వెబ్ సిరీస్ రివ్యూ : దయా 
రేటింగ్ : 3.5/5
నటీనటులు : జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్, విష్ణుప్రియ భీమనేని,  'జోష్' రవి, బబ్లూ పృథ్వీరాజ్, కమల్ కామరాజు, మయాంక్ పరాఖ్, కల్పికా గణేష్, గాయత్రి గుప్తా, నంద గోపాల్ తదితరులు
ఛాయాగ్రహణం : వివేక్ కాలెపు 
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు : శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని 
రచన, దర్శకత్వం : పవన్ సాధినేని
విడుదల తేదీ: ఆగస్టు 4, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్


జేడీ చక్రవర్తి (JD Chakravarthy) కథానాయకుడిగా నటించిన వెబ్ సిరీస్ 'దయా' (Daya Web Series). దీంతో ఆయన ఓటీటీకి పరిచయం అవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. తెలుగులో తీసిన సిరీస్ ఇది. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అనువదించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్, విష్ణుప్రియ తదితరులు నటించిన ఈ సిరీస్ (Daya Web Series Review) ఎలా ఉంది? జేడీ చక్రవర్తి ఎలా చేశారు? పవన్ సాధినేని ఎలా తీశారు?


కథ : దయా (జేడీ చక్రవర్తి) చేపలు ట్రాన్స్‌పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) నిండు గర్భిణి. ఓ రోజు పని మీద వెళ్ళిన దయా, చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాడు. అనూహ్యంగా అతని బండిలో డెడ్ బాడీ కనబడుతుంది. అది ఎవరిది? ఆ మృతదేహం ఎలా దయా బండిలోకి వచ్చింది? ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకుని మరీ ప్రముఖ జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్) హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్టుకు ఎందుకు వచ్చారు? లోకల్ ఎమ్మెల్యే పెన్మత్స పరశురామ రాజు (బబ్లూ పృథ్వీరాజ్)ను ఎందుకు కలిశారు? కవిత మిస్సింగ్ అని ఆమె భర్త కౌశిక్ (కమల్ కామరాజు) కంప్లైంట్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటి? దయా, కవిత, పరశురామ రాజు... ముగ్గురి దారులు వేర్వేరు అయినప్పటికీ, వీళ్ళను విధి ఎలా కలిపింది? ఈ కథలో షబానా (విష్ణుప్రియ) పాత్ర ఏమిటి? - ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు తెలియాలంటే 'దయా' వెబ్ సిరీస్ చూడాలి. 


విశ్లేషణ : నదీ ప్రవాహం ప్రారంభాన్ని చూస్తే చిన్న సెలయేరులా, జలపాతంలా ఉంటుంది. పోను పోను దాని లోతు ఎంత? ఎంత దూరం వెళ్లింది? అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ 'దయా' వెబ్ సిరీస్ కూడా అంతే! కథను ప్రారంభించిన విధానం చాలా చిన్నగా ఉంది. ముందుకు వెళ్ళే కొలదీ కథలో లోతు ప్రేక్షకుడికి తెలుస్తూ ఉంటుంది. 


సాధారణ డ్రైవర్ పాత్రలో జేడీ చక్రవర్తిని పరిచయం చేశారు. ఆ తర్వాత అతనికి ఓ ప్రమాదం ఎదురైతే... 'అయ్యో ఎలా బయట పడతాడో?' అనిపించేంత సహజంగా దర్శకుడు పవన్ సాధినేని సిరీస్ ప్రారంభించారు. కథలోకి వెళ్ళడానికి ఆయన పెద్దగా సమయం తీసుకోలేదు. 'జోష్' రవి ఇంట్రడక్షన్ కథకు అవసరం లేదని అనిపిస్తుంది. రమ్యా నంబీసన్, కమల్ కామరాజు ఫ్యామిలీ ఎపిసోడ్స్ కొత్తగా లేవు. అలాగే, న్యూస్‌ ఛానల్స్‌ తీరు కూడా! ఇటీవల ఆ టాపిక్స్‌ చాలా సిరీస్‌లలో కామన్ అయ్యింది. అయితే, ఈ కథలో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. మర్డర్ తర్వాత కొంత మందిపై అనుమానాలు కలగడం సహజం. అందుకు రమ్యా నంబీసన్‌, కమల్‌ కామరాజుల రిలేషన్ బాగా ఉపయోగపడింది. 


