సినిమా రివ్యూ: ది లెజెండ్
రేటింగ్: 1/5
నటీనటులు: అరుల్ శరవణన్, గీతిక తివారీ, ఊర్వశి రౌతేలా, సుమన్ తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఎడిటర్: రూబెన్
నిర్మాణ సంస్థ: శరవణన్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: జేడీ-జెర్రీ
విడుదల తేదీ: జులై 28, 2022


లెజెండ్ శరవణ స్టోర్స్ అంటే తమిళనాడులో చాలా ఫేమస్. లలితా జ్యుయెలర్స్ యజమాని లాగానే వాటి అధిపతి అరుల్ శరవణన్ కూడా అక్కడ యాడ్స్‌లో కనిపిస్తాడు. అయితే ఈ లెజెండ్ శరవణన్ మరో అడుగు ముందుకేసి సినిమాలో హీరోగా నటించాలనుకున్నాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు చేతిలో డబ్బులుంటే సాధించలేనిది ఏం ఉంది. అనుకోవడమే ఆలస్యం హారిస్ జైరాజ్ సంగీతం, బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఒక హీరోయిన్, సుమన్, నాజర్ వంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు రెడీ అయిపోయారు. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది?


కథ: డాక్టర్ శరవణన్ (అరుల్ శరవణన్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైంటిస్ట్. మెడికల్ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి సొంత ఊర్లోనే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాలేజ్‌కు ప్రిన్సిపల్‌గా వస్తాడు. తనది అక్కడ చాలా పెద్ద కుటుంబం. అదే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే తులసిని (గీతిక తివారీ) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన స్నేహితుడు తిరుపతి (రోబో శంకర్) డయాబెటిస్‌తో చనిపోవడం శరవణన్‌ను కదిలిస్తుంది. దీంతో డయాబెటిస్‌కు మందు కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు వీజే (సుమన్) ఆసియాలోని అతి పెద్ద ఇన్సులిన్ సప్లయర్. తన ప్రైవేట్ ల్యాబ్‌లో ఎందరి మీదనో అక్రమంగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. శరవణన్ డయాబెటిస్‌కు మందు కనిపెడితే తన బిజినెస్ క్లోజ్ అయిపోతుంది అని గ్రహిస్తాడు. తర్వాత ఏం అయింది? ఈ కథలో ఊర్వశి రౌతేలా పాత్ర ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: కొంతమందికి జీవితంలో ఎంత సాధించినా ఎప్పుడో కన్న నిజం కాని కలే ఎక్కువగా గుర్తుంటుంది. లెజెండ్ శరవణన్‌కు కూడా అలాగే హీరో కావాలన్న కల ఉందేమో దాన్ని ఈ వయసులో నెరవేర్చుకున్నాడు. కనీసం చాలా మంది సీనియర్ హీరోల్లాగా వయసుకు తగ్గ కథ ఎంచుకుంటే బాగుండేది. కానీ మొదటి సినిమాతోనే ప్రపంచాన్ని కాపాడేసే కథను శరవణన్ ఎంచుకున్నాడు. ఆ కథకు దర్శక ద్వయం జేడీ-జెర్రీ ఇచ్చిన ట్రీట్‌మెంట్ మరింత రొటీన్‌గా ఉంది.


విలన్ ఇంట్రడక్షన్, తర్వాత హీరో ఇంట్రడక్షన్, ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్ సాంగ్, హీరోయిన్ ఇంట్రడక్షన్... ఇలా సీన్లన్నీ ఫార్ములా ప్రకారం పేర్చినట్లు అల్లుకుంటూ పోయారు. కొన్ని చోట్ల అయితే కనీసం సీన్లకు మధ్య కనెక్షన్ కూడా ఉండదు. సీన్ మధ్యలో అర్ధంతరంగా కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ ఎక్కడో మధ్యలో ఓపెన్ అవుతుంది. ఇలాంటి ఎడిటింగ్ లోపాలు కూడా సినిమాలో ఉన్నాయి. పాటలు సిట్యువేషన్ ప్రకారం కాకుండా హీరోయిన్లను చూపించడానికి పెట్టినట్లు ఉంది. ఒక పాటలో యషికా ఆనంద్, మరో పాటలో రాయ్ లక్ష్మీ, రెండు పాటల్లో హీరోయిన్ గీతిక తివారీ, మరో రెండు పాటల్లో ఊర్వశి రౌతేలా కనిపిస్తారు.


ఇక హీరో చేతిలో తన్నులు తినడానికి మాత్రమే ఉన్న విలన్ గ్యాంగ్‌లో సుమన్ మెయిన్ మెంబర్ కాగా... మరో ఇద్దరు లాస్ట్‌లో రివీల్ అవుతారు. పేరుకి కథ తెలంగాణలో జరుగుతున్నప్పటికీ స్క్రీన్ మీద తమిళ వాసన మన కళ్లను, చెవులను చాచి పెట్టి కొడుతూనే ఇది డబ్బింగ్ సినిమా అని గుర్తు చేస్తుంది. ‘మీ తాత పరిచయం అయిన మూడో రోజే అరటి తోటకు తీసుకువెళ్లా...’ అని 10 సంవత్సరాల వయసున్న మనవళ్లు, మనవరాళ్లకు చెప్పే మోడర్న్ బామ్మలను కూడా ఈ సినిమాలో చూడచ్చు.


హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఒక్క పాట కూడా మర్చిపోలేం. ఎందుకంటే అస్సలు వినేటప్పుడే గుర్తుండదు కాబట్టి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సరేసరి. ఎడిటర్ రూబెన్ అయితే కత్తెరకు అస్సలు పని చెప్పినట్లు లేదు. నిర్మాణ విలువలు మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి. విదేశాల్లో కూడా ఈ సినిమాను ఖర్చుకు తగ్గకుండా చిత్రీకరించారు.


Also Read : ది గ్రే మ్యాన్ రివ్యూ: ధనుష్ హాలీవుడ్ సినిమాలో యాక్షన్ ఓకే, కథ సంగతేంటి?


ఇక నటీనటుల విషయానికి వస్తే... అరుల్ శరవణన్ ముఖంలో ఒక్క ఎక్స్‌ప్రెషన్ కూడా కనిపించదు. దీనికి తోడు తనకు వయసు కనిపించకుండా వేసిన మేకప్ మరింత ఎబ్బెట్టుగా ఉంది. తులసి పాత్రలో నటించిన గీతిక ఆకట్టుకుంటుంది. ఊర్వశి రౌతేలా రొటీన్ పాత్రనే పోషించింది. ఇక సుమన్, నాజర్, రోబో శంకర్ పర్వాలేదనిపిస్తారు. సుమన్ విలనీ కొన్నిసార్లు 80ల్లో వచ్చే విలన్స్‌ను గుర్తు చేస్తే అది మీ తప్పు కాదు. ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ నటించిన చివరి సినిమా ఇదే.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో ఈ సినిమా చూడాలనుకుంటే సైలెంట్‌గా ఇంట్లో కూర్చోవడం ఉత్తమం. డబ్బులతో పాటు విలువైన సమయం కూడా కలిసివస్తుంది.


Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?