చెప్పులు, కాలి కింద వేసుకునే పట్టలు(Doormats) మీద గతంలో జాతీయ జెండా ముద్రించి వివాదంలో చిక్కుకుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్. తాజాగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరో సారి వివాదంలో చిక్కుకున్నాయి. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫోటోని ఓ టీ షర్ట్ పై ముద్రించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బాయ్ కాట్ ఫ్లిప్ కార్ట్, బాయ్ కాట్ అమెజాన్ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నాయి. 


అసలేం జరిగిందంటే.. 


ఫ్లిప్ కార్ట్ ఒక వైట్ టీషర్ట్ మిద్ద సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫోటో ముద్రించి దాని కింద "డిప్రెషన్ ఈజ్ లైక్ డ్రోనింగ్(Depression is like drowning)" అని రాశారు. అది చూసి సుశాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం కోసం ఎటువంటి పనులు చెయ్యడానికైనా మీరు సిద్ధపడతారా అని ఇంతగా దిగజారతారా అని ట్వీట్స్ పెడుతున్నారు. మీ ప్రొడక్ట్ ప్రచారం కోసం ఒక చనిపోయిన వ్యక్తిని ఉపయోగించుకుంటారా. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫీలింగ్స్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా, దీనికి మీరు అనుభవిస్తారు' అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. సుశాంత్ చనిపోయిన షాక్ నుంచి ఇంకా తెరుకోలేదు అటువంటి సమయంలో మీరు ఇలాంటి హేయమైన చార్యకి పాల్పడతారా.. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే' అని మరో నెటిజన్ ట్వీట్ చేసింది. వెంటనే ఈ టీ షర్ట్ అమ్మకాలు నిలిపి వేయడమే కాకుండా సైట్ నుంచి వీటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాయ్ కాట్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ అని హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. దీనిపై ఈ కామర్స్ సంస్థలు ఇంక స్పందించలేదు. 


ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 2020 లో తన అపార్ట్ మెంట్ లో విగత జీవిగా కనిపించారు. డిప్రెషన్ వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసును ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ లో ధోని పాత్రలో సుశాంత్ నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు.