మానస్ నాగులపల్లి (Maanas Nagulapalli), దీపికా రంగరాజు (Deepika Rangaraju) జంటగా నటిస్తున్న సూపర్ హిట్ సీరియల్ 'బ్రహ్మముడి'. తెలుగు ప్రజల ఆదరణతో 'స్టార్ మా' ఛానల్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో మంచి వీక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. ఇప్పటి వరకు 160కు పైగా ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఈ సీరియల్ వీక్షకులకు ఉత్కంఠ, వినోదం అందించడమే కాదు... అంతర్లీనంగా సందేశాలను, కొన్ని జీవిత సత్యాలను కూడా అందిస్తోంది. 'బ్రహ్మముడి' (Brahmamudi TV Serial) చెప్పిన జీవిత సత్యాలు ఏమిటంటే?
చెరపకురా చెడేవు...
మోసం చేయాలని చూస్తే!
దుగ్గిరాల కుటుంబ వారసుడిగా రాజ్ (మానస్ నాగులపల్లి)కి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తారు. రక్త సంబంధం లేకపోయినా... స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం రుద్రాణిని తమ కన్న కుమార్తెలా పెంచుతారు తాతయ్య. ఇంట్లో వాళ్ళు సైతం ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తారు. అయితే... తన కుమారుడు రాహుల్ (శ్రీకర్ కృష్ణ)ను కంపెనీకి వారసుడు చేయాలనేది రుద్రాణి (షర్మితా గౌడ) ఆశ. రాహుల్ కూడా రాజ్ స్థానం మీద కన్నేస్తాడు. అంతే కాదు... రాజ్ పెళ్లి చేసుకోవాలనుకున్న స్వప్న (హమీదా)కు మాయ మాటలు చెప్పి తన వలలో పడేస్తాడు.
స్వప్న సంపన్నురాలని రాహుల్ భావిస్తాడు. రాజ్ కంటే రాహుల్ గొప్పవాడని, తన సంతోషాలు నెరవేరుస్తాడని స్వప్న భావిస్తుంది. పెళ్లి ముహూర్తానికి కొన్ని క్షణాల ముందు కుటుంబ సభ్యులకు తెలియకుండా స్వప్నను లేవదీసుకుని రాహుల్ వెళతాడు. కట్ చేస్తే... స్వప్న చెల్లెలు కావ్య(దీపికా రంగరాజు)ను రాజ్ పెళ్లి చేసుకుంటాడు. డబ్బు కోసం రాహుల్, స్వప్న ఆశ పడితే... ఏ మాత్రం ఆస్తి లేని ఇద్దరూ పెళ్లి చేసుకోవలసి వస్తుంది. దుగ్గిరాల కుటుంబంలో కావ్య కలిసిపోతే... తన ప్రవర్తనతో స్వప్న ఇబ్బందుల పాలు అవుతోంది. చెడపకురా చెడేవు అంటే ఇదేనేమో!? ఒకరిని మోసం చేయాలని చూస్తే... చివరకు వాళ్ళే మోసపోతారు.
ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు...
చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు!
కవర్ పేజీ చూసి పుస్తకం మీద ఓ అంచనాకు రాకూడదని ఓ సామెత. అదే విధంగా ఓ మనిషి కుటుంబ నేపథ్యం, స్థాయి చూసి వాళ్ళ ప్రతిభను అంచనా వేయొద్దని 'బ్రహ్మముడి' ద్వారా చెప్పారు.
రాజ్ వాళ్ళది ఆభరణాలు డిజైన్ చేసే కంపెనీ. కావ్య వాళ్ళది బొమ్మలకు రంగులు వేసే కుటుంబం. వినాయకుడి విగ్రహంపై ఆభరణాలు గీయడానికి తొలిసారి రాజ్ ఇంటికి వస్తుంది కావ్య. అంతకు ముందు జరిగిన గొడవ కారణంగా అప్పుడు ఆమె ప్రతిభను గుర్తించడు రాజ్. పెళ్లైన తర్వాత కూడా ఆమెకు ఏమీ రాదన్నట్లు ఫీల్ అవుతాడు. కనీసం ఆమె గీసిన డిజైన్లు కూడా చూడడు. చించి చెత్త బుట్టలో పారేస్తాడు. ఇంట్లో గొప్ప కళాకారిణి ఉన్నప్పటికీ... తన క్లయింట్స్ కోరిన విధంగా ఆభరణాలు డిజైన్ చేయగల ఆర్టిస్ట్ కోసం ఊరంతా వెతుకుతాడు. చివరకు, ఆమె ప్రతిభ తెలిసి ఆశ్చర్యపోతాడు. అందుకే, ఎవరి ప్రతిభను తక్కువ అంచనా వేయకూడదని చెప్పేది.
కళ్యాణ్ (కిరణ్ కాంత్) కవితల విషయంలోనూ అంతే! అతడు కవితలు చెప్పడం మొదలు పెడితే కుటుంబ సభ్యులు అందరూ ఆపమని గోల గోల చేసేవారు. మ్యాగజైన్‌లో పబ్లిష్ అయ్యాక సంతోషం వ్యక్తం చేస్తారు.
అప్పు నిప్పు లాంటిది...
అతి రహస్యం బట్ట బయలు!
అప్పు నిప్పు లాంటదని పెద్దలు ఊరికే చెప్పలేదు. రహస్యాన్నీ ఎక్కువ రోజులు దాచలేరు. ఎప్పటికి అయినా సరే రెండూ బయట పడతాయి. 'బ్రహ్మముడి'లో పరోక్షంగా ఇచ్చిన సందేశాలు ఇవి!
