా నేతల మధ్య గ్యాప్ ఉంటే వాటిని వారి చేతనే సరిదిద్దించే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పార్టిలో ప్రచారం జరుగుతుంది.