సినిమా రివ్యూ : పరేషాన్ 
రేటింగ్ : 2.75/5
నటీనటులు : తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత తదితరులు
ఛాయాగ్రహణం : వాసు పెండమ్
సంగీతం : యశ్వంత్ నాగ్
సమర్పణ : రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్)
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి  
రచన, దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్ 
విడుదల తేదీ: జూన్ 2, 2023


తిరువీర్ (Thiruveer) చేసిన సినిమాలు తక్కువే. కానీ, నటుడిగా అతనిలో ఎంత ప్రతిభ ఉందనేది ఆ సినిమాలు చెప్పాయి. 'మసూద' విజయం తర్వాత ఆయన నటించిన సినిమా 'పరేషాన్' (Pareshan Movie). దీనికి రానా దగ్గుబాటి చిత్ర సమర్పకులు కావడంతో అంచనాలు పెరిగాయి. మరి, ఈ సినిమా ఎలా ఉంది (Pareshan Movie Review)?


కథ (Pareshan Movie Story) : ఐజాక్ (తిరువీర్) తండ్రి సమర్పణ్ (మురళీధర్ గౌడ్) సింగరేణి ఉద్యోగి. తండ్రి కష్టపడుతుంటే కుమారుడు ఏమో దోస్తులతో తిరుగుతూ చదువు మీద దృష్టి పెట్టడు. ఐటిఐ ఫెయిల్ అవుతాడు. తన ఉద్యోగం కుమారుడికి రావాలంటే డబ్బులు కట్టాలని (లంచం ఇవ్వాలని) పెళ్ళాం చేతి బంగారు గాజులు అమ్మి మరీ కొడుకు చేతిలో పెడతాడు సమర్పణ్. కొడుకు ఏమో దోస్తులకు అవసరం వచ్చిందని ఆ డబ్బంతా వాళ్ళకు సమర్పిస్తాడు. దోస్తులతో జల్సాలు, షికార్లకు తోడు శిరీష (పావని కరణం)తో ప్రేమ శారీరక సంబంధం వరకు పోతది. ఆమెకు ఓ రోజు వాంతులు కావడంతో కడుపు వచ్చిందని నానా గాబర పడతది. పట్నం పోయి పరీక్షలు చేయించనీకి ఐజాక్ దగ్గర పైసల్లేవ్. దోస్తులను అడిగితే ఇయ్యరు. ఆ తర్వాత ఏమైంది? ఐజాక్ & దోస్తులకు, పక్కపంటి ఊరు పిల్లగాళ్లకు గొడవ ఏంది? పైసలు దోస్తులకు ఇచ్చిండని, ఓ పిల్లతో ప్రేమలో ఉన్నాడని తెలిసిన సమర్పణ్ కొడుకును ఏం చేశాడు? చివరకు ఏమైంది? ఈ కథ ఏ తీరానికి చేరింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Pareshan Review) : తెలుగు సినిమా ఇప్పుడు తెలంగాణ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. తెలంగాణ నేపథ్యంలో కథలను తెరకెక్కిస్తోంది. 'జాతి రత్నాలు', 'బలగం', 'దసరా'... ఈ కోవలో మరికొన్ని చిత్రాలు వచ్చాయి. అయితే, తెలంగాణ ఆత్మను కొన్ని చిత్రాలే ఆవిష్కరించాయి. అందులో 'పరేషాన్' కూడా చేరుతుంది.


'పరేషాన్'లో అందమంతా తెలంగాణ నేటివిటీలో, ఆ క్యారెక్టర్లలో ఉంది. కథేమీ కొత్తది కాదు... ఆవారాగా తిరిగే కొడుకు, తిట్టే తండ్రి, అమ్మాయితో ప్రేమకథ, ఓ సమస్య, చివరలో హ్యాపీ ఎండింగ్ - 'పరేషాన్'లోనూ అంతే! కథలో కొత్తదనం లేదు. కానీ, ప్రతి కామెడీ సన్నివేశంలోనూ తెలంగాణ కొట్టొచ్చినట్టు కనపడింది. క్యారెక్టర్ డిజైనింగ్‌లో అసలు కల్మషం లేదు. దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు. 'వెలుగు వెలుగు...' సాంగ్ అందర్నీ నవ్విస్తుంది. క్రైస్తవ మత ప్రార్థనలు, మందు తాగే కొన్ని కామెడీ సీన్లను విశ్లేషించలేం... చూసి నవ్వుకోవాలంతే! ఇంటర్వెల్ ముందు ఉన్నంత కామెడీ ఆ తర్వాత లేదు... తగ్గింది.


కామెడీ నుంచి ఎమోషన్‌కు వచ్చిన ప్రతిసారీ సినిమా డల్ అయ్యింది. తెలంగాణ నేపథ్యం అంటే తాగుడును గ్లోరిఫై చేస్తున్నట్టు అనిపించింది. మరీ అంత ఎక్కువ మద్యపానాన్ని చూపించాల్సిన అవసరం లేదేమో!? తెరపై తెలంగాణ పల్లె ఆత్మను చక్కగా ఆవిష్కరించారు కానీ కథలో ఆత్మ ఉందో? లేదో? చూసుకోలేదు. కామెడీ మీద భారం వేసి బండి లాగించారు. తాగుడు సీన్లు కొన్ని రిపీటెడ్ అనిపిస్తాయి.  


'పరేషాన్'కు యశ్వంత్ నాగ్ అందించిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్! 'వెలుగు వెలుగు...' సాంగ్ నవ్విస్తే, 'సౌ సారా...' కొన్నాళ్ళు బారాత్, పబ్బుల్లో వినపడే ఛాన్స్ ఉంది. 'ముసి ముసి నవ్వుల మంజుల...' సాంగ్ ప్రేక్షకులకు గుర్తు ఉంటుంది. ఆ పాటలు అన్నిటిలో లిరిక్స్ భలే కుదిరాయి. సంభాషణల్లో తెలంగాణ చక్కగా వినిపించింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఓకే.


నటీనటులు ఎలా చేశారు? : పాత్ర ఏదైనా సరే తిరువీర్ పరకాయ ప్రవేశం చేస్తూ... ప్రాణం పోస్తున్నారు. 'పరేషాన్'లో ఇన్ షర్ట్ చేసుకోవడం నుంచి షూ వేసుకోవడం వరకు... ప్రతి సన్నివేశంలో క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా అంటే తండ్రి పాత్రలకు మురళీధర్ గౌడ్ కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఇందులో హీరో తండ్రిగా మరోసారి మంచి నటన కనబరిచారు. హీరో స్నేహితులుగా నటించిన ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఆయా పాత్రల్లో వేరొకరిని ఊహించలేం.


Also Read : స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?


చివరగా చెప్పేది ఏంటంటే? : స్క్రీన్ మీద ఉన్నోళ్ళకు పరేషాన్... థియేటర్లలో ఆ స్క్రీన్ ముందు ఉన్నోళ్ళకు ఫన్. 'మసూద'తో భయపెట్టిన తిరువీర్... ఇప్పుడీ 'పరేషాన్'తో నవ్విస్తారు. అందులో డౌట్ లేదు. సినిమా ప్రారంభమే ఆ తెలంగాణ పల్లెలోకి దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ తీసుకువెళ్లారు. కథలో విషయం తక్కువ, కామెడీ ఎక్కువ! సోసోగా ఉన్న కథకు మ్యూజిక్ హెల్ప్ అయ్యింది. కామెడీ కోసం వీకెండ్ సరదాగా ఓసారి చూసేయొచ్చు.


Also Read : 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా?