సినిమా రివ్యూ: దర్జా
రేటింగ్: 1/5
నటీనటులు: సునీల్, అనసూయ భరద్వాజ్, షఫీ, ఆమని, '30' ఇయర్స్ పృథ్వీ, అక్సా ఖాన్, షమ్ము, 'షకలక' శంకర్, 'మిర్చి' హేమంత్, 'ఛత్రపతి' శేఖర్, 'షేకింగ్' శేషు, 'జబర్దస్త్' నాగిరెడ్డి, సమీర్ తదితరులు
కథ: నజీర్
మాటలు : పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: దర్శన్
సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
నిర్మాత: శివ శంకర్ పైడిపాటి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సలీం మాలిక్
విడుదల తేదీ: జూలై 22, 2022
అనసూయ భరద్వాజ్ (Anasuya)కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తున్నారామె. భారీ చిత్రాల మధ్యలో చిన్న చిత్రాలు కూడా చేస్తున్నారు. అనసూయ కత్తి పట్టి, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం... ఆమెకు తోడు సునీల్ (Sunil) యాడ్ కావడంతో 'దర్జా' సినిమా (Darja Telugu Movie) పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Darja Movie Story): కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరులో అందరికీ హడల్. తన మాట వినని పోలీసులను చంపేస్తుంది. తన సాయంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎదురు తిరిగితే ఆయన కుమార్తెను తమ్ముడితో రేప్ చేయించి చంపిస్తుంది. బందరు నేల మీద తిరుగు లేని కనకం... సముద్రంపై కూడా పట్టు సాధించాలని అనుకుంటుంది. బందరు పోర్టు కాంట్రాక్టు సొంతం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఎదురే లేదనుకున్న కనకానికి ఏసీపీ శివ శంకర్ పైడిపాటి (సునీల్) రూపంలో సుడిగుండం అడ్డు వస్తుంది. మధ్యలో కనకం, ఆమె తమ్ముడు బళ్ళారిని చంపాలని తిరుగుతున్న రంగ ఎవరు? కనకం సామ్రాజ్యంలో అతడి అన్న, మూగవాడు అయినటువంటి గణేష్, తీన్మార్ గీత (అక్సా ఖాన్), పుష్ప పాత్ర ఏమిటి? కనకం అరాచకాలను ఏసీపీ శివ శంకర్ అడ్డుకున్నారా? లేదంటే అతడిని కనకం చంపేసిందా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Darja Review) : 'దర్జా'లో అనసూయ రోల్ అతిథి పాత్రకు ఎక్కువ, ప్రత్యేక పాత్రకు తక్కువ అన్నట్టు ఉంటుంది. సినిమా ప్రారంభంలో అనసూయ కనిపిస్తారు. ఆ తర్వాత మధ్య మధ్యలో మెరుపుతీగలా పావు గంటకో, అర గంటకో ఒక్కో సన్నివేశంతో పలకరించి వెళతారు. అనసూయ పాత్రను అడ్డం పెట్టుకుని ప్రేక్షకులతో దర్శకుడు దాగుడుమూతలు ఆడారు. సునీల్ కూడా ఇంటర్వెల్‌కు ముందు ఎంట్రీ ఇచ్చారు. సెకండాఫ్‌లో ఆయన స్క్రీన్ టైమ్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పాలి.
అనసూయ, సునీల్ స్క్రీన్ టైమ్ పక్కన పెట్టి సినిమాకు వస్తే... తెలుగు తెరపై పిప్పి పిప్పి చేసిన కథతో 'దర్జా' తీశారు. సునీల్ ఫ్లాష్‌బ్యాక్, బ్రదర్స్ రంగ - సురేష్ స్టోరీ, అనసూయ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ ఏదీ కొత్తగా ఉండదు. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సినిమాలో చూసిన సన్నివేశాలు మళ్ళీ స్క్రీన్ మీద వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. బహుశా... పేపర్ మీద కథ చూసినప్పుడు కమర్షియల్ సినిమాకు కావాల్సిన సరుకు సినిమాలో ఉందని చిత్ర బృందం భావించి ఉండొచ్చు. ఆ సరుకు స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు విసుగు తెప్పించింది.
కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ అంటూ విశ్లేషించడానికి ఏదీ లేదు. దర్శకుడు మొదలుకుని మిగతా టెక్నీషియన్లు అందరూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ అయితే చెవులకు పట్టిన తుప్పు వదిలేలా రీ రికార్డింగ్ చేశారు. నేపథ్య సంగీతంతో విధ్వంసం సృష్టించారు. పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
నటీనటులు ఎలా చేశారు?: పరమ రొటీన్ కథ, కథనంతో తెరకెక్కిన 'దర్జా'లో కాస్త రిలీఫ్ ఉందంటే అది సునీల్ యాక్టింగ్. ఏసీపీగా డీసెంట్ పెర్ఫార్మన్స్‌తో న్యాయం చేసే ప్రయత్నం చేశారు. సన్నివేశాలు ఆయనకు సహకరించ లేదనుకోండి... అది వేరే విషయం. అనసూయకు కనక మహాలక్ష్మి డిఫరెంట్ రోల్. 'దర్జా'లోని పాటల్లో కంటే 'ఢీ' షోలో కంటెస్టెంట్‌గా అక్సా ఖాన్ అందంగా కనిపించారు. మంచి స్టెప్స్ వేశారు. ఆమని, '30 ఇయర్స్' పృథ్వీ, షఫీ, 'ఛత్రపతి' శేఖర్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను సరిగా ఉపయోగించుకోలేదు. 'షకలక' శంకర్ సీన్స్ నవ్వించలేదు. పైగా, ఎప్పుడు అయిపోతాయా? అని ఎదురు చూసేలా చేశాయి.
చివరగా చెప్పేది ఏంటంటే?: 'దర్జా'గా ఇంట్లో కూర్చుకోవడం మంచిది. సునీల్, అనసూయ కోసం థియేటర్లకు వెళదామని అనుకునే ప్రేక్షకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.