సినిమా రివ్యూ : అహింస
రేటింగ్ : 2/5
నటీనటులు : అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
మాటలు : అనిల్ అచ్చుగట్ల
పాటలు : చంద్రబోస్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంగీతం : ఆర్పీ పట్నాయక్
నిర్మాత : పి. కిరణ్ (జెమినీ కిరణ్)  
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తేజ
విడుదల తేదీ: జూన్ 2, 2023


మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి కొత్త కథానాయకుడు తెలుగు చిత్రసీమకు వచ్చారు. నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ (Abhiram Daggubati)ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా 'అహింస'. ఈ సినిమా (Ahimsa Movie Review) ఎలా ఉంది?


కథ (Ahimsa Movie Story) : రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని యువకుడు. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి చచ్చేంత ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజు ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) కుమారులు ఇద్దరు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. మరదలిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడాలని రఘు కేసు పెడతాడు. అతనికి లాయర్ లక్ష్మీ (సదా) సహాయం చేస్తుంది. అయితే, ఆమె కుటుంబాన్ని ధనలక్ష్మి దుష్యంత రావు చంపేస్తాడు. అతడి అంగ బలం, అర్థ బలం ముందు కేసు నిలబడదని రఘుకి అర్థం అవుతుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? అహింసావాదం వదిలి హింస వైపు వచ్చాడా? లేదా? ధనలక్ష్మి దుష్యంత రావు కనపడకుండా పోవడానికి కారణం ఏమిటి? అభిరామ్ ప్రయాణంలో అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్ పాత్ర ఏమిటి? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (Ahimsa Movie Review) : దర్శకుడు తేజకి అడవులు, ఆవులు, మేకలు అంటే ఎందుకు అంత ప్రేమ? పతాక సన్నివేశాలకు వచ్చేసరికి హీరో హీరోయిన్లను ఎందుకు అడవుల్లోకి తీసుకు వెళతారు? అని ప్రేక్షకుడి సందేహం వస్తే తప్పు లేదు. ఎందుకంటే... సినిమా అలా ఉంది మరి! 'నువ్వు నేను', 'అహింస' కలిపి మల్టీవర్స్ ఏమైనా తేజ ప్లాన్ చేస్తున్నారా? అని సందేహం కూడా కలుగుతుంది.


ప్రతి దర్శకుడికి ఒక శైలి ఉంటుంది. తొలుత అది కొత్తగా ఉంటుంది. రాను రాను ప్రతి సినిమాను అదే శైలిలో తీస్తే చూసే ప్రేక్షకులకు మొనాటనీ వస్తుంది. తేజ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయన ఎంపిక చేసుకున్న కథలో విషయం ఉంది. అహింసావాది హింస వైపు వెళ్ళడం అనేది ఆసక్తి కలిగించే అంశమే. ఆ ఆసక్తి సినిమాలో లేదు. విశ్రాంతి వరకు సినిమా సోసోగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథలో వేగం పెరుగుతుందని ఆశిస్తే మరింత నీరసంగా ముందుకు వెళుతుంది.


'చిత్రం', 'నువ్వు నేను', 'జయం' తీసిన తేజ ఏమయ్యాడు? అని చాలా రోజులే క్రితమే ప్రేక్షకులకు సందేహం వచ్చింది. 'నేనే రాజు నేను మంత్రి'తో మళ్ళీ ఆయన ఫామ్ అందుకున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఆ తర్వాత 'సీత'తో ఫ్లాప్ అందుకున్నారు. 'అహింస' చూశాక మళ్ళీ తేజ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారు. ఇంటర్వెల్ తర్వాత ఐటమ్ సాంగ్ వస్తే తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు కొత్తగా తీసిన తేజ, ఎందుకీ కమర్షియల్ కొలతలతో ఎందుకు తీశారు? అనిపిస్తుంది. క్లైమాక్స్ త్వరగా వస్తే బావుంటుందని, త్వరగా కథను ముగిస్తే బావుంటుందని ఫీలయ్యే సినిమాల్లో ఇదొకటి. సినిమా లెంగ్త్ ఎక్కువ అయ్యిందంటే... క్లైమాక్స్ ఫైట్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇంకొంత సేపు సాగదీశారు. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 


కథ, కథనాలు ఎలా ఉన్నప్పటికీ... ఆర్పీ పట్నాయక్  సంగీతం పర్వాలేదు. పాటలు ఓకే. చంద్రబోస్ మంచి సాహిత్యం అందించారు. పాటల్లో భావం ఉంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సూపర్బ్. విజువల్స్ అన్నీ బావున్నాయి. ప్రొడ్యూసర్ ఖర్చుకు వెనుకాడలేదు. 


నటీనటులు ఎలా చేశారు? : అభిరామ్ తొలి చిత్రమిది. ఆయన నటనలో ఓనమాలు దిద్దుతూ ఉన్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆ విషయం తెలుస్తుంటుంది. దర్శకుడు తేజ కూడా ఆయనకు ఎక్కువ శ్రమ కల్పించలేదు. వీలైనంత వరకు హీరో మీద భారం పడకుండా సన్నివేశాలు రూపొందించారు. కొన్ని సన్నివేశాల్లో  అభిరామ్ తప్పకుండా నటించాల్సిన పరిస్థితి. తన శక్తి మేరకు అభిరామ్ నటించారు. ఆయన నటన గొప్పగా ఉందని చెప్పలేం. మొదటి సినిమాకు ఓకే.


హీరోయిన్ గీతికా తివారికి తెలుగులో తొలి చిత్రమిది. ఇంతకు ముందు తమిళ సినిమా 'లెజెండ్ శరవణన్'లో నటించారు. నటిగా ఆమె చక్కటి పెర్ఫార్మన్స్ చేశారు. కాస్త అందాల ప్రదర్శన కూడా చేశారు. మంచి కథలు, క్యారెక్టర్లు పడితే ఆమెకు భవిష్యత్ ఉంటుంది. లాయర్ లక్ష్మి పాత్రలో సదా ఓకే. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపించారు.


Also Read : నేను స్టూడెంట్ సర్ రివ్యూ: ఈ స్టూడెంట్‌ను థియేటర్లలో చూడవచ్చా? ఆకట్టుకున్నాడా?


చివరగా చెప్పేది ఏంటంటే? : సినిమా పేరు 'అహింస'. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు 'అ' ఒక్కటి మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకు మించి ఏం చెప్పలేం. అభిరామ్ దగ్గుబాటికి హిట్ డెబ్యూ అని చెప్పలేం. తేజ తీసిన ఫ్లాపుల్లో ఇదీ ఒకటిగా మిగులుతుంది. 


Also Read : 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?