Tollywood : కొత్త సినిమాల నిర్మాణం ఆపే ఉద్దేశం లేదని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ తో సమావేశమై చర్చిస్తామని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాతలు అందరం కూర్చొని సమస్యలపై చర్చించామని సి.కల్యాణ్ అన్నారు. ప్రేక్షకులకు అందుబాటులో టికెట్ రెట్లు, కంటెంట్, ఓటీటీపై చర్చించామన్నారు. షూటింగ్ లు బంద్ చేద్దామా లేక కొత్తవి మొదలు పెట్టకుండా జరుగుతున్న సినిమాల వరకు మాత్రమే షూటింగ్ లు జరపాలా అని విషయం ఫిల్మ్ ఛాంబర్ తో డిస్కస్ చేస్తామన్నారు. 23న జరిగే మీటింగ్ లో అందరితో చర్చించి ఫిల్మ్ ఛాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని సి.కల్యాణ్ తెలిపారు. పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్ సమస్యలు, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్ ల పాత్ర, నటులు, టెక్నీషియన్ల సమస్యలపై సమావేశంలో చర్చిస్తామన్నారు.
23న తుది నిర్ణయం
'సినిమాల కంటెంట్, ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు, ఓటీటీలపై చర్చించాం. యూనియన్‌లు, ఫెడరేషన్, మేనేజర్‌ల పాత్ర, నటులు, సాంకేతిక నిపుణుల సమస్యలపై చర్చించాం. షూటింగ్‌లు నిలిపివేయాలా? వద్దా? కొత్త ప్రాజెక్టులు కాకుండా ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న వాటినే నిలిపివేయాలా? అనే అంశాలపై చర్చించాం. 23న జరిగే మీటింగ్‌లో తుది నిర్ణయం ఉంటుంది'.- సి.కల్యాణ్, సినీ నిర్మాత
ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, అభిషేక్ నామా, వైవీఎస్ చౌదరి, సునీల్ నారంగ్, టాగూర్ మధు, సుధాకర్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్, తమ్మారెడ్డి భరద్వాజ, అశోక్ కుమార్, చిట్టురీ శ్రీనివాస్, బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.
చర్చ జరిగింది నిజమే
టాలీవుడ్ నిర్మాతలు షూటింగ్ లు బంద్ చేయాలనుకుంటున్నారని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. నిర్మాతలంతా కలిసి మాట్లాడుకున్న విషయం నిజమేనని.. అయితే బంద్ గురించి ఇంకా ఏం అనుకోలేదని చెప్పారు. మీడియాలో మాత్రం డేట్ తో సహా బంద్ గురించి వార్తలొస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలనే చర్చ మాత్రమే సాగుతుందన్నారు. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిర్మాతలంతా ఒకే తాటిపైకి వస్తారని స్పష్టం చేశారు. ఇది నిర్మాతల సమస్య కాదని ఇండస్ట్రీ సమస్య అని చెప్పారు. నిర్మాత నష్టపోతే అందరి జీవితాలు నష్టాల్లో పడతాయని నిర్మాతల బాధలను హీరోలు, టెక్నీషియన్స్ అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. ఒక సినిమా ఆపాలంటే, నిర్మాత హీరోలతో, దర్శకులతో మాట్లాడాలని.. దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు