సినిమా రివ్యూ : 8 ఎఎం మెట్రో (హిందీ)
రేటింగ్ : 3/5
నటీనటులు : గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పికా గణేష్, నిమిషా నాయర్, ఉమేష్ కామత్, '30 వెడ్స్ 21' ఫేమ్ మహేందర్, ధీర్ చరణ్ శ్రీవాత్సవ్ తదితరులు
మూలకథ : అందమైన జీవితం (మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన పుస్తకం)
మాటలు : ఆదిల్ హుస్సేన్
కవితలు : గుల్జార్
ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి
సంగీతం : మార్క్ కె. రాబిన్
నిర్మాతలు : రాజ్ రాచకొండ, కిశోర్ గంజి
దర్శకత్వం : రాజ్ రాచకొండ
విడుదల తేదీ: మే 19, 2023
'మల్లేశం'తో రాజ్ రాచకొండ (Raj Rachakonda) తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా, నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా తర్వాత రాజ్ రాచకొండ తీసిన సినిమా '8 ఎఎం మెట్రో' (8AM Metro Movie). మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవలను నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించారు.
'8 ఎఎం మెట్రో'లో గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah), తెలుగులో 'రేయ్', 'వైల్డ్ డాగ్' చిత్రాలు చేసిన సయామీ ఖేర్ ప్రధాన తారాగణం. మే 19న థియేటర్లలోకి వచ్చింది. తక్కువ స్క్రీన్లలో విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉంది? (8 am metro review)
కథ (8 am metro movie story) : ఇరావతి (సయామీ ఖేర్) కుటుంబం నాందేడ్‌లో ఉంటుంది. భర్త, ఇద్దరు పిల్లలు... హ్యాపీ ఫ్యామిలీ! హైదరాబాదులో ఉన్న చెల్లెలు నుంచి ఓ రోజు ఫోన్ వస్తుంది... బ్లీడింగ్ కావడంతో ఆస్పత్రిలో చేరానని, నాలుగు రోజుల క్రితం భర్త అమెరికా వెళ్లడంతో ఒంటరిగా ఉన్నానని, తోడుగా ఉండటానికి రమ్మని చెల్లెలు అడుగుతుంది. ట్రైనులో వెళ్ళడానికి ఇరావతి భయపడుతుంది. భర్త నచ్చజెప్పి ట్రైన్ ఎక్కిస్తాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి చెల్లెలు ఇంటికి మెట్రో ఎక్కాల్సి వస్తుంది. స్టేషనులో ఇరావతికి భయంతో చెమటలు పడతాయి. ఆమెకు ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) వాటర్ బాటిల్ అందిస్తాడు.
మెట్రోలో పరిచయమైన ఇరావతి, ప్రీతమ్ మధ్య స్నేహం బలపడుతుంది. చెల్లెలు కోసం ఇరావతి హైదరాబాదులో ఉన్నన్ని రోజులూ అతడిని కలుస్తుంది. ఫిల్టర్ కాఫీ తాగడం నుంచి పుస్తకాలు చదవడం, కొనడం వరకు... ఇరావతి కవితలను ప్రీతమ్ ప్రశంసించడం వరకు బోలెడు కబుర్లతో కాలక్షేపం చేస్తారు. వాళ్ళ పరిచయం ఏ తీరాలకు చేరింది? హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళేముందు ప్రీతమ్ గురించి ఇరావతి తెలుసుకున్న నిజం ఏమిటి? ప్రీతమ్ భార్య మృదుల (కల్పికా గణేష్) పాత్ర ఏమిటి? ట్రైన్ అంటే ఇరావతికి ఎందుకు అంత భయం? చివరకు ఆమె ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (8 AM Metro Telugu Review) : కొన్ని పరిచయాలు, బంధాలను మాటల్లో వర్ణించలేం! అటువంటి బంధాల్లో స్త్రీ పురుషుల స్నేహం ఒకటి! పెళ్లి కాని యువతీ యువకులు మాత్రమే కాదు... పెళ్ళైన స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉంటే వాళ్ళ మధ్య ఏదో ఉందనుకుని భ్రమించే వ్యక్తులు పూర్వకాలంలోనే కాదు, ఇప్పటి మన సమాజంలోనూ కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళ కళ్ళు తెరిపించే సినిమా '8 ఎఎం మెట్రో'. అలాగని, క్లాస్ పీకినట్టు ఉండే సినిమా అనుకుంటే పొరపాటే. చాలా సహజంగా ఇద్దరి మధ్య పరిచయాన్ని చూపించిన సినిమా.
