ఇయర్ ఎండ్ రావడానికి ఇంకా ఐదు నెలల టైమ్ ఉంది... క్రిస్మస్ పార్టీలకు కూడా! కానీ, సినిమా రిలీజులకు కాదు! అవును... ఐదు నెలల ముందు క్రిస్మస్ సీజన్ మీద కర్చీఫ్స్ వేశారు నలుగురు టాలీవుడ్ హీరోలు. ఈ ఏడాది క్రిస్మస్ ప్రేక్షకులకు మన హీరోలు మాంచి విందు భోజనం అందించేలా ఉన్నారు. ఒక్కసారి క్రిస్మస్ 2023కి వస్తున్న సినిమాలు ఏవో చూడండి!


'హాయ్ నాన్న'తో వస్తున్న నాని
క్రిస్మస్ బరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మొదటి సినిమా 'హాయ్ నాన్న'. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. 'దసరా' విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రమిది. ఇందులో 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. 


'దసరా'లో రా అండ్ రస్టిక్ రోల్ చేసిన నాని... 'హాయ్ నాన్న' (Hi Nanna Movie)లో సాఫ్ట్ రోల్ చేస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రకు వస్తే... వృత్తిరీత్యా కెమెరా మ్యాన్. సంథింగ్ స్పెషల్ ఏంటంటే... ఓ చిన్నారికి తండ్రిగా నటిస్తుండటం! ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. అందులో హీరో నానిని 'హాయ్ నాన్నా' అంటూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పిలవడం సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 


'సైంధవ్'తో థ్రిల్ ఇవ్వనున్న వెంకటేష్
క్రిస్మస్ బరిలో దిగుతున్న రెండో సినిమా 'సైంధవ్'. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరో. 'హిట్' ఫ్రాంచైజీతో వరుస విజయాలు అందుకున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. డిసెంబర్ 22న సినిమా విడుదల కానుంది.


'సైంధవ్'కు వస్తే... హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరోయిన్లు శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్నారు. వెంకీ 75వ సినిమా కావడంతో సంథింగ్ స్పెషల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారట. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ సిన్మా ఉంటుందని టాక్.


సుధీర్ బాబు 'హరోం హర' కూడా ఆ రోజే
వెంకటేష్ 'సైంధవ్'తో పాటు నైట్రో స్టార్ సుధీర్ బాబు 'హరోం హర' కూడా డిసెంబర్ 22న విడుదల కానుంది. 'ఫస్ట్ ట్రిగ్గర్' పేరుతో వీడియో విడుదల చేశారు. అందులో 'అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు. కానీ, ఇది యాడెడో తిరిగి నన్ను పట్టుకుంది' అంటూ సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. 


'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'గా నితిన్ కామెడీ కిక్
క్రిస్మస్ బరిలో వస్తున్న ఆఖరి సినిమా 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'. టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విడుదల తేదీ కూడా చెప్పేశారు. డిసెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 'కిక్' తర్వాత తాను ఆ జానర్ స్క్రిప్ట్ రాశానని దర్శకుడు వక్కంతం వంశీ చెప్పారు. ఆ ఒక్క మాటతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆడియన్స్ ఆశిస్తున్నారు.


పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హీరోల హవా
ఒక్క నితిన్ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' టీమ్ మాత్రమే పాన్ ఇండియా సినిమా అని అనౌన్స్ చేయలేదు. మిగతా మూడు సినిమాలు పాన్ ఇండియా విడుదలకు రెడీ అవుతున్నాయి. 'రానా నాయుడు' వెబ్ సిరీస్, సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాతో హిందీ ప్రేక్షకులకు వెంకటేష్ దగ్గర అయ్యారు. 'దసరా' సినిమాతో నాని కూడా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్లారు. సుధీర్ బాబు అయితే హిందీలో టైగర్ ష్రాఫ్ 'భాగీ'లో విలన్ రోల్ చేశారు. ఆయన కూడా హిందీ ప్రేక్షకులకు తెలుసు.


Also Read : డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!


'హాయ్ నాన్న', 'సైంధవ్', 'హరోం హర'... మూడు డిఫరెంట్ జానర్ సినిమాలు. సో... ఏ సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఆ సినిమాకు ఉంటారు. పాజిటివ్ టాక్ వస్తే... పాన్ ఇండియా స్థాయిలో మూడు సినిమాలకు ప్రేక్షకులు వస్తారు. 'కిక్'ను హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తే సూపర్ హిట్ అయ్యింది. ఏమో... నితిన్ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'ను హిందీలో విడుదల చేసినా చేయవచ్చు. అప్పుడు అన్ని భాషల్లో, పాన్ ఇండియా స్థాయిలో క్రిస్మస్ 2023కి మన హీరోల హవా ఉంటుంది. 


Also Read పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాకు ఆడిషన్స్ ఇచ్చా - 'సామజవరగమన' ఫేమ్ రెబా మోనికా జాన్




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial