వీక్‌ పాయింట్‌ మీద దెబ్బకొడితే చాలు ఎంతటి బలవంతుడైనా చిత్తు అయిపోతాడు. ఆ లాజిక్‌ తోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ని దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా మొదటి ప్లాన్‌ ని ఆ జిల్లా నుంచే ప్రారంభిస్తోంది. ఇంతకీ టీఆర్‌ఎస్‌ కి చెక్‌ పెట్టబోయే బీజేపీ వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిన ఆ జిల్లా ఏంటి?


పాలమూరు జిల్లా తెలంగాణలో రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా ఇదే. తెలంగాణ తెచ్చే సమయంలో కేసీఆర్‌ ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించారు. అలా రాజకీయంగా, చారిత్రాత్మకంగా పేరున్న ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ కి మంచి పట్టు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో పార్టీ ఇక్కడ ఇబ్బందులను ఎదుర్కోంటోంది.


కారులో కిరి కిరి, కార్యకర్తల పరేషాన్


14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలను కలిగిన ఉమ్మడి  పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మంచి పట్టే ఉంది. 2018లో జరిగిన రెండోసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో కారుకి కుదుపులు మొదలయ్యాయి. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, హర్షవర్దన్, జూపల్లి వంటి నేతలతో ఇతర టీఆర్‌ఎస్‌ నేతలకు పడటం లేదు. ఇక కొల్లాపూర్ లో సీన్ సితారమే అయ్యింది. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన హర్షవర్దన్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి జూపల్లికి  మద్య జరిగిన పంచాయితీ అంతా ఇంతకాదు. నానా యాగి అయ్యింది.


తాజాగా ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుని గొడవను అంబేడ్కర్ చౌరస్తా వరకు లాక్కొచ్చారు. సింపుల్‌ గా చెప్పాలంటే వర్గ పోరు మొదలైంది. జిల్లా నేతల్లో మొదలైన ఈ విభేదాలు తారస్థాయికే చేరాయి. మంత్రి కేటీఆరే స్వయంగా రంగంలోకి దిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతకొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న జూపల్లితో కేటీఆర్‌ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారంటే జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అటు మంత్రి శ్రీనివాస్‌ పై భూ కబ్జా ఆరోపణలు చేసింది కూడా గులాబీ నేతే కావడంతో విపక్షాలకు ముఖ్యంగా బీజేపీకి మంచి అవకాశంగా మారింది. దక్షిణ తెలంగాణలో బీజేపీ అంత పట్టులేదని ఆ పార్టీ నేతలు అంటుంటారు. ఖమ్మం, నల్గొండ లో వెనకబడి ఉన్ననప్పటికీ ఉమ్మడి మహబూబ్ నగర్ లో కారులో కిరికిరిలు తమకు కలిసొస్తాయని భావిస్తున్నారు. ఇటు పార్టీ నేతల్లోని విభేదాలతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాలమూరులో ఇదివరకటిలా గులాబీకి పట్టులేదన్నవాదన ఉంది. ఈ మైనస్ లనే తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది బీజేపీ. అందుకే కారు వదిలేసి వచ్చిన ఈటల రాజేందర్‌ కి జిల్లా బాధ్యతలను అప్పజెప్పిందని టాక్‌.


హామీల వైఫల్యాలే ప్రధాన ప్రచార అస్త్రం
పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్.. ప్రధాన ప్రచార అస్త్రం. కుర్చి ఏసుకొని కూర్చుంటా... పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకు అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని పదే పదే బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పాలమూరు అభివృద్ధికి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరకపోవడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే. అందుకే వీటన్నింటిపైనా దృష్టి పెట్టింది కమలం. ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్‌ అమలు చేయని హామీలు, టీఆర్‌ఎస్‌ నేతల అవినీతి వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈటలతో పాటు కొందరు బీజేపీ నేతలు  జిల్లాలో పాదయాత్రలు చేయాలని డిసైడ్‌ అయ్యారు. అయితే పాదయాత్రల వల్లే గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు..అలాగే జగన్ ముఖ్యమంత్రులయ్యారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసిఆర్ బీజేపీ పాదయాత్రలపై చేసిన కామెంట్లు సరికాదని సూచిస్తున్నారు. ఈ విధంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా టీఆర్‌ఎస్‌ని దెబ్బతీయడమే కాకుండా రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని బలమైన పార్టీగా తెలంగాణలో కమలాన్ని నిలబెట్టాలన్నది పార్టీ ఆలోచనగా రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


హస్తం కాస్తో కూస్తో..


సందెట్లో సడేమియాలాగా అటు కాంగ్రెస్ కూడా పాలమూరుపై పట్టుసాధించాలని చూస్తోంది. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కాబట్టి అక్కడ నుంచి కారు లుకలుకలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. అవసరమైతే జూపల్లిని బుజ్జగించి పాత ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నమూ హస్తం నేతలు చేస్తున్నారు.