సినిమా రివ్యూ : విమానం
రేటింగ్ : 2.5/5
నటీనటులు : స‌ముద్రఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు
మాటలు : హను రావురి
ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు
పాటలు, సంగీతం : చరణ్ అర్జున్
నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
రచన, దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల
విడుదల తేదీ: జూన్ 9, 2023


ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా 'విమానం' (Vimanam 2023 movie). ఇందులో సముద్రఖని వికలాంగునిగా, ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించారు. అనసూయ వేశ్య పాత్ర పోషించారు. కొంత విరామం తర్వాత  మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  రాహుల్ రామకృష్ణ, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉంది (Vimanam Movie Review)?


కథ (Vimanam Movie Story) : వీరయ్య (సముద్రఖని) వికలాంగుడు. కుమారుడు రాజు ('మాస్టర్' ధ్రువన్)కు జన్మనిచ్చిన తర్వాత భార్య మరణిస్తుంది. వారసత్వంగా వచ్చిన సులభ్ కాంప్లెక్స్ అతని జీవనాధారం. అబ్బాయే అతని జీవితం. రాజుకు విమానం ఎక్కాలని కోరిక. ఫ్లైట్ అంటే పిచ్చి. ఎప్పుడూ విమానం గోలే. అబ్బాయికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) ఉందని తెలియడంతో ఎలాగైనా విమానం ఎక్కించాలని వీరయ్య నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరయ్య జీవితంలో బస్తీలో వేశ్య సుమతి (అనసూయ), చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ), ఆటో డ్రైవర్ డేనియల్ (ధనరాజ్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Vimanam 2023 Movie Review) : 'విమానం'లో మంచి కథ, అంతకు మించి కంటతడి పెట్టించే భావోద్వేగభరిత సన్నివేశాలు ఉన్నాయి. అయితే, ఆ కథను ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేసే కథనం కొరవడింది. సినిమాలో క్యారెక్టర్లు తక్కువ ఉన్నాయి. పరిమిత పాత్రలతో కథ ముందుకు నడిచేటప్పుడు సీన్లు ఎంత క్రిస్పీగా ఉంటే... స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్‌గా ఉంటే... ప్రేక్షకుడు అంతలా కనెక్ట్ అవుతాడు. కథలో లీనం అవుతాడు. లీనమయ్యేలా చక్కని కథనంతో సినిమాను నడిపించడంలో దర్శకుడు శివ ప్రసాద్ యానాల తడబడ్డారు.


'విమానం' ప్రారంభంలో తండ్రి కుమారుల మధ్య, వాళ్ళతో ఆ బస్తీ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు బావున్నాయి. అయితే, కథలో భాగంగా ముందుకు తీసుకువెళితే మరింత బావుండేది. అయితే... రాహుల్ రామకృష్ణ ఇంట్లో సీన్ అవాయిడ్ చేస్తే బావుండేది. ఎమోషనల్ కథలో పంటికింద రాయిలా ఆ సీన్ తగులుతుంది. స్కూల్ లో సన్నివేశాలు చిన్నారుల అమాయకత్వాన్ని చూపెడుతూ నవ్విస్తాయి. 


ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ ఎలా ఉంటుందనే ఐడియా ప్రేక్షకులకు వస్తుంది. అందువల్ల, కథనం పెద్దగా ఆసక్తి కలిగించదు. అయితే, ప్రేక్షకులు ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చారు. మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. తండ్రీ కుమారుల జర్నీ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. చరణ్ అర్జున్ స్వరాలు, సాహిత్యం... నిర్మాణ విలువలు బావున్నాయి.


నటీనటులు ఎలా చేశారు? : తండ్రి పాత్రకు సముద్రఖని న్యాయం చేశారు. మాస్టర్ ధ్రువన్ నటనలో అమాయకత్వం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. థియేటర్లలో ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అవుతారు. అయితే... థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు (ముఖ్యంగా మాస్ సెంటర్స్) గుర్తు చేసుకునే మరో నటి అనసూయ. వేశ్య పాత్ర సుమతికి అవసరమైన శృంగార రసాన్ని ఆవిడ పలికించారు. క్లైమాక్స్ ముందు ఎమోషనల్ సీన్ అంత కంటే బాగా చేశారు. రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తమ పాత్రల్లో ఈజీగా నటించారు. మీరా జాస్మిన్ నటించడం వల్ల ఎయిర్ హోస్టెస్ పాత్రకు హుందాతనం వచ్చింది. 


Also Read : 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'విమానం' టేకాఫ్ కావడానికి కొంత టైమ్ తీసుకుంది. ఇంటర్వెల్ వరకు రన్ వే మీద ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో కొన్ని సీన్లు అలరించినా ఎంత సేపటికీ కథ ముందుకు కదలదు. ఇంటర్వెల్ తర్వాత జర్నీ గాడిలో పడింది. విమానం పర్ఫెక్ట్‌గా ల్యాండింగ్ అయ్యింది. డోంట్ మిస్ ద ఎండింగ్! ముఖ్యంగా తల్లిదండ్రులకు క్లైమాక్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది.  చివరగా... ఇది హార్ట్ టచింగ్ 'విమానం'! 


PS : మీరు థియేటర్లలో లేదంటే ఓటీటీలో అయినా సరే సినిమా చూడాలనుకుంటే సోషల్ మీడియాలో స్పాయిలర్స్ చదవకండి. ఎండింగ్ పాయింట్ (ట్విస్ట్) తెలిస్తే... స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆ ఫీల్ ఉండదు. 


Also Read : 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?