వెబ్ సిరీస్ రివ్యూ: పరంపర సీజన్ 2
రేటింగ్: 2.5/5
నటీనటులు: నవీన్ చంద్ర, శరత్ కుమార్, జగపతి బాబు,ఇషాన్ వెంకటేష్, ఆకాంక్ష సింగ్, నైనా గంగూలీ, ఆమని, కస్తూరి, రవి వర్మ, 'బిగ్ బాస్' దివి తదితరులు
ఎడిటర్: తమ్మి రాజు
కథ : హరి ఏలేటి
మాటలు: కృష్ణ విజయ్ ఎల్, హరి ఏలేటి
సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్
సంగీతం: నరేష్ కుమరన్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల
విడుదల తేదీ: జూలై 21, 2022
ఎపిసోడ్స్: 5
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
'బాహుబలి' చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ 'పరంపర'. జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్షా సింగ్, ఆమని, ఇషాన్ వెంకటేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫస్ట్ సీజన్‌కు ఎటువంటి స్పందన లభించిందనేది పక్కన పెడితే... ఇప్పుడు సెకండ్ సీజన్ వచ్చింది. 'పరంపర 2' ఎలా ఉంది? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
'పరంపర 2' రివ్యూలోకి వెళ్లే ముందు ఫస్ట్ సీజన్‌లో కథ ఏంటి? అనేది ఒక్కసారి చూస్తే... వీర నాయుడు (మురళీ మోహన్) ఇద్దరు కుమారులు. ఒకరు దత్త పుత్రుడు మోహన్ రావు (జగపతి బాబు), ఇంకొకరు రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్). వీర నాయుడు రాజకీయ వారసుడిగా మోహన్ రావును ప్రజలు చూస్తారు. అయితే... మోహన్ రావును రాజకీయాల్లోకి వెళ్లకుండా నాగేంద్ర నాయుడు అడ్డుకుంటాడు. తన పక్కన పప్పెట్‌లా పెట్టుకుంటాడు. ఇది మోహన్ రావు కుమారుడు గోపి (నవీన్ చంద్ర)కి నచ్చదు. బాబాయ్ మీద పై చేయి సాధించాలని, గెలవాలని ప్రయత్నిస్తాడు. తొలుత కాలేజీ ఎన్నికల్లో బాబాయ్ కుమారుడు సురేష్ (ఇషాన్ వెంకటేష్) మీద పోటీ చేస్తాడు. ఓటమి చవి చూస్తాడు. సురేష్‌కు తన మేనకోడలు రచన (ఆకాంక్షా సింగ్)ను ఇచ్చి పెళ్లి చేయాలని నాగేంద్ర నాయుడు నిర్ణయిస్తాడు. ఆమెతో గోపి ప్రేమలో పడేస్తాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. ప్లాన్ వేసి మరీ వాళ్ళిద్దర్నీ విడగొడతాడు సురేష్. చివరకు సురేష్‌ను రచన పెళ్లి చేసుకుంటుంది అనుకోండి. ఇలా అడుగడుగునా గోపికి ఓటమి ఎదురవుతుంది. సురేష్, రచన పెళ్లిలో గోపి గొడవ చేయడం, అతడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఫస్ట్ సీజన్ ముగుస్తుంది.
కథ (Parampara Season 2 Web Series Story) : లైసెన్స్ లేకుండా తుపాకీ (మారణాయుధం) వాడినందుకు చింతలపూడి గోపికృష్ణ (నవీన్ చంద్ర)కు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. సారీ చెబితే అతడిని బయటకు తీసుకు వస్తానని మోహన్ రావుకు నాగేంద్ర నాయుడు చెబుతాడు. తండ్రి అడిగినా సారీ చెప్పడానికి గోపి ఇష్టపడడు. జైలులో గోపికి రత్నాకర్ (రవి వర్మ) పరిచయం అవుతారు. ఒక స్కామ్‌లో ఇరుక్కుని జైలుకు వెళ్లిన సీనియర్ సివిల్ సర్వెంట్ (ఐఏఎస్ ఆఫీసర్) అతడు. జైలు నుంచి వ్యాపారాలు సాగిస్తాడు. రత్నాకర్ సహాయంతో బెయిల్ మీద గోపి బయటకు వస్తాడు. ఇంటి నుంచి కూడా వస్తాడు. భానుమతి ఫౌండేషన్ పెట్టి సంపాదించిన ప్రతి రూపాయిని సామాజిక సేవకు ఖర్చు పెడతాడు. గోపి రాజకీయాల్లోకి వస్తాడేమోనని అతడిని అడ్డుకోవడం మొదలు పెడతారు నాగేంద్ర నాయుడు. ఆ తర్వాత ఏమైంది? గోపి మీద మర్డర్ అట్టెంప్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే పదవికి సురేష్ నామినేషన్ వేస్తే... అతడికి పోటీగా గోపి తల్లి భానుమతి నామినేషన్ వేయడం వెనుక ఎవరు ఉన్నారు? కట్టుకున్న భార్య, కుమారుడికి మోహన్ రావు మద్దతు ఇచ్చారా? లేదంటే నాగేంద్ర నాయుడు వెనుక ఉన్నారా? - ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే... వెబ్ సిరీస్ చూడాలి.
విశ్లేషణ (Parampara Season 2 Web Series Review) : ముందుగా చెప్పాల్సింది ఏంటంటే... 'పరంపర' సీజన్ 2 చూసే ముందు సీజన్ 1 చూడాలి. 'పరంపర 2' ఫస్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ సీజన్‌లో ఏం జరిగిందనేది ఫాస్ట్ ఫార్వార్డ్‌లో చూపించినప్పటికీ... మెయిన్ క్యారెక్టర్స్, ఎమోషన్స్ అర్థం కావాలంటే ముందు ఏం జరిగిందో చూడటం మంచిది.
