మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ ప్రాంచైజీ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మొదట తీసిన ‘దృశ్యం’ సినిమా మలయాళం లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ హిట్ అవ్వడంతో తర్వాత దాదాపు దేశంలో అన్ని భాషల్లోకి ఈ మూవీని రిమేక్ చేశారు. రిమేకైన ప్రతీ చోటా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే చైనీస్ తో సహా కొన్ని ఇతర భాషల్లోకి సినిమాను విడుదల చేశారు మేకర్స్. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో ‘దృశ్యం 2’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ పార్ట్ కూడా సూపర్ హిట్ అయింది. తర్వాత ‘దృశ్యం 2’ సినిమాను తెలుగు, హిందీ భాషల్లోకి రిమేక్ చేశారు. హిందీలో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ సినిమాను ఇంగ్లీష్, ఇతర విదేశీ భాషల్లోకి విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. 


రిమేక్ హక్కులను కొనుగోలు చేసిన పనోరమా స్టూడియోస్ :


విదేశీ భాషల్లోకి ఈ మూవీని రిమేక్ చేసేందుకు పనులు మొదలైనట్లు సమాచారం. ఇక ఈ ‘దృశ్యం’ ఇంగ్లీష్ సహా ఇతర భాషల రిమేక్ హక్కులను పనోరమా స్టూడియోస్ కొనుగోలు చేసింది. కొరియన్, జపనీస్, ఇంగ్లీష్ భాషలలో ‘దృశ్యం 2’ రీమేక్‌ను నిర్మించడానికి చర్చలు జరుపుతున్నట్లు ప్రొడక్షన్ బ్యానర్ ధృవీకరించింది. ‘‘హిందీలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం 2’ రిమేక్ హక్కులను పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాల రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌ తో సహా ఇతర విదేశీ భాషల హక్కులను సొంతం చేసుకుంది’’ అని పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే విదేశీ భాషల నుంచి పిలిఫినో, సింహళ, ఇండోనేసియన్ భాషల హక్కులను మినహాయించినట్టు ఆ సంస్థ తెలిపింది.


‘దృశ్యం’ సిరీస్‌ లో మూడో పార్ట్?


మోహన్‌లాల్, జీతూ జోసెఫ్‌ల సెలబ్రేట్ ఫిల్మ్ ఫ్రాంచైజీ ఇప్పుడు పార్ట్ 3 కు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘దృశ్యం’ పార్ట్ 3 గురించి తాను ఆలోచిస్తున్నానని, అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని అన్నారు. మోహన్ లాల్ తో తీయబోయే ఈ పార్ట్ 3 క్లైమాక్స్ గురించి ఒక ఆలోచన ఉందని, ఈ ప్రాంచైజీలో అదే చివరి భాగం అని హింట్ ఇచ్చారు. అయితే, సినిమా నిర్మాత ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో దీన్ని పూర్తిగా డెవలప్ చేయలేకపోయారు జీతూ. ఆయన మాటల ప్రకారం చూస్తే.. ‘దృశ్యం 3’ మలయాళం వెర్షన్ ఇంకా ప్లానింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అనుకుంటున్నారు. 



Also Read : 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?