హీరోయిజం కోసమో, ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడం కోసమో అంటూ కథ నుంచి పక్క దారుల్లోకి వెళ్లకుండా... కేవలం కథను చెప్పిన తెలుగు వెబ్ సిరీస్‌లలో 'దయా' ఒకటిగా ఉంటుంది. ట్విస్టులు, వాటిని తెరకెక్కించిన తీరు రెండో సీజన్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. 
దర్శకుడు పవన్ సాధినేని చిన్న చిన్న విషయాలను సైతం వదలకుండా చాలా డిటైలింగ్‌గా సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఆసక్తిగా సాగుతాయి. ఐదో ఎపిసోడ్ నుంచి సిరీస్ స్వరూపమే మార్చేశారు. ట్విస్ట్స్ & ఫ్రీజర్ వ్యాన్ ఫైట్ కథపై మరింత క్యూరియాసిటీ పెంచుతాయి. ఓ మర్డర్ సీన్ అయితే ఒళ్ళు జలదరించేలా చేసింది. సంగీతం, సినిమాటోగ్రఫీ చాలా బావున్నాయి. కథలో మూడ్ ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.


నటీనటులు ఎలా చేశారు? : జేడీ చక్రవర్తిలో గొప్ప నటుడు ఉన్నారు. 'దయా'తో మరోసారి అతను బయటకు వచ్చారు. గోడ కట్టినట్లు, గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు చాలా పద్ధతిగా పాత్రలో ఒదిగిపోయారు. తన నటనలోని 'సత్య'ను కూడా చూపించారు. జేడీ నటన 'దయా'లో చాలా సన్నివేశాలను మరో మెట్టు ఎక్కించింది. ఫ్రీజర్ వ్యాన్ దగ్గర ఫైట్ సీన్ సూపర్బ్. ఒక్కొక్కరిని కొట్టిన తర్వాత చాలా సెటిల్డ్‌గా నటించారు. ఆ మూమెంట్... క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ షాక్ ఇస్తుంది. అంతకు ముందు సన్నివేశాల్లో అమాయకుడిగా, భయస్తుడిగా మనల్ని నమ్మిస్తారు. 


ఈషా రెబ్బా పాత్ర పరిధి పరిమితమే. స్క్రీన్ మీద కనిపించే సన్నివేశాలు కొన్ని మాత్రమే అయినప్పటికీ... ప్రేక్షకులకు గుర్తు ఉంటారు. అందుకు మొదటి కారణం క్యారెక్టర్ ట్విస్ట్ అయితే... రెండోది గర్భిణి పాత్రలో ఆమె నటన! జర్నలిస్ట్ పాత్రలో రమ్యా నంబీసన్ చక్కగా నటించారు. ఆమె భర్తగా కమల్ కామరాజు కూడా! స్మాల్ స్క్రీన్ మీద తనకున్న ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో విష్ణు ప్రియ భీమనేని నటించారు.


కల్పికా గణేష్ కొన్ని సన్నివేశాల్లో కనిపించారు. 'జోష్' రవికి చాలా రోజుల తర్వాత పెద్ద క్యారెక్టర్ లభించింది. తన పాత్రకు అతను న్యాయం చేశారు. మాటలు రాని వ్యక్తిగా నంద గోపాల్ సన్నివేశాలకు అవసరమైన సీరియస్‌నెస్ తీసుకు వచ్చారు. పృథ్వీరాజ్ పర్వర్టెడ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా చేశారు. గాయత్రి గుప్తా కథలో కీలకమైన పాత్రలో కనిపించారు. 


Also Read : మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు


చివరగా చెప్పేది ఏంటంటే... : క్లాసీగా తీసిన మాస్ సిరీస్ 'దయా'. కథలో దమ్ము ఉంది. క్యారెక్టరైజేషన్లలో హీరోయిజం ఉంది. సిరీస్ ప్రారంభమైన కాసేపటికే పవన్ సాధినేని 'దయా' ప్రపంచంలోకి తీసుకువెళ్లారు. తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ చివరి వరకు మైంటైన్ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... జేడీ చక్రవర్తి అద్భుతంగా నటించారు. జేడీ ఈజ్ బ్యాక్! 


PS : దోషులపై జేడీ చక్రవర్తి 'దయ' చూపించలేదు. శిక్షించాడు. అయితే... అతని గతం గురించి పవన్ సాధినేని చెప్పిన లైన్స్ రెండో సీజన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అంచనాలు పెంచేశాయి. సిరీస్ పూర్తైన తర్వాత ఈషా రెబ్బా గతం ఏమై ఉంటుంది? అని ఆలోచించేలా చేశారు. రామ్ గోపాల్ వర్మ 'సత్య'కి, 'దయా'కి సంబంధం ఏమిటి? వెయిట్ ఫర్ 'దయా 2'.  


Also Read వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial