సినిమా రివ్యూ : నేను స్టూడెంట్ సర్
రేటింగ్ : 2.25/5
నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
ఛాయాగ్రహణం : అనిత్ కుమార్
సంగీతం : మహతి స్వర సాగర్
నిర్మాత : నాంది సతీష్ వర్మ
రచన : కృష్ణ చైతన్య
దర్శకత్వం : రాకేష్ ఉప్పలపాటి
విడుదల తేదీ: జూన్ 2, 2023
Nenu Student Sir Movie Review: మొదటి సినిమా ‘స్వాతిముత్యం’తో మంచి పేరు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ గణేష్. అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో మాస్ బాట పట్టకుండా విభిన్న తరహా కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. టీజర్, ట్రైలర్లతోనే ‘నేను స్టూడెంట్ సర్’ మంచి థ్రిల్లర్ కథాంశంగా ఆకట్టుకుంది. ఒక సెల్ ఫోన్, దాని చుట్టూ తిరిగే క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా?
కథ: సుబ్బారావు (బెల్లంకొండ) కాలేజ్ స్టూడెంట్. ఐఫోన్ 12 అంటే పిచ్చి. తొమ్మిది నెలలు కష్టపడి రూ.90 వేలు సంపాదించి ఐఫోన్ 12 కొనుక్కుంటాడు. సరిగ్గా ఫోన్ కొన్న రోజునే కాలేజీలో గొడవ జరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పోలీసులు సుబ్బు ఫోన్ కలెక్ట్ చేసుకుంటారు. తన ఫోన్ కోసం తిరిగి వెళ్లినప్పుడు అక్కడ సుబ్బు ఫోన్ దొరకదు. దీంతో సుబ్బు ఈ విషయం మీద కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌కు (సముద్రఖని) కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్తాడు. అతను కూడా పట్టించుకోకపోవడంతో కమిషనర్ కూతురు శ్రుతి వాసుదేవన్‌తో (అవంతిక దాసాని) ఫ్రెండ్‌షిప్ చేసి ఫోన్ దక్కించుకోవాలి అనుకుంటాడు. ఫోన్ కోసం చేసిన ఫ్రెండ్‌షిప్ సుబ్బు మీద మర్డర్ కేస్ పడేలా ఎలా చేసింది? ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు? తన ఫోన్ దొరికిందా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాకు తీసుకున్న కాన్సెప్ట్‌నే మెయిన్ హైలెట్. ట్రైలర్‌లో చూపించినట్లు కేవలం పోగొట్టుకున్న ఐఫోన్ చుట్టూ మాత్రమే తిరిగే కథ కాదు ఇది. సమ్‌థింగ్ స్పెషల్ అనిపించే ఈ కాన్సెప్ట్‌ను ప్రమోషన్లలో ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే అక్కడి దాకా వెళ్లేందుకు సినిమాను బాగా సాగదీశారు. ముఖ్యంగా ప్రథమార్థంలో అయితే కథ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. సరిగ్గా ఇంటర్వల్ దగ్గర నుంచే కథ ప్రారంభం అవుతుంది.
ఫస్టాఫ్‌లో కనిపించిన ప్రతిసారీ బెల్లంకొండ గణేష్ చెప్పే ‘బ్లాక్ ఐఫోన్... 12 సిరీస్... 64 జీబీ... రూ.89,999’ అనే డైలాగ్, ఐఫోన్‌ను ‘తమ్ముడు బుజ్జిబాబు’ అని పిలవడం చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు ఐఫోన్ కోసం కమిషనర్‌కు ఎదురెళ్లడం, దాని కోసం ప్రాణాలకు కూడా తెగించడం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. ఫస్టాఫ్‌లో హీరోయిన్ టిక్‌టాక్ ట్రాక్, లవ్ స్టోరీ నడిపిన విధానం కథకు ఏమాత్రం సంబంధం లేనివి, అస్సలు ఆకట్టుకోవు కూడా. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కామెడీ సీన్లు ఏడిపించేలా, ఎమోషనల్ సీన్లు నవ్వు తెప్పించేలా ఉండటం ఇందులో స్పెషాలిటీ. ప్రేమించిన అబ్బాయి అడగ్గానే కమిషనర్ గన్‌ను ఆయన కూతురు తెచ్చి ఇచ్చేయడంతోనే చెప్పచ్చు హీరోయిన్ క్యారెక్టర్‌ను ఎంత వీక్‌గా రాశారో. ఫస్టాఫ్‌లో కథ కొంచెం కూడా ముందుకు కదలదు. ఇంటర్వల్ ట్విస్ట్‌తో స్క్రీన్‌ప్లేలో ఫస్ట్ గేర్ పడుతుంది.
సెకండాఫ్ కూడా కొంచెం స్లోగానే జరుగుతుంది. ఒక్కసారి సునీల్ ఎంట్రీ ఇచ్చాక స్టోరీ ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. అక్కడ నుంచి స్క్రీన్ ప్లే కొంచెం రేసీగా సాగుతుంది. కథలో ఉండే ట్విస్టులు మెల్లగా రివీల్ అవుతాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్‌కు చక్కటి స్క్రీన్‌ప్లే రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన పాటల్లో ‘మాయే మాయే’ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.
Also Read : '8 ఎఎం మెట్రో' రివ్యూ : 'మల్లేశం' దర్శకుడు తీసిన హిందీ సినిమా
ఇక నటీనటుల విషయానికి వస్తే... బెల్లంకొండ గణేష్ ఫస్టాఫ్‌లో అమాయకుడిగా, సెకండాఫ్‌లో ఇంటెలిజెంట్‌గా పర్వాలేదనిపిస్తాడు. రొటీన్ రొట్ట కథలు ఎంచుకోకుండా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ సాగుతున్నాడు. శ్రుతి వాసుదేవన్ పాత్రలో అవంతికా దాసాని జస్ట్ ఓకే. తన డైలాగ్స్‌కు లిప్ సింక్ లేకపోవడం పెద్ద మైనస్. కమిషనర్‌గా సముద్రఖని ఎప్పటిలానే నటించాడు. సునీల్ కాసేపు నవ్విస్తాడు. జబర్దస్త్ రాంప్రసాద్‌కు కొంచెం కొత్త తరహా పాత్ర లభించింది కానీ అందులో నటనకు ఏమాత్రం స్కోప్ లేదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... కథాంశం ఇంట్రస్టింగ్‌గా ఉన్నప్పటికీ ట్రీట్‌మెంట్ వల్ల ఈ ‘స్టూడెంట్’ దెబ్బ తిన్నాడు. కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అయితే కాదు.
Also Read : 'డెడ్ పిక్సెల్స్' రివ్యూ : మెగా డాటర్ నిహారిక వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?