కథానాయకుడు అంటే కొన్ని లెక్కలు ఉంటాయ్! అందులోనూ తెలుగులో కమర్షియల్ సినిమా కథానాయకుడు అంటే మరిన్ని లెక్కలు ఉంటాయ్! ఆ లెక్కల్ని తారుమారు చేసిన హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఇవాళ ఆయన్ను అభిమానులు, ప్రేక్షకులు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అంటున్నారు. ఆ మాస్ ఇమేజ్ వెనుక ఆయన చేసిన ప్రయోగాలు ఉన్నాయి. మాస్ హీరోగా ఆయన అటువంటి ప్రయోగాలు చేయడం సాహసమే. 


'టెంపర్' క్లైమాక్స్... 
ఎవరైనా చేస్తారా!?
హీరోగా ఎన్టీఆర్ చేసిన అతి పెద్ద ప్రయోగం 'టెంపర్' క్లైమాక్స్. ఆ సినిమా (Temper Movie)కు ముందు పూరి జగన్నాథ్ ఫ్లాపుల్లో ఉన్నారా? హిట్టుల్లో ఉన్నారా? అనేది పక్కన పెడితే... సినిమా చూశాక, మరొక హీరో అయితే అటువంటి క్లైమాక్స్ చేస్తారా? అనే సందేహం వస్తుంది. దోషులకు శిక్ష పడటం కోసం హత్యాచార నేరాన్ని హీరో తనపై వేసుకుంటాడు. చివరకు, ఆ విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. అయితే, నేరం చేసిన వ్యక్తుల్లో తానూ ఉన్నానని హీరో చెబితే ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో చెప్పడం కష్టం. థియేటర్ నుంచి బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది. అత్యాచారం చేసిన మనిషి సమాజం దోషిగా చూస్తుంది. హీరోను దోషిగా చూపించడం అంటే సామాన్య విషయం కాదు. అటువంటి క్లైమాక్స్ యాక్సెప్ట్ చేసిన తారక రాముడికి సెల్యూట్ చేయాల్సిందే!


'ఆర్ఆర్ఆర్'నే తీసుకోండి... 
'కొమురం భీముడో' ప్రయోగమే!
మన తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన 'ఆర్ఆర్ఆర్'ను తీసుకోండి... 'కొమురం భీముడో' పాట ప్రయోగమే. అందులో ఎన్టీఆర్‌ను రామ్ చరణ్ కొరడాతో కొడుతూ ఉంటారు. ఆ పాటలో ఎన్టీఆర్ నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది. కానీ, ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే... రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ సీనియర్. పైగా, ఇద్దరికీ మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తనను చరణ్ కొట్టడం ఏమిటి? ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో? అని ఎన్టీఆర్ ఆలోచిస్తే ఆ సాంగ్ వచ్చేది కాదు. సినిమా దర్శకుడు రాజమౌళి అయినప్పటికీ... అభిమానుల గురించి కూడా స్టార్ హీరోలు ఆలోచించాలి కదా! ఆ లెక్కలు పక్కన పెట్టబట్టే నటుడిగా ఎన్టీఆర్ మరో మెట్టు ఎదిగారు.


యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్సూ మారాయ్
ఇప్పుడు లుక్స్ పరంగా తెలుగు హీరోలందరూ చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు. ప్రతి సినిమాకు లుక్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కొన్నేళ్ల క్రితం ఈ ట్రెండ్ లేదు. ఒకేలా ఉండేవారు. అప్పట్లో ఎన్టీఆర్ బొద్దుగా ఉండేవారు. జక్కన్న రాజమౌళి సలహాతో బరువు తగ్గారు. 'కంత్రి'కి బాగా సన్నబడ్డారు. అందులో లుక్ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయ్! ఆ తర్వాత ఎన్టీఆర్ స్టైల్ & లుక్స్ పూర్తిగా మారాయి. 
'బృందావనం' కోసం ఎన్టీఆర్ గడ్డం తీసేసి, మీసాలు చాలా చిన్నగా చేశారు. ఇక, 'ఊసరవెల్లి'లో అయితే... అప్పటి వరకు ఎన్టీఆర్ మాస్ అన్నవాళ్ళు, ఆయనలో స్టైల్ గుర్తించారు. ఎవరూ ఊహించని విధంగా తారక రాముడిని ప్రేక్షకులకు చూపించిన ఘనత దర్శకుడు సుక్కూదే. అదేనండీ... సుకుమార్! 'నాన్నకు ప్రేమతో'లో ఎన్టీఆర్ లుక్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో డిఫరెంట్ బెస్ట్ లుక్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న కథానాయకుడే 'టెంపర్', 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించి అందరి చేత ఔరా అనిపించారు.


Also Read : 'బిచ్చగాడు 2' రివ్యూ : సెంటిమెంటే కాదు, యాక్షన్ & థ్రిల్ కూడా - విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?


చిన్న వయసులో ఫ్యాక్షన్ సినిమా చేసిన హీరో ఎన్టీఆరే. అంతేందుకు... ఈతరం హీరోల్లో అందరి కంటే ముందు పౌరాణిక సినిమా చేసిన హీరో కూడా ఆయనే. బాల రాముడిగా నటించి మెప్పించారు. గుణశేఖర్ దర్శకత్వంలో 'బాల రామాయణం' చేశారు. 'యమదొంగ' తీసుకోండి... ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్ స్టార్ హీరోలు అందరిలో ముందుగా సోషియో ఫాంటసీ చేసిన కథానాయకుడు కూడా ఎన్టీఆరే.


Also Read : తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?