'పరంపర 2'కి వస్తే... ఫస్ట్ సీజన్‌తో కంపేర్ చేస్తే ఎపిసోడ్స్ తక్కువ. ఎపిసోడ్స్ నిడివి కూడా తక్కువ. అందువల్ల, కొంచెం రేసీగా ఉంటుంది. ఫస్ట్ సీజన్ చూసినవాళ్లు ఎవరైనా జైలు నుంచి బయటకొచ్చిన గోపి, బాబాయ్ మీద పగ తీర్చుకుంటాడని అనుకుంటారు. అయితే... 'నా ఆవేశం మా అమ్మకి ఏ తోడు లేకుండా చేసింది. నన్ను ఒంటరి వాడిని చేసింది' జైలులో తోటి ఖైదీ చెప్పడం, గోపితో రత్నాకర్ చెప్పిన మాటలు వింటే... ఆవేశంతో కాదు, ఆలోచనతో అడుగులు వేస్తాడని అర్థం అవుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్నా... మూడో ఎపిసోడ్ నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఫైనల్ ఎపిసోడ్ బావుంది... ముఖ్యంగా ఎండింగ్, మూడో సీజన్‌కు ఇచ్చిన లీడ్!
రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్ అండ్ రైటర్స్ సక్సెస్ అయ్యారు. ఇక కథ విషయానికి వస్తే... కొన్ని లూప్ హొల్స్, లాజిక్స్ వదిలేశారు. ఎస్పీ కనిపించకుండా పోతే ఎవరూ పట్టనట్టు ఉండడం వింతగా ఉంది. ఇలా కొన్ని విషయాల్లో స్వేచ్ఛ తీసుకున్నారు. అటువంటి తప్పులు చేయకుండా ఉంటే 'పరంపర 2' మరింత రేసీగా, ఆసక్తికరంగా ఉండేది. ఈ కథకు కృష్ణ విజయ్ ఎల్, హరి ఏలేటి రాసిన మాటలు బావున్నాయి. తక్కువ మాటల్లో ఎక్కువ భావం చెప్పారు. కాస్ట్యూమ్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. రాజకీయ, కుటుంబ నేపథ్యంలో ఇటువంటి కథలు కొన్ని రావడం కూడా 'పరంపర 2'కు మైనస్. ఫస్ట్ సీజన్ చూడని వాళ్ళకు కొన్ని సన్నివేశాలు అర్థం కావు. అదొక మైనస్.
నటీనటులు ఎలా చేశారు? : జగపతి బాబు, శరత్ కుమార్ అనుభవం స్క్రీన్ మీద కనిపిస్తుంది. రోడ్డు మీద ఒక సీన్ ఉంటుంది... (కథ చెప్పలేం కానీ) రాజకీయ నాయకుడి కారును జగపతి బాబు ఆపుతారు. అందులో ఒక హీరోయిజం ఉంటుంది. అక్కడ జగపతి బాబు యాక్టింగ్, యాటిట్యూడ్ సూపర్. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. శరత్ కుమార్ కూడా అంతే! పాత్రలో జీవించారు. నవీన్ చంద్ర బాగా చేశారు. అవసరం అయిన చోట ఆవేశాన్ని, ఆలోచనను కళ్ళలో చూపించారు. సీజన్ 1తో పోలిస్తే... రచన పాత్రలో ఆకాంక్ష సింగ్‌కు ఎక్కువ ఎమోషన్స్ చూపించే అవకాశం లభించలేదు. జస్ట్ సింగిల్ ఎమోషన్ క్యారీ అవుతుంది. అందులో ఆమె బాగా చేశారు. నైనా గంగూలీ రెండు మూడు సన్నివేశాల్లో కనిపిస్తారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదు. ఇషాన్, ఆమని, సూర్య, కస్తూరి తదితరులు సన్నివేశాల పరిధి మేరకు నటించారు. సీజన్ 2లో కొత్తగా కనిపించిన పాత్రలు అంటే రవి వర్మ, 'బిగ్ బాస్' దివి. కనిపించింది కాసేపే అయినప్పటికీ... రవి వర్మ చక్కగా చేశారు. కూరలో కరివేపాకు తరహాలో 'బిగ్ బాస్' దివి పాత్ర ఉంది.
Also Read : 'మా నీళ్ల ట్యాంక్' రివ్యూ: సుశాంత్, ప్రియా ఆనంద్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'పరంపర' నచ్చిన వాళ్ళకు, ఆ సీజన్ చూసిన వాళ్ళకు 'పరంపర 2' నచ్చుతుంది. ఫస్ట్ సీజన్ కంటే రెండో సీజన్ బావుందని అనిపిస్తుంది. డైరెక్టుగా రెండో సీజన్ చూసిన వాళ్ళకు ఓకే అనిపిస్తుంది. రొటీన్ కథ అయినప్పటికీ... కొన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్, డ్రామా ఉన్నాయి. ఖాళీగా ఉంటే... వీకెండ్ టైమ్‌పాస్ కోసం ఒకసారి చూడొచ్చు.
Parampara Season 3 Web Series : ఇప్పటివరకూ వచ్చిన రెండు సీజన్స్ కంటే... మూడో సీజన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని ఎండింగ్ చూస్తే తెలుస్తుంది. మూడో సీజన్ లీడ్ కూడా ఐదో ఎపిసోడ్ చివర ఇచ్చేశారు.
Also Read : 'గార్గి' రివ్యూ: ఎవరూ ఊహించని క్లైమాక్స్ - సాయి పల్లవి కొత్త సినిమా ఎలా ఉందంటే?