సినిమా రివ్యూ: షంషేరా
రేటింగ్: 1.5/5
నటీనటులు: రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్, సంజయ్ దత్, రోనిత్ రాయ్ కపూర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
సంగీతం: మిథున్
నిర్మాణ సంస్థ: యష్‌రాజ్ ఫిల్మ్స్
దర్శకత్వం: కరణ్ మల్హోత్రా
విడుదల తేదీ: జూలై 22, 2022


రణ్‌బీర్ కపూర్, వాణి కపూర్ జంటగా నటించిన షంషేరా సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. 2018లో వచ్చిన సంజు తర్వాత రణ్‌బీర్ కపూర్ సినిమా మరొకటి విడుదల కాలేదు. నాలుగేళ్ల నుంచి రణ్‌బీర్ కపూర్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు ఈ సినిమా ట్రైలర్ మంచి పీరియాడిక్ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించింది. మొదటిసారి రణ్‌బీర్ కపూర్ డబుల్ రోల్ చయడం, కేజీయఫ్ 2 తర్వాత సంజయ్ దత్ విలన్ రోల్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేశారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా?


కథ: మొఘల్‌ల పాలనలో రాజ్‌పుత్‌ల తరఫున పోరాడిన ఒక తెగ వారు మొఘల్‌లు గెలవడంతో వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్న జాట్‌లు వీరిని తక్కువ కులం వారని బానిసలుగా చూస్తారు. ఇదే తెగకు చెందిన షంషేరా (రణ్‌బీర్ కపూర్) బందిపోటుగా ధనికులను దోచుకుంటూనే, వారి స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటాడు. శుద్ధ్ సింగ్ (సంజయ్ దత్) వీరికి స్వాతంత్రం కల్పిస్తామని మోసం చేసి ఒక కోటలో బంధించి మరింత దారుణంగా హింసిస్తాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన షంషేరాపై ద్రోహి అనే ముద్ర వేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. 25 సంవత్సరాల తర్వాత అతని కొడుకు బల్లి (రణ్‌బీర్ కపూర్) నిజం తెలుసుకుని తండ్రి చావుకు పగ తీర్చుకోవాలని, తన వారికి స్వాతంత్రం కల్పించాలని పోరాడతాడు. మరి బల్లి తన లక్ష్యాన్ని సాధించాడా? ఈ దారిలో తనేం కోల్పోయాడు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: తండ్రి చావుకు కొడుకు పగతీర్చుకునే కథలు మనకు కొత్తేమీ కాదు. దాదాపు 1960ల నుంచి మనం ఇటువంటి కథలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి కథను ఎంత ఆకట్టుకునే విధంగా చెప్పాం అనే అంశంపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా ప్రారంభంలో షంషేరా చనిపోయే సీన్, క్లైమ్యాక్స్‌లో శుద్ధ్ సింగ్ చనిపోయే సీన్లు చూశాక 10 సంవత్సరాల క్రితం విడుదలైన అగ్నిపథ్ గుర్తొస్తే అది మన తప్పు కాదు. అగ్నిపథ్ మూల కథను తీసుకుని షంషేరాగా మార్చినట్లు ఈజీగా తెలిసిపోతుంది.


కమర్షియల్ సినిమాల్లో క్లైమ్యాక్స్‌ను ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ ఇందులో మాత్రం తర్వాతి సీన్‌లో ఏం జరుగుతుందో కూడా చాలా సులభంగా గెస్ చేయవచ్చు. అంత ఫ్లాట్‌గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. బల్లి పాత్రను అంత తెలివి గల పాత్రగా పరిచయం చేసినా, తన ఇంటెలిజెన్స్ ఉపయోగించే అవకాశం ఎక్కడా దర్శకుడు ఇవ్వలేదు. హీరో ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి కాపాడటం తప్ప తనంతట తానుగా హీరో ఏమీ చేయలేదు. ఇది సినిమాకు పెద్ద మైనస్. అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా పండాయి. యాక్షన్ సీన్లు మాత్రం సో సో గానే ఉన్నాయి. బానిసలను ట్రీట్ చేసే విధానం చూస్తే కేజీయఫ్ గుర్తొస్తుంది.


ఇక సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాలో ఒక్క పాట కూడా వినదగ్గది కాదు. దీంతోపాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ నాచ్. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఇక నటీనటుల విషయానికి వస్తే... రణ్‌బీర్ కపూర్‌కు ఈ తరహా పాత్రలు కొత్త. కానీ రెండు పాత్రలకూ పూర్తిగా న్యాయం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన సినిమాకు పెద్ద ప్లస్ అయింది. సంజయ్ దత్‌కు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. తన పాత్రకు న్యాయం చేశాడు. వాణీ కపూర్ తన కెరీర్‌లో మొదటిసారి డీగ్లామర్ రోల్ చేసింది. సెకండాఫ్ అంతా తను డీగ్లామర్‌గానే కనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు.


Also Read : 'గార్గి' రివ్యూ: ఎవరూ ఊహించని క్లైమాక్స్ - సాయి పల్లవి కొత్త సినిమా ఎలా ఉందంటే?


ఓవరాల్‌గా చెప్పాలంటే... థియేటర్‌కు వెళ్లి ఈ షంషేరాను భరించడం కంటే ఇంట్లో కూర్చోవడం ఉత్తమం. టైమ్‌పాస్‌కు ఏదైనా కచ్చితంగా సినిమాకు వెళ్లాలనుకుంటే మాత్రం టికెట్ రేట్లు కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి ఒకసారి సాహసం చేయవచ్చు.


Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?