సినిమా రివ్యూ : ది ఫ్లాష్
రేటింగ్ : 3/5
నటీనటులు : ఎజ్రా మిల్లర్, సాషా కాల్, మైకేల్ షానన్, రోన్ లివింగ్‌స్టోన్, మైకేల్ కీటన్, బెన్ ఆఫ్లెక్ తదితరులు  
ఛాయాగ్రహణం : హెన్రీ బ్రాహామ్
సంగీతం : బెంజమిన్ వాల్‌ఫిష్
నిర్మాణ సంస్థ : డీసీ స్టూడియోస్
రచన : క్రిస్టినా హడ్సన్
దర్శకత్వం : ఆండీ ముషియెట్టి
విడుదల తేదీ : జూన్ 16, 2023


డీసీ స్టూడియోస్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ది ఫ్లాష్’. ఈ సినిమా ప్రస్తుతం ఉన్న యూనివర్స్‌ను రీసెట్ చేయనుంది. అంటే ‘డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ (DCEU)’ లో ఇదే ఆఖరి సినిమా. 2023 ఆగస్టు నుంచి రానున్న ‘బ్లూ బీటిల్ (Blue Beetle)’తో ‘డీసీ యూనివర్స్ (DCU)’ అనే కొత్త యూనివర్స్‌ను డీసీ ప్రారంభించనుంది. ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను రీసెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని కన్విన్సింగ్‌గా చూపించేందుకు ఇద్దరు బ్యాట్‌మ్యాన్‌లు, ఇద్దరు ఫ్లాష్‌లు, సూపర్ గర్ల్, ఇంకా మరెందరో సూపర్ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్ కూడా మంచి యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేయడంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇంతకీ సినిమా ఎలా ఉంది?


కథ (The Flash Story): బ్యారీ ఆలెన్ / ది ఫ్లాష్ (ఎజ్రా మిల్లర్) క్రిమినల్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూనే సూపర్ హీరోగా ప్రజలను కాపాడుతూ ఉంటాడు. బ్యారీ తల్లి హత్య కేసులో అతని తండ్రికి అకారణంగా శిక్ష పడే పరిస్థితి వస్తుంది. దీంతో తనకు ఉన్న శక్తులను ఉపయోగించి టైమ్ ట్రావెల్ ద్వారా తన తల్లిని చనిపోకుండా కాపాడాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని బ్యాట్‌మ్యాన్/బ్రూస్ వెయిన్ (బెన్ ఆఫ్లెక్)కి చెప్తే తను వారిస్తాడు. గతాన్ని మార్చడం భవిష్యత్తును అతలాకుతలం చేస్తుందని హెచ్చరిస్తాడు. కానీ వినకుండా బ్యారీ టైమ్ ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లి తల్లిని కాపాడతాడు. తిరిగి తన కాలానికి వచ్చేటప్పుడు మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అడ్డుకోవడంతో 2013 సంవత్సరంలో స్టక్ అయిపోతాడు. అయితే తను వచ్చింది తన ప్రపంచానికి కాదని, మల్టీవర్స్‌లో ఉన్న మరో భూగ్రహం మీదకి వచ్చాడని తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు తిరిగి వచ్చేటప్పుడు బ్యారీని అడ్డుకున్నది ఎవరు? చివరికి ఏం అయింది? అనేది తెలియాలంటే ‘ది ఫ్లాష్’ చూడాల్సిందే.


విశ్లేషణ (The Flash Review): ‘టైమ్‌ని సరిగ్గా వాడుకోవాలి కానీ, దాంతో అస్సలు ఆడుకోకూడదు.’ ఓవరాల్‌గా ది ఫ్లాష్ కథ ఇదే. కానీ దీన్ని బోలెడన్ని సూపర్ హీరో క్యామియోలతో చాలా ఎంటర్‌టైనింగ్‌గా, అర్థం అయ్యేలా,  కన్ఫ్యూజన్ లేకుండా చెప్పారు. బ్యారీ ఆలెన్, బ్రూస్ వెయిన్, డయానా (వండర్ వుమన్) కలిసి కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్‌తో గోథం సిటీని కాపాడటంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. బ్యారీ తన తండ్రిని కాపాడుకోలేని పరిస్థితిలో పడటం, దీంతో టైమ్ ట్రావెల్ చేయాలని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు కాస్త టైం తీసుకుంటాయి. కానీ మరో ప్రపంచంలో బ్యారీ... మైకేల్ కీటన్ బ్యాట్‌మ్యాన్‌ని కలిసిన దగ్గరి నుంచి కథ పరుగులు పెడుతుంది. బోలెడన్ని ట్విస్టులు, టర్నులు, ఫ్యాన్స్ కోసం మ్యాజికల్ గెస్ట్ రోల్స్ ఉంటాయి. ‘జస్టిస్ లీగ్’లో కంటే ఎక్కువ మంది సూపర్ హీరోలను ఇందులో చూడవచ్చు.


కామిక్స్ పరంగా ఎంత పోటీ ఉన్నప్పటికీ, సినిమాల పరంగా డీసీ కంటే మార్వెల్ చాలా ముందుంది. ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా మారడానికి డీసీ పాట్లు పడుతున్న సమయానికే, అవెంజర్స్‌తో మార్వెల్ ఎన్నో మైళ్లు ముందుకెళ్లింది. కానీ గతంలో జరిగిన తప్పులను డీసీ తెలుసుకుందని ‘ది ఫ్లాష్’ చూస్తే అర్థం అవుతుంది. ఇంత కాలం డార్క్‌గా కేవలం ఒక వర్గానికి మాత్రమే నచ్చే విధంగా (షాజామ్, ఆక్వామ్యాన్ మినహా) సినిమాలు తీస్తారనే అపవాదును డీసీ మెల్లగా తొలగించుకుంటుంది.


‘టైమ్ ట్రావెల్, మల్టీపుల్ యూనివర్స్’ ఇలాంటి కాన్సెప్ట్‌లను ఒకే సినిమాలో ఇమడ్చటంతో పాటు వాటిని అర్థం అయ్యేలా చెప్పింది. మైకేల్ కీటన్ బ్యాట్‌మ్యాన్ మల్టీవర్స్‌ని వివరించే విధానం నవ్వించినా త్వరగా అర్థం అవుతుంది. ఇక కథతో పాటు కళ్లు చెదిరే యాక్షన్ సీన్లు కూడా ఇందులో చూడవచ్చు. దాదాపు అరగంటకు పైగా ఉండే క్లైమ్యాక్స్ యాక్షన్ సీన్‌ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కీలకమైన ట్విస్టులు, క్యామియోలు అన్నీ అందులోనే రివీల్ చేశారు. అలాగే ఫ్లాష్, తన తల్లికి మధ్యలో వచ్చే సన్నివేశాల్లో సెంటిమెంట్ కూడా బాగా వర్కవుట్ అయింది.


ఇక నుంచి కొత్త డీసీ యూనివర్స్‌ని బిల్డ్ చేయడానికి కావాల్సిన సరుకు అంతా ఇందులో నింపారు. కాబట్టి ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకోవాలి. సినిమా మొత్తం అయిపోయాక ఆఖర్లో వచ్చే సర్‌ప్రైజ్ ట్విస్ట్ తర్వాతి భాగంపై ఆసక్తిని ఒక్కసారిగా పెంచుతుంది.


టెక్నికల్‌గా కూడా ‘ది ఫ్లాష్’లో పెద్దగా వంక పెట్టడానికి లేదు. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. బెంజమిన్ వాల్‌ఫిష్ అందించిన సౌండ్ ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. సినిమా నిడివి రెండున్నర గంటలుగా ఉంది. సినిమా ప్రారంభంలో కథలోకి వెళ్లడానికి కొంచెం సమయం తీసుకుంటారు తప్ప ఇంక ఎక్కడా ల్యాగ్ అని కూడా అనిపించదు.


 ఇక నటీనటుల విషయానికి వస్తే... ఫ్లాష్ పాత్రలో ఎజ్రా మిల్లర్ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ‘జస్టిస్ లీగ్’లో కూడా ఎజ్రా ఫ్లాష్ పాత్రను చేసి మెప్పించాడు. కానీ ఇందులో డ్యూయల్ రోల్‌తో ఆకట్టుకుంటాడు. రెండు ఫ్లాష్ పాత్రలకు రెండేసి రకాల షేడ్స్ ఉండటంతో పాటు వాటిని చక్కగా పండించాడు కూడా. క్రిప్టోనియర్ కారా ఎల్ జోల్ పాత్రలో సాషా కాల్, బ్యాట్‌మ్యాన్‌ల పాత్రలో బెన్ ఆఫ్లెక్, మైకేల్ కీటన్ బాగా నటించారు.


Also Read : విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?


ఓవరాల్‌గా చెప్పాలంటే... ఒక సూపర్ హీరో సినిమాలో ఆ హీరోని మించిన కథ ఉండి, దాన్ని ఆకట్టుకునేలా చెప్తే విజయం తథ్యం అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. సూపర్ హీరో సినిమాలు, హాలీవుడ్ యాక్షన్ సినిమాలు చూసేవారికి ‘ది ఫ్లాష్’ మస్ట్ వాచ్. 


Also Read 'సైతాన్' రివ్యూ : బోల్డ్ సీన్స్, బ్రూటల్ కిల్లింగ్స్ - హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?