స్వప్నను గొప్పింటి కోడలు చేయడం కోసం భర్తకు తెలియకుండా భార్య (నీపా శివ) ఇల్లు తాకట్టు పెడుతుంది. చివరకు, ఆ విషయం భర్తకు తెలుస్తుంది. ఇప్పుడు అప్పు తీర్చలేక కుటుంబమంతా నానా కష్టాలు, మానసిక వేదన పడుతున్నారు. రాహుల్ కూడా స్వప్నను పెళ్లి నుంచి తాను తీసుకెళ్లిన విషయం ఎవరికీ తెలియదని, అంతా మేనేజ్ చేశానని అనుకుంటాడు. చివరకు, ఆ విషయం కూడా బయట పడుతుంది. సారీ... కావ్య బయట పెడుతుంది.
రాహుల్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోబోతే... తాను గర్భవతి అని అబద్ధం చెప్పి అది చెడగొట్టి పెళ్లి చేసుకుంటుంది స్వప్న. రాబోయే ఎపిసోడ్లలో ఆ విషయం బయట పడుతున్నట్లు హింట్ ఇచ్చారు. పైన చెప్పిన కథను బట్టి... రహస్యమైనా, అప్పు అయినా సరే ఏదో ఒక సమయంలో బయట పడక తప్పదు. అప్పు చేస్తే నిప్పులా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దహించివేస్తుంది. అందుకని, తాహతుకు మించి ఖర్చు చేయకూడదు. అబద్ధం మోసగాళ్ళు అనే ముద్ర వేస్తుంది.
స్వేచ్ఛ వేరు, విశృంఖలత్వం వేరు...
ఒకరి స్థాయి, స్థానాన్ని డబ్బు నిర్ణయించలేదు!
ఒకరి స్థాయి, స్థానాన్ని డబ్బు నిర్ణయించలేదని, కేవలం డబ్బు మాత్రమే గౌరవాన్ని తీసుకురాదనే సత్యాన్ని 'బ్రహ్మముడి' ద్వారా దర్శకుడు కుమార్ పంతం చెప్పారు.
భర్త టిఫిన్ చేయలేదని తొలిసారి కావ్య ఆఫీసుకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డులు చులకనగా మాట్లాడతారు. రాజ్ సార్ భార్య ఇటువంటి చీరలు కట్టుకోరని హేళన చేస్తారు. కొన్నాళ్ళకు... కావ్య వేసిన ఆభరణాల డిజైన్లు చూసి ఆఫీసులో అందరూ పొగుడుతారు.
స్వప్న విషయానికి వస్తే... దుగ్గిరాల కుటుంబంలో చెల్లెలు కావ్య కంటే తాను గొప్ప అనిపించుకోవాలని స్వప్న ఓ యాడ్ చేస్తుంది. అందులో హద్దులు మీరి మరీ ఎక్స్‌పొజింగ్ చేస్తుంది. కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవరిస్తుంది. రాజ్ ఆ యాడ్ బ్యాన్ చేయిస్తే... తనకు నచ్చిన పని చేసే స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నిస్తుంది. సంపన్నుల కుటుంబాల్లో మహిళలకు స్వేచ్ఛ లేదన్నట్లు మాట్లాడుతుంది. రాజ్ నానమ్మ చెప్పే మాటలు, తర్వాత సన్నివేశాల్లో స్వేచ్ఛకు, విశృంఖలత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు.
భూదేవి అంత సహనం మహిళ సొంతం!
కావ్యను సెక్యూరిటీ గార్డులు హేళన చేసిన తర్వాత ఆమెను తీసుకెళ్లి చీరలు కొని పెడతాడు రాజ్. భర్త ప్రేమతో చీరలు కొంటున్నారని సంతోషపడిన కావ్యకు... ఆ శారీ షోరూంకు వెళ్ళడానికి ముందు, తర్వాత జరిగిన పరిస్థితులు బాధ కలిగిస్తాయి.
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
దుగ్గిరాల కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత నుంచి అత్తగారు సూటిపోటి మాటలతో మనసుకు బాధ కలిగించినా, కోడలిగా ఆమెను అంగీకరించకపోయినా, భర్త నుంచి కూడా అడుగడుగునా తనకు అవమానాలు ఎదురవుతున్నా సరే... భూదేవి అంత సహనంతో, ఓర్పుగా కావ్య భరిస్తూ వస్తుంది. 'బ్రహ్మముడి' పడిన తర్వాత భర్తే ఇల్లే తన ఇల్లు అని, ఎప్పటికి అయినా భర్త తనను అర్థం చేసుకుంటారని ఎదురు చూస్తోంది.
'బ్రహ్మముడి'లో ఈ ఐదు జీవిత సత్యాలను కథలో భాగంగా చెప్పిన తీరుకు దర్శక, రచయితలను అభినందించాలి. ఈ ఐదు మాత్రమే కాదు... లోతుగా చూస్తే ఇంకా కనపడతాయి. అందుకు తాజా ఉదాహరణ... అవసరాలకు వాడుకోమని భర్త తనకు డబ్బులు ఇచ్చినా కావ్య దుర్వినియోగం చేయలేదు. పుట్టింట్లో అప్పులు ఉన్నాయని తెలిసినా, ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చినా సరే, ఆ డబ్బులు ఇవ్వలేదు. డిజైన్లు గీసినందుకు తనకు వచ్చిన డబ్బును మాత్రమే ఇస్తుంది. ఇక్కడ అత్తారిల్లు, పుట్టినిల్లు వేర్వేరని కాదు... ఆత్మాభిమానం గురించి గొప్పగా చూపించారు.
Also Read : దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial