ఇప్పుడు సినిమాకు హద్దులు, సరిహద్దులు లేవు. ముఖ్యంగా కరోనా తర్వాత అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. దర్శకుడిది తమిళా? తెలుగా? అని చూడటం లేదు. అందుకని, హీరోలతో పాటు దర్శకులు సైతం ఇతర భాషలకు చెందిన వాళ్ళతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 


తమిళ హీరో విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో 'దిల్' రాజు నిర్మించిన 'వారసుడు' అందరికీ లాభాలు అందించింది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరితో సితార, ఫార్చ్యూన్ సంస్థలు నిర్మించిన 'సార్' కూడా అంతే! ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి, నిర్మాణ సంస్థలు సినిమాలు చేస్తున్నారు. తమిళ హీరోలకు మన తెలుగు దర్శకులు విజయాలు అందిస్తుండగా... తెలుగు హీరోలకు తమిళ దర్శకులు భారీ డిజాస్టర్లు అందిస్తున్నారు.


తెలుగు హీరో, తమిళ దర్శకుడు కాంబినేషన్ కొత్తగా మొదలైంది ఏమీ కాదు. పవన్ కళ్యాణ్, ఎస్.జె. సూర్య 'ఖుషి'తో పాటు అంతకు ముందు నుంచి ఉన్నది. పవన్ 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్ అయితే తెలుగులోనే సినిమాలు చేశారు. ఇక, 'బొమ్మరిల్లు' భాస్కర్ అయితే తమిళంలో ఒక్కటంటే ఒక్క సినిమా చేశారంతే! గౌతమ్ మీనన్ అయితే నాగ చైతన్య (ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో), వెంకటేష్ (ఘర్షణ), నాని (ఎటో వెళ్ళిపోయింది మనసు)తో సినిమాలు చేశారు. ఆ కథలతో తమిళ హీరోలతో కోలీవుడ్ సినిమాలు చేశారనుకోండి! అయితే... ఇటీవల తెలుగు హీరోలు, తమిళ దర్శకులు కలిసి సినిమా సినిమాల్లో మెజారిటీ శాతం డిజాస్టర్లే ఉన్నాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాకుండా బైలింగ్వల్స్ ఏవీ హిట్ కాలేదు. 


'ఖుషి', 'ఏ మాయ చేసావె' వంటివి మినహాయిస్తే మిగతావన్నీ తెలుగు హీరోలతో తమిళ దర్శకులు చేసిన మ్యాగ్జిమమ్ సినిమాలు షెడ్డుకు వెళ్ళాయి. డిజాస్టర్ సినిమాలు అన్నీ గమనిస్తే... ఒక్క విషయం స్పష్టంగా కనబడుతోంది. తెలుగు హీరోను డమ్మీ చేసి... సీనియర్ లేదా యంగ్ తమిళ హీరోను సినిమాలో కీలక పాత్రకు తీసుకుని వాళ్ళను హైలైట్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఆ ట్రెండ్ నచ్చలేదు.


మహేష్ 'స్పైడర్' నుంచి...
నాగ చైతన్య 'కస్టడీ' వరకు!
తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్యతో మహేష్ బాబు 'నాని' చేశారు. తమిళంలో ఆ కథతో 'న్యూ' పేరుతో సినిమా తీశారు. అందులో ఎస్.జె. సూర్య హీరో. తమిళ రిజల్ట్ పక్కన పెడితే... తెలుగులో ఆ సినిమా ఫ్లాప్! అయినా సరే తమిళ దర్శకుడు మురుగదాస్ వస్తే... 'స్పైడర్' చేశారు మహేష్ బాబు! అందులో ఆయన క్యారెక్టర్ కంటే విలన్ రోల్ చేసిన ఎస్.జె. సూర్య క్యారెక్టర్ హైలైట్ అయ్యింది. ఆయన పాత్ర బావుందని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.


రీసెంట్ రిలీజ్ 'కస్టడీ' తీసుకోండి... అక్కినేని నాగ చైతన్య క్యారెక్టర్ కంటే అరవింద్ స్వామి క్యారెక్టర్ గురించి ఎక్కువ మంది ప్రేక్షకులు మాట్లాడారు. ఆయన పాత్రకు రాసిన డైలాగులు బావున్నాయని, ఆ క్యారెక్టరైజేషన్ బావుందని చెప్పుకొచ్చారు. దీని కంటే ముందు వచ్చిన రామ్ పోతినేని 'ది వారియర్'లో కూడా సేమ్ సిట్యువేషన్! పోలీస్ పాత్రలో రామ్ కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారు. అయితే, ఆది పినిశెట్టికి రాసిన డైలాగులు, సన్నివేశాలు హీరోతో పోటాపోటీగా ఉన్నాయి. 'నోటా'తో తమిళ తెరకు పరిచయమైన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు.


Also Read పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!


తమిళ హీరోలతో తెలుగు దర్శకులు తీసిన సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ చేసే విషయంలో రాజీ పడలేదు. విజయ్ కావచ్చు... ధనుష్ కావచ్చు... ఎవరైనా సరే వాళ్ళను ఓన్ చేసుకుని మరీ స్పెషల్ సీన్లు రాస్తున్నారు. కానీ, తమిళ దర్శకులు అలా చేయడం లేదు. తమిళ తెరకు మన హీరోలను తీసుకు వెళ్ళేటప్పుడు... హీరోయిజం తగ్గించి అండర్ ప్లే చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆ విషయం నచ్చడం లేదని చెప్పుకోవాలి. మన హీరోలను అలా చూడాలని అనుకోవడం లేదు. 'ది వారియర్' ఇంటర్వెల్ తర్వాత రామ్ హీరోయిజం సీన్లు ఉన్నాయి. అయితే, అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. 


తమిళ దర్శకులతో సినిమాలు చేసేటప్పుడు తెలుగు హీరోలు... తమ క్యారెక్టర్స్ ఎలివేషన్స్ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది. ఎస్.జె. సూర్య, అరవింద్ స్వామి, తెలుగు వాడైనా తమిళ సినిమాలతో ఎదిగిన ఆది పినిశెట్టిని ఇక్కడ తక్కువ చేయడం లేదు. కొత్తదనం కోసం ప్రయత్నించడంలోనూ తప్పు లేదు. అలాగని, మన హీరోల స్థాయిని తక్కువ చేయకూడదు కదా!


Also Read : గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?