'8 ఎఎం మెట్రో' చిత్రంలోని పాత్రల్లో జీవం ఉంది. సహజత్వం ఉంది. మనం రోజూ ప్రయాణించే దారిలో వ్యక్తులను చూసినట్టు ఉంటుంది. ఆ పాత్రల భావోద్వేగాలు, వాటి వెనుక నేపథ్యాలను రాజ్ రాచకొండ చెప్పిన తీరు బావుంది. కాస్త లోతుగా తొంగి చూస్తే... ఓ సందేశమూ ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు కావచ్చు, మరొకటి కావచ్చు... పని ఒత్తిడిలో పడి పెళ్ళానికి సరిగా సమయం కేటాయించలేని భర్తలు ఉంటారు. పిల్లల్లో టాలెంట్ గుర్తించలేని తండ్రులూ ఉంటారు. వాళ్ళందరికీ సుతిమెత్తగా సందేశం ఇచ్చే చిత్రమిది.
మనిషిలోని భావోద్వేగాల సంఘర్షణకు ప్రతిరూపమే '8 ఎఎం మెట్రో'. పెళ్ళై, ఇద్దరు పిల్లలకు జన్మ ఇచ్చిన తర్వాత బావతో కాకుండా పరాయి పురుషుడితో అక్క స్నేహాన్ని చెల్లెలు సహించలేదు. తన కవితలు చదివి ఒకరు ప్రశంసిస్తే చెల్లెలు వేరొక విధంగా భావించడాన్ని అక్క తట్టుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలను రాజ్ రాచకొండ హుందాగా తెరకెక్కించారు. బరువైన భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి. అయితే... ఎక్కడా హద్దులు మీరకుండా తీశారు.
స్నేహం, ప్రేమ పేరుతో కామాన్ని కోరుకునే కాలమిది. ఈ రోజుల్లో కాసుల కోసం కాకుండా సమాజానికి మంచి సినిమా అందించాలని రాజ్ రాచకొండ చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే... బిర్యానీ లాంటి మసాలా వంటలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఫిల్టర్ కాఫీ ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా సినిమా చాలా అంటే చాలా నిదానంగా సాగిన ఫీలింగ్ ఉంటుంది. అసలు కథలోకి వెళ్ళడానికి రాజ్ కొంత టైమ్ తీసుకున్నారు. ఆ తర్వాత నిదానంగా ముందుకు వెళ్ళారు. మధ్యలో కొన్నిచోట్ల నవ్వించాలని చేసిన ప్రయత్నం వర్కవుట్ కాలేదు. సినిమాలో కొన్ని క్యూట్, లిటిల్ మూమెంట్స్ బావున్నాయి. ఉదాహరణకు... తన పేరును సరిగ్గా పలికినప్పుడు సయామీ ఖేర్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్!
యువ తెలుగు సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ పాటలు బావున్నాయి. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. సరికొత్త ఫీల్ గుడ్ సౌండ్ ఇచ్చారు. గుల్జార్ సాబ్ కవితలకు పేరు పెట్టేది ఏముంటుంది? హైదరాబాద్ మెట్రో, ఛార్మినార్, దుర్గం చెరువు ప్రాంతాలను సినిమాటోగ్రాఫర్ సన్నీ కూరపాటి అందంగా ఆవిష్కరించారు. కథకు ఎంత కావాలో, అంత ఖర్చు చేశారు.
నటీనటులు ఎలా చేశారు? : ఎనిమిదేళ్ళ క్రితం 'రేయ్'లో, రెండేళ్ళ క్రితం 'వైల్డ్ డాగ్'లో చూసిన సయామీ ఖేర్ (Saiyami Kher)కి, '8 ఎఎం మెట్రో'లో సయామీకి సంబంధం లేదు. మధ్య తరగతి గృహిణి పాత్రలో జీవించారు. చీరల్లో అందంగా, అలాగే సహజంగా నటించారు. ప్రీతమ్ పాత్రలో గుల్షన్ దేవయ్య నటన బావుంది. మెట్రోలో అటువంటి కో పాసింజర్ పరిచయం అయితే బావుంటుందనేలా చేశారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కల్పికా గణేష్, బెంగాలీ వనిత మృదుల పాత్రలో మంచి నటన కనబరిచారు. ఆమె బొట్టు, నవ్వు అందాన్ని తీసుకొచ్చాయి. సయామీ చెల్లెలిగా రియా పాత్రలో నటించిన నిమిషా నాయర్ ఎమోషనల్ సీన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. పాపులర్ తెలుగు యూట్యూబ్ సిరీస్ '30 వెడ్స్ 21' ఫేమ్, నటుడు మహేందర్ ఓ పాత్రలో కనిపించారు.
Also Read : ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?
చివరగా చెప్పేది ఏంటంటే? : కమర్షియల్ హంగులకు కాస్త దూరంగా తెరకెక్కిన సినిమా '8 ఎఎం మెట్రో'. మంచి ఫిల్టర్ కాఫీ తాగిన అనుభూతి ఇస్తుంది. ఫీల్ గుడ్ ఫిలిమ్స్ చూడాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి ఆప్షన్ ఇది. అయితే, సినిమా చాలా స్లోగా ఉంటుంది. బట్, డోంట్ మిస్ ఇట్!
Also Read : తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?