ఇప్పుడు యూట్యూబ్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మేనియా కనబడుతోంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) గ్లింప్స్ టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. అయితే, అందులో మీరు ఓ విషయం గమనించారా? పవన్ కళ్యాణ్ జీప్ నంబర్!


పవన్ జీప్ నంబర్ 2425!
'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. సరిగ్గా 20 సెకన్ల దగ్గర పాజ్ చేసి చూడండి... పవర్ స్టార్ జీప్ నుంచి కిందకు దిగుతారు. ఆ జీప్ మీద టీఎస్ 09 పి 2425 అని ఉంటుంది!


ఒక్కసారి వెనక్కి వెళితే... 'గబ్బర్ సింగ్'లో పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి నడుపుతారు. దాని నంబర్ చూస్తే... ఏపీ 27 జీఎస్ 2425! 'దువ్వాడ జగన్నాథం డీజే' సినిమాలో అల్లు అర్జున్ నడిపిన బజాజ్ చేతక్ చూశారా? దాని నంబరూ 2425!


గబ్బర్ సింగ్, భగత్ సింగ్, డీజే... ఈ ముగ్గురి వెహికల్స్ నంబర్ ఒక్కటే కదూ! ఇది కో ఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? కాదు! వెహికల్స్ నంబర్స్ మాత్రమే కాదు, ఈ మూడు సినిమాలకూ దర్శకుడు ఒక్కరే... హరీష్ శంకర్! ఆయన సొంత కారు నంబర్ కూడా 2425!


దర్శకుల్లో కొంత మందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. హరీష్ శంకర్ (Harish Shankar)కు 2425 నంబర్ అంటే సెంటిమెంట్ అట! హీరోలు నడిపే బళ్లకు ఆ నంబర్ పెట్టడం లక్కీగా ఫీల్ అవుతారట! అందుకే, 'ఉస్తాద్ భగత్ సింగ్' బండి నంబర్ 2425 అయ్యింది. అలాగని, అన్ని సినిమాల్లో సేమ్ నంబర్ ఉంటుందని కాదు. 'గద్దలకొండ గణేష్'లో హీరో వరుణ్ తేజ్ కార్ నంబర్ ప్లేట్ మీద 'గణేష్' అని రాసి ఉంటుంది. 'రామయ్యా వస్తావయ్యా'లో సమంత కారుకు కూడా 2425 నంబర్ ఉంటుంది. అదీ సంగతి!


Also Read : సునిశిత్‌ను చితకబాదిన మెగా ఫ్యాన్స్ - ఉపాసనకు సారీ


హరీష్ శంకర్ నంబర్ సెంటిమెంట్ పక్కన పెట్టి... 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విషయానికి వస్తే, గ్లింప్స్ రెస్పాన్స్ చిత్ర బృందానికి చాలా సంతోషాన్ని ఇస్తోంది. ''గబ్బర్ సింగ్' పదేళ్ళ అభిమానుల ఆకలి తీరిస్తే... ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నా పదకొండేళ్ల ఆకలి'' అని హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 35 ఎంఎం థియేటర్లో జరిగిన గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు.


Also Read : 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?



పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల ఓ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, 'కేజీఎఫ్' అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, 'టెంపర్' వంశీ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : చోటా కె. ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : ఆనంద్ సాయి, యాక్షన్ (పోరాటాలు) : రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రావిపాటి చంద్రశేఖర్, హరీష్ పాయ్,  సీఈవో : చెర్రీ,  ఛాయాగ్రహణం : అయనంకా బోస్, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, రచన - దర్శకత్వం : హరీష్ శంకర్ ఎస్.