చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి క్యాసినో కేసులో ఈడీ కీలక ఆధారాలు సంపాదించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ప్రముఖులు అతనితో టచ్ లో ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మాధవరెడ్డి వాడుతున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ స్టిక్కర్ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినది అని గుర్తించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టిక్కర్ తో ఉన్న కారును మహేందర్ రెడ్డి అనే వ్యక్తి వాడుతున్నట్లుగా గుర్తించారు. అయితే, కారు నెంబరులో కూడా ఓ ట్విస్ట్ ఉండడాన్ని గుర్తించారు. కారు నెంబర్ TS10ET 0444 కాగా 0 లేకుండా కేవలం 444ను రాసుకుని తిరుగుతున్నారు. చీకోటి ప్రవీణ్ ఇంట్లో 14 గంటలకు పైగా ఈడీ సోదాలు కొనసాగాయి. చీకోటి ప్రవీణ్, సతీమణి, ఆయన కొడుకును కూడా దీనిపై విచారణ చేశారు. 


విదేశాల్లో క్యాసినో
క్యాసినో వ్యవహారంలో బోయిన్‌పల్లి లో మాధవ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు బుధవారం రాత్రి ముగిశాయి. దాదాపు 16 గంటలపాటు క్యాసినో వ్యవహారంలో అన్ని కోణాలలో ఈడీ అధికారులు విచారణ చేశారు. దాసరి మాధవ రెడ్డి ఇంటి నుండి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నేపాల్, ఉత్తర ప్రదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా ప్రాంతాలలో క్యాసినో నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. హైదరాబాద్ గుంటూరు విజయవాడకు చెందిన వ్యక్తులను క్యాసినో ఆడేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించడం, క్యాసినో నిర్వహణ వ్యవహారంలో కీలక ఏజెంట్లుగా దాసరి మాధవరెడ్డి, చీకోటి ప్రవీణ్ వ్యవహరించారని చెప్పారు.


చీకోటి ప్రవీణ్ సైదాబాద్ లోని వినయ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నగర శివార్లలోని ఫార్మ్ హౌస్ లో ప్రముఖులతో పేకాట శిబిరాలు నిర్వహిస్తారని అధికారులు గుర్తించారు. చీకోటి నిర్వహించే పేకాటలో టేబుల్ ప్రారంభమే 25 లక్షలతో ఉంటుందని సమాచారం. అంతేకాక, గోవా, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, బ్యాంకాక్ లలో కూడా చీకోటి క్యాసినో నిర్వహిస్తున్నారు.


బిగ్ డ్యాడీ క్యాసినోతో పార్టనర్ షిప్?
గోవాలోని "బిగ్ డ్యాడీ" క్యాసినోలో చీకోటి పార్టనర్ అని సమాచారం. ‘బిగ్ డ్యాడీ’ క్యాసినో గోవాలో ఫేమస్. ఇది షిప్‌లో నిర్వహించే క్యాసినో. గతంలో నేపాల్ లో నిర్వహించిన క్యాసినోకు తెలంగాణ, ఆంధ్రాకు చెందిన ప్రముఖులను స్పెషల్ ఫ్లైట్ లో తీసికెళ్ళి క్యాసినో ఆడించినట్టు ఈడీ వద్ద సమాచారం ఉంది. నెల రోజుల క్రితం చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా చీకోటి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు, జైళ్ల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరు అయినట్లు సమాచారం.


ఈ తారలు హాజరైనట్లు గుర్తించిన ఈడీ
ఈడీ అధికారులు సేకరించిన వివరాల మేరకు.. 10 మంది సినీ తారలను చికోటి నేపాల్‌కు రప్పించారు. క్యాసినోకు ముందు సినీ తారలతో చీకోటి ప్రమోషన్ వీడియోలు కూడా చేయించారు. నేపాల్‌లో జరిగిన క్యాసినోకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ కూడా ఉన్నారు. అమేషా పటేల్, మేఘన నాయుడు, విల్సన్, గోవింద, ముమైత్‌ఖాన్, మల్లికాషెరావత్, సింగర్ జాన్సీరాజు సహా మొత్తం 10 మంది సినీ తారలు హాజరైనట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ సినీ తారల పేమెంట్స్ పైన ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.