Sundeep Kishan's Ooru Peru Bhairavakona Review: సరైన, భారీ విజయం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న యువ హీరో సందీప్ కిషన్. ఈ ఏడాది వచ్చిన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'లో ఓ క్యారెక్టర్ చేస్తే... తెలుగులో ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. గతేడాది ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ 'మైఖేల్' ఫ్లాప్ అని స్వయంగా సందీప్ కిషన్ చెప్పారు. ఆయన ఖాతాలో సాలిడ్ సక్సెస్ పడి చాలా రోజులైంది. ఈ శుక్రవారం 'ఊరు పేరు భైరవకోన'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీఐ ఆనంద్ దర్శకత్వం, అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన చిత్రమిది. విడుదలకు రెండు రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూడండి.


కథ: భైరవకోనలోకి వెళ్లడం తప్ప... ఆ ఊరు నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన జనాలు లేరు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బసవ (సందీప్ కిషన్), జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్) ఆ ఊరిలోకి వెళతారు. నిజానికి, బసవ స్టంట్ మ్యాన్. అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం, ఆమె గూడెం ప్రజల కోసం ఒక పెళ్లిలో అమ్మాయి నగలు దొంగతనం చేస్తాడు.


భైరవకోన వెళ్లిన బసవకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడ పెద్దమ్మ (వడివుక్కరసి), రాజప్ప (రవి శంకర్), డాక్టర్ నారప్ప (వెన్నెల కిశోర్) ఏం చేశారు? భైరవకోన చరిత్ర ఏమిటి? ఆ కోనకు, గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు సంబంధం ఏమిటి? భైరవకోన నుంచి బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: దర్శకుడు వీఐ ఆనంద్ సూపర్ నాచురల్ అంశాలతో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' వంటి హారర్ సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు. అందుకని ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత 'ఊరు పేరు భైరవకోన' సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన పాటలకు మిలియన్స్ వ్యూస్ రావడం కూడా ప్లస్ అయ్యింది. మరి, సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...


'ఊరు పేరు భైరవకోన'కు బలం, బలహీనత వీఐ ఆనంద్ (VI Anand)లో దర్శకుడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించే సూపర్ నాచురల్ / హారర్ / థ్రిల్లర్ / కామెడీ మూమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఇంటర్వెల్ వరకు వీఐ ఆనంద్ మ్యాజిక్ కొంత వరకు వర్కవుట్ అయ్యింది. ఆ తర్వాత కథలో బలం తగ్గింది. వీఐ ఆనంద్ మ్యాజిక్ మిస్ అయ్యింది. అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా కాస్త రొటీన్ లవ్ స్టోరీ అయిపోయింది.


భాను భోగవరపు రాసిన కథ, ఆ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ క్రియేట్ చేసిన భైరవకోన ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభమే ఊరు చూపించి భైరవకోనపై ఆసక్తి కలిగించారు. తర్వాత హీరో హీరోయిన్ల పరిచయం సాదాసీదాగా ఉన్నప్పటికీ... పాటలు, కామెడీ సీన్లతో సినిమా పాసైపోయింది. భైరవకోనలో ఎంటరైన తర్వాత వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ నవ్విస్తుంది. మిగతా పాత్రల ప్రవర్తన క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంటుంది. ఆ తర్వాత అసలు సిసలు కథలోకి వెళ్లిన తర్వాత ఆసక్తి నెమ్మదిగా సన్నగిల్లుతుంది.


'ఊరు పేరు భైరవకోన'లో పాత్రలను పరిచయం చేసేటప్పుడు కలిగే ఆసక్తి కథలోకి వెళ్లిన తర్వాత ఉండదు. అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించి మరీ హీరో రిస్క్ చేస్తున్నాడంటే... ప్రేమ ఎంత బలమైనదో అనుకుంటాం! ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూస్తే అంత డెప్త్ ఉండదు. అక్కడ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. ఇక దెయ్యాలను బకరా చేయాలనుకునే సన్నివేశాలు శ్రీను వైట్ల సినిమాలను గుర్తు చేశాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా కొత్తగా లేదు. 


టెక్నికల్ టీమ్ నుంచి వీఐ ఆనంద్ మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. శేఖర్ చంద్ర పాటలు సినిమా విడుదలకు ముందు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

బసవ పాత్రకు సందీప్ కిషన్ న్యాయం చేశారు. 'వెన్నెల' కిశోర్, వైవా హర్ష కాంబోలో సీన్లు, వాళ్లిద్దరి టైమింగ్ సూపర్బ్. బ్రహ్మాజీ సైతం నవ్వించారు. భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ ఓకే. కానీ, ఆమెకు రాసిన సీన్లలో బలం లేదు. కావ్య థాపర్ హీరోయిన్ అని చెప్పలేం. ఉన్నంతలో అందంగా కనిపించారు. కథలో కీలక పాత్ర చేశారు. రవి శంకర్, వడివక్కరసి, జయప్రకాశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.


Also Read: భ్రమయుగం ఆడియన్స్ రివ్యూ: మమ్ముట్టి హారర్ థ్రిల్లర్ - బ్లాక్ అండ్ వైట్ సినిమా టాక్ ఎలా ఉందంటే?


'ఊరు పేరు భైరవకోన' స్టోరీ ఐడియా బావుంది. అయితే ఆ కథలో కీలకమైన హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వాళ్లిద్దరి బంధంలో బలం లేదు. కథనంలో పట్టు లేదు. విశ్రాంతికి ముందు జరిగిన సన్నివేశాలతో భైరవకోన ప్రపంచంలో తర్వాత ఏం జరుగుతుందో? అనే ఉత్కంఠ ఉంటుంది. విశ్రాంతి తర్వాత అంతకు అంత నిరాశ కలిగిస్తుంది. రెండు గంటలు థియేటర్లలో కూర్చోవడం, ఈ సినిమాతో సందీప్ కిషన్ విజయం అందుకోవడం కష్టం.


Also Readఊరు పేరు భైరవకోన ఆడియన్స్ రివ్యూ: సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ - మరి సినిమా ఎలా ఉంది?