వెబ్ సిరీస్ రివ్యూ : ఫర్జీ
రేటింగ్ : 2/5
నటీనటులు : షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కె.కె. మీనన్, రాశీ ఖన్నా, భువన్ అరోరా, రెజీనా, జాకీర్ హుస్సేన్, చిత్తరంజన్ గిరి, అమోల్ పాలేకర్, కుబ్రా సైట్, కావ్యా థాపర్ తదితరులు
రచన : సీతా మీనన్, సుమన్ కుమార్, రాజ్ & డీకే
సంగీతం : కేతన్ సోదా, సచిన్ - జిగర్, తనిష్క్ బగ్చి
రచన, దర్శకత్వం : రాజ్ & డీకే
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2023
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్ : 8 (సుమారు ఒక్కో ఎపిసోడ్ నిడివి గంట)
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ రెండు సీజన్లూ ఓటీటీలో సూపర్ హిట్. ఆ సిరీస్ సృష్టికర్తలు, రూపకర్తలు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన తాజా వెబ్ సిరీస్ 'ఫర్జీ'. హిందీ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) నటించిన మొదటి వెబ్ సిరీస్ ఇది. హిందీలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి తొలి రిలీజ్ కూడా ఇదే. ఈ సిరీస్ ఎలా ఉంది? (Farzi Web Series Review)
కథ (Farzi Web Series Story) : సన్నీ (షాహిద్ కపూర్) మంచి ఆర్టిస్ట్. అతను ఏదైనా పెయింటింగ్ వేశాక... ఒరిజినల్ ఏదో, డూప్లికేట్ ఏదో కనుక్కోవడం కూడా కష్టమే. అంత గొప్ప కళాకారుడు. బాల్యంలో తల్లి మరణిస్తుంది. తండ్రి రైలులో వదిలేసి ఏటో వెళ్ళిపోతాడు. చిన్నప్పటి నుంచి తాతయ్య (అమోల్ పాలేకర్) పెంచి పెద్ద చేస్తాడు. సన్నీతో పాటు రైల్వే స్టేషనులో అతనికి పరిచయమైన ఫిరోజ్ (భువన్ అరోరా)ను కూడా! 'క్రాంతి' పేరుతో తాతయ్య పత్రిక నడుపుతుంటారు. విలువలతో నడిపే ఆ పత్రికను చదివేవారు ఎవరూ ఉండరు. ఒకవైపు పాఠకుల నిరాదరణ, మరోవైపు అప్పుల భారం, ముఖ్యంగా వయోభారం సన్నీ తాతయ్య మనసులో బాధకు కారణం అవుతాయి. ఒకరోజు అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేయడంతో వాళ్ళ బాకీ తీర్చడానికి 500 రూపాయల దొంగనోట్లు ముద్రిస్తారు సన్నీ, ఫిరోజ్. ఆ తర్వాత దొంగనోట్లు ముద్రించడం వాళ్ళకు అలవాటుగా మారుతుంది. డబ్బుతో వచ్చే లగ్జరీ జీవితానికి అలవాటు పడతారు. ఇండియాలో దొంగ నోట్ల చలామణి, రవాణాలో మహారాజు లాంటి మన్సూర్ (కెకె మీనన్)కు సన్నీ గురించి తెలిశాక ఏం చేశాడు? వాళ్ళ ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు ఎదురయ్యాయి? దొంగనోట్ల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారి మైఖేల్ (విజయ్ సేతుపతి) ఏం చేశారు? మైఖేల్, అతని భార్య రేఖ (రెజీనా) మధ్య గొడవలు ఏంటి? మైఖేల్ టీంలో పనిచేసే మేఘ (రాశీ ఖన్నా)తో సన్నీ ఎందుకు పరిచయం పెంచుకున్నాడు? ప్రేమలో పడేశాడు? ప్రేమ పేరుతో ఆమెకు వల వేయడం వెనుక ఉన్న స్కెచ్ ఏమిటి? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే... 'ఫర్జి' వెబ్ సిరీస్ చూడాలి.
విశ్లేషణ : సిరీస్ ఎలా ఉందనేది చెప్పే ముందు ఓ మాట చెప్పాలి! విలనిజమే ఇప్పుడు హీరోయిజం! క్రైమ్ చేసే వాళ్ళను స్క్రీన్ మీద హీరోలుగా చూపిస్తుంటే విజయాలు వస్తున్నాయి. సో... 'ఫర్జి'లో షాహిద్ కపూర్ పాత్రను హీరోగా చూడాలి. ఎన్ఐఏ, టాస్క్‌ఫోర్స్ లాంటి టీమ్ లీడ్ చేసే రోల్ కాబట్టి విజయ్ సేతుపతి కూడా హీరోనే. అందువల్ల, చెప్పుకోవడానికి 'ఫర్జీ'లో బలమైన విలన్ ఎవరూ లేకుండా పోయారు. అయితే, సిరీస్ మొత్తం చూసిన తర్వాత వీక్షకుల పాలిట రన్ టైమ్ (నిడివి) మెయిన్ విలన్ రోల్ ప్లే చేస్తుందని అర్థమైంది.
'ఫర్జీ'లో ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు గంట ఉంది. నిడివి పరంగా సినిమాకు పరిమితులు ఉండటంతో... వెండితెరపై చెప్పలేని విషయాలను ఓటీటీ తెరపై చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దర్శక రచయితలు. ఆ కోణంలో చూసినా 'ఫర్జి'లో కొత్త విషయం ఏదీ చెప్పలేదు. ఇది పిల్లి - ఎలుక ఆటలా ఉంది. ఇంకా నిజం చెప్పాలంటే... వీక్షకులను ఆకట్టుకోవడం సంగతి పక్కన పెడితే, దొంగ నోట్లు ముద్రించాలని అనుకునే వాళ్ళకు మాస్టర్ క్లాస్ టైపులో ఉంది. సన్నివేశాలు, ఇతర నేరాల విషయంలో ఆ రేంజ్ డిటైలింగ్ బోర్ కొట్టిస్తుంది.
'ఫర్జీ'లో ఎపిసోడ్స్ నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలగడానికి, సిరీస్ ఆకట్టుకోకపోవడానికి ముఖ్య కారణం క్యారెక్టరైజేషన్లు, కొన్ని సన్నివేశాలు! ఉదాహరణకు... షాహిద్ కపూర్, కావ్యా థాపర్ మధ్య స్టార్టింగ్ సీన్లు 'వేదం'లో అల్లు అర్జున్, దీక్షా సేథ్ సీన్లను గుర్తు చేస్తాయి. విజయ్ సేతుపతి, రెజీనా మధ్య సన్నివేశాలు చూస్తుంటే... 'ది ఫ్యామిలీ మ్యాన్'లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ట్రాక్ కళ్ళ ముందుకు వచ్చి వెళుతుంటుంది. సిరీస్ మొత్తం మీద భావోద్వేగాల పరంగా వీక్షకులను కట్టి పడేసే అంశాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి.
షాహిద్ కపూర్ దొంగ నోట్లు ముద్రించడానికి బలమైన కారణాలు ఏవీ కనిపించవు. అంతకు ముందు తాతయ్యతో ఎమోషనల్ బాండింగ్ సరిగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, లేదా రైల్వే ట్రాక్ మీద పడుకున్న రోజుల్లో అవమానాలు ఎదుర్కొని ఉంటే డబ్బు కోసం చేశాడని అనుకోవచ్చు. అలా జరగలేదు. మరోవైపు మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి మరీ విజయ్ సేతుపతి తనకు కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉంటుంటే... నవ్వు వస్తుంది. బహుశా... డార్క్ హ్యూమర్ కోసం ఆ సీన్స్ తీశారేమో! డైలాగుల్లో బూతు పదాలను విచ్చలవిడిగా వాడేశారు.
'ది ఫ్యామిలీ మ్యాన్'కు లభించిన ఆదరణను క్యాష్ చేసుకునే క్రమంలో వీక్షకులను 'టెకెన్ ఫర్ గ్రాంటెడ్'గా రాజ్ & డీకే, రైటింగ్ డిపార్ట్మెంట్ టీమ్ తీసుకుందేమోననే అనుమానం కలుగుతుంది 'ఫర్జీ' చూస్తే! సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాల్లో 'ఫ్యామిలీ మ్యాన్'ను ఫాలో అయిపోయారు. స్క్రీన్ ప్లే కూడా గొప్పగా ఏమీ లేదు.
నటీనటులు ఎలా చేశారంటే? : రైటింగ్, సీన్లతో సంబంధం లేకుండా ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నటనలో షాహిద్ కపూర్ సెటిల్డ్‌గా చేస్తే... విజయ్ సేతుపతి నటనతో పాటు డైలాగ్ డెలివరీతో మెప్పిస్తారు. ఆయన క్యారెక్టరైజేషన్, డైలాగులు ఎంటర్టైన్ చేస్తాయి. కెకె మీనన్ మరోసారి ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలో చక్కగా నటించారు. రాశీ ఖన్నా క్యారెక్టర్ బావుంది. ఆమె నటన కూడా! ఇంతకు ముందు చెప్పినట్టు రెజీనా పాత్రలో 'ఫ్యామిలీ మ్యాన్' ప్రియమణి కనబడుతుంది. అందువల్ల, ఆమె నటన సరిగా రిజిస్టర్ అవ్వదు. అమోల్ పాలేకర్, జాకీర్ హుస్సేన్, భువన్ అరోరా, కావ్యా థాపర్ తదితరులకు రిజిస్టర్ అయ్యేలా మంచి సన్నివేశాలు పడ్డాయి.
Also Read : 'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : నటీనటులు, నిడివి పరంగా చూస్తే 'ఫర్జీ' చాలా పెద్ద వెబ్ సిరీస్. ఏ దశలోనూ దొంగ నోట్లు ముద్రిస్తున్న షాహిద్ కపూర్ దొరికేస్తాడేమో అనే టెన్షన్ గానీ... దొంగ నోట్ల ముఠాను విజయ్ సేతుపతి పట్టుకుంటాడనే నమ్మకం గానీ చూసే వాళ్ళకు కలగపోవడం 'ఫర్జీ' ప్రత్యేకత. ఇందులో ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, కొన్ని సీన్స్ మినహా ఆకట్టుకునే అంశాలు చాలా తక్కువ. ఇంత చెప్పిన తర్వాత కూడా చూడాలని అనుకుంటే... ఒకట్రెండు చూసిన మిగతా ఎపిసోడ్స్ చూడాలో వద్దో మీకే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే... సాగదీసి సాగదీసి వదిలారు. పిల్లలతో కలిసి చూడాలని అనుకునేవాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. స్టార్స్ నోటి వెంట బీప్ వర్డ్స్ అలవోకగా వచ్చేశాయి.
PS : 'ఫర్జీ'లో 'ఫ్యామిలీ మ్యాన్'లో చల్లం సార్ క్యారెక్టర్ చూపించడం... తివారి (మనోజ్)కి మైఖేల్ (విజయ్ సేతుపతి) కాల్ చేయడం ఇంట్రెస్టింగ్ టాపిక్. రెండు సిరీస్ లు కలిపి రాజ్ & డీకే స్పై సిరీస్ యూనివర్స్ క్రియేట్ చేస్తారేమో!
Also Read : 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?