సినిమా రివ్యూ: ది గ్రే మ్యాన్
రేటింగ్: 2.5/5
నటీనటులు: ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్, జెస్సికా హెన్ విక్, జూలియా బట్టర్స్, బిల్లీ బాబ్ థ్రోన్టన్ తదితరులు  
కథ: మార్క్ గ్రీనీ 
సినిమాటోగ్రఫీ: స్టీఫెన్ ఎఫ్ విండోన్ 
సంగీతం: హెన్రీ జాక్ మ్యాన్
దర్శకత్వం: రూసో బ్రదర్స్ (ఆంటోనీ, జో)
విడుదల తేదీ: జూలై 22, 2022
ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌


హాలీవుడ్ మూవీస్ కోసం ఇండియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వెయిట్ చేస్తారు. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూసేవారూ ఉన్నారు. అయితే... ధనుష్ (Dhanush) ఓ క్యారెక్టర్‌లో నటించిన కారణంగా దక్షిణాది ప్రేక్షకులకు సైతం 'ది గ్రే మ్యాన్' (The Gray Man Telugu Movie) గురించి తెలిసింది. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్ ఎండ్ గేమ్' తర్వాత దర్శక ద్వయం, రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ  యాక్షన్ సినిమా ఎలా ఉంది (The Gray Man Movie Review)?


కథ (The Gray Man Movie Story): అమెరికన్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో సిక్స్ (ర్యాన్ గోస్లింగ్) ఒక ఏజెంట్. అతడికి అంటూ కొన్ని విలువలు ఉంటాయి. చిన్న పిల్లలను చంపడం ఇష్టం ఉండదు. అతడిని అందరూ గ్రే మ్యాన్ అంటుంటారు. బ్యాంకాక్‌లో మిషన్ మీద వెళ్లిన అతడికి సీఐఏలో ఉన్నత అకారులకు చెందిన కొన్ని రహస్యాలు కల పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఆ సమాచారం బయటకు రాకుండా ఉండటం కోసం సిక్స్‌ను చంపేయమని సీఐఏ మాజీ ఏజెంట్, సైకో లాంటి లాయిడ్ (క్రిస్ ఇవాన్స్)ను నియమిస్తారు. సిక్స్‌ను లాయిడ్ అండ్ టీమ్ చంపేసిందా? లేదా? సిక్స్‌కు సహచర ఉద్యోగి డానీ మిరండా (అనా డి ఆర్మాస్) ఎటువంటి సహాయం చేసింది? సిక్స్ కాపాడాలనుకుంటున్న చిన్న పాప క్లైరే (జూలియా బట్టర్స్) ఎవరు? చివరికి ఏమైంది? అనేది మిగతా సినిమా.         


విశ్లేషణ (The Gray Man Telugu Review) : యాక్షన్... యాక్షన్... యాక్షన్... సిక్స్ అలియాస్ ర్యాన్ గోస్లింగ్ యాక్షన్ అవాయిడ్ చేయాలని చూస్తాడు. కానీ, అతడిని యాక్షన్ వదిలి పెట్టలేదు. 'ది గ్రే మ్యాన్' చూశాక సినిమాలో ఏముంది? అని ఆలోచిస్తే... యాక్షన్ తప్ప మరొకటి లేదు. 


'ది గ్రే మ్యాన్' ట్రైలర్ చూసినప్పుడు ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ కలిగింది. సినిమాలో యాక్షన్ అయితే ఉంది కానీ... థ్రిల్ మాత్రం లేదు. సుమారు పది ఫైట్స్ ఉన్నట్టు ఉన్నాయి. వాటిని కనెక్ట్ చేసే కథ 'ది గ్రే మ్యాన్'లో కరువైంది. యాక్షన్ మధ్యలో లీడ్ కాస్ట్‌లో గ్రే షేడ్స్ చూపించే సన్నివేశాలు తక్కువ అయ్యాయి.


'ది గ్రే మ్యాన్' కథ, కథా నేపథ్యం, హీరో క్యారెక్టర్ కొత్తగా ఏమీ అనిపించదు. జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీలను గుర్తు చేస్తుంది. గాల్లో, నేలపై, నీటిలో... ఏజెంట్ సిక్స్ ఎక్కడైనా ఫైట్ చేస్తాడు. ఎటువంటి ప్రమాదం, పరిస్థితుల నుంచి అయినా తప్పించుకుంటాడు. అందువల్ల, ఏదీ కొత్తగా అనిపించదు. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీలో రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. రూసో బ్రదర్స్ యాక్షన్ మీద పెట్టిన  శ్రద్ధ కథపై పెట్టలేదు. హీరోకి ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. దాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.


నటీనటులు ఎలా చేశారు?: ర్యాన్ గోస్లింగ్ ఫైట్స్ చేశారు. కొన్ని సీన్స్‌లో సెటిల్డ్‌గా చేశారు. అందంగా కనిపించారు. యాక్షన్ స్టార్ అనిపించుకునే ప్రయత్నం చేశారు. అయితే... క్యారెక్టర్‌లో కొత్తదనం లేకపోవడంతో ఆయన అంతకు మించే చేసేది ఏమీ లేదు. క్రిస్ ఇవాన్స్ పాత్రలో సైకో లక్షణాలు ఉండటంతో నటుడిగా కొత్తదనం చూపించే అవకాశం దక్కింది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేసినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఫైట్‌లో క్రిస్ చూపించిన యాటిట్యూడ్ సూపర్. అనా డి ఆర్మాస్ నటన బావుంది. కానీ, ఆమెకు టాలెంట్ చూపించే అవకాశం దక్కలేదు. ధనుష్ పాత్ర రెండు మూడు సన్నివేశాలకు పరిమితం అయ్యింది. అయితే... ర్యాన్, అనాతో ఫైట్ చేశారు. బాలనటి జూలియా బట్టర్స్, ర్యాన్ గోస్లింగ్ మధ్య ప్రారంభంలో వచ్చే సీన్స్ కాస్త నవ్విస్తే... తర్వాత వచ్చే సీన్స్ ఎమోషనల్ గా ఉంటాయి.


Also Read : షంషేరా రివ్యూ: నాలుగేళ్ల తర్వాత వచ్చిన రణ్‌బీర్ హిట్ కొట్టాడా?


చివరగా చెప్పేది ఏంటంటే?: యాక్షన్ ప్రియులను ఆకట్టుకునే అంశాలు 'ది గ్రే మ్యాన్'లో ఉన్నాయి. యాక్షన్ మాత్రమే కాకుండా కథ కోరుకునే వాళ్లను ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టమే. ధనుష్ కోసం చూడాలనుకుంటే ఆలోచించుకోండి. ఆయన స్క్రీన్ టైమ్ తక్కువ.